22, అక్టోబర్ 2011, శనివారం

ఎందరో మహానుభావులు!

వీక్ పాయింట్, ఆంధ్రభూమి: తమ్ముడు తమ్ముడే. పేకాట పేకాటే. రాజకీయం రాజకీయమే. వ్యాపారం వ్యాపారమే.

తెలంగాణ వాదులంటే సమైక్యవాదులకు చిర్రు. సమైక్యవాదులంటే తెలంగాణ వాదులకు గుర్రు. వారినీ వీరినీ ఎగదోసేదీ, ఆగర్భశత్రువుల్లా కొట్లాడుకునేట్టు చేసేదీ వారికీ వీరికీ నెత్తినెక్కిన నేతలు. పాపం, ఆ పుణ్యాత్ములూ జనాన్ని రెచ్చకొట్టి ఊరుకోరు. తమలో తాము కూడా తీవ్రాతి తీవ్రంగా, ఘోరాతి ఘోరంగా కలహించుకుంటారు. తెల్లారితే ఒకరినొకరు అనరాని, వినరాని బండబూతులతో టీవీల్లో, పత్రికల్లో చడామడా తిట్టేసుకుంటారు. అది చూసి మా ప్రాంతం కోసం, మా క్షేమంకోసం మా నాయకులు ఎంత చండ ప్రచండంగా పోరాడుతున్నారోనని వెర్రిజనం తెగ ముచ్చటపడతారు.

వారికి అర్థం కానిది ఏమిటంటే... సుందోపసుందుల్లా అంత భీకరంగా పోట్లాడుకునే నాయకులే తమకు దిక్కుమాలిన అక్కర వచ్చినప్పుడు, పార్టీ వైరాలను తీసి గట్టున పెట్టి, ప్రాంతీయ మమకారాలను పక్కకు నెట్టి పాపభీతి లేకుండా చాటుమాటున చేతులు కలుపుతారు. పగలు పగవాళ్లలా ఒకరిమీద ఒకరు కత్తులు దూసుకునే వాళ్లు కూడా చీకటి వ్యాపారాల్లో పాలూ నీళ్లలా కలిసిపోతారు. వాళ్ల మాటలు నమ్మి, వెర్రిజనం చొక్కాలు చించుకుని తమలో తాము కలబడి, కొంపలు తగలెట్టుకోవలసిందే తప్ప - వారిని రెచ్చగొట్టే నాయకశ్రీల మధ్య ఎక్కడలేని ఐకమత్యం.

పోలవరం ప్రాజెక్టు కడితే రక్తం ఏరులైపారుతుందని తెలంగాణ రాజకీయ వీరులు ఎప్పటినుంచో వార్నింగులిస్తున్నారు. తెలంగాణ వాసులకు తీరని అన్యాయం చేసే ప్రాజెక్టుకు అనుమతులివ్వకూడదు; టెండర్లను తెరవకూడదంటూ కింది నుంచి సుప్రీంకోర్టు దాకా కేసుమీద కేసు పెట్టారు. ఆ ప్రాజెక్టు అడుగు ముందుకు కదిలితే తెలంగాణకు కలగబోయే అరిష్టాలూ, అనర్థాల గురించి తెలంగాణ గుండె చప్పుడు పత్రిక మొన్నటిదాకా రంకెలు పెట్టింది. వాటిని ఆలకించి తెలంగాణ జనం బ్లడ్ ప్రెషర్ పెంచేసుకుని భగభగలాడుతూండగానే అదే పత్రిక యజమానికి సంబంధించిన కంపెనీ అదే పోలవరం ప్రాజెక్టును కట్టించే కాంట్రాక్టును చడీ చప్పుడు కాకుండా అప్పనంగా కొట్టేసింది.

అంటే - తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించేవారే తెలంగాణ నోట మన్నుకొట్టే ప్రాజెక్టునూ స్వహస్తాలతో కట్టిస్తారన్నమాట!

పోనీ - ఈ సంగతి అల్లరయ్యాకైనా తెరాస నాయకశ్రీలు దిగ్భ్రాంతి చెందారా? జరిగింది తప్పు అని ఒక్కరైనా ఖండించారా? లేదు. కాంట్రాక్టు కొట్టేసిన కంపెనీలో మావాడి వాటా 3 శాతం మాత్రమే లెమ్మని వెనకేసుకొచ్చారు. తెరాసీయులూ, తక్కుంగల తెలంగాణ ఉద్యమకారులూ ద్వేషించే రెండు కళ్ల చంద్రబాబు ఇలాకా వాళ్లదే పేద్ధవాటా అని వాదులాడుతున్నారు. అంటే - చేసింది తప్పా కాదా అన్నది పాపంలో వాటా ఎక్కువా తక్కువా అన్నదాని మీద ఆధారపడుతుందన్నమాట. తెలంగాణ వాది పోయిపోయి సమైక్యవాదులతో వ్యాపారం కోసం చేతులు కలిపి, తెలంగాణ కొంప ముంచుతుందంటున్న ఆంధ్రా ప్రాజెక్టు కట్టుబడికి ఓ చెయ్యి వేయటం అంతా రైటేనన్నమాట.
మనలో మనకు ఎన్ని గొడవలైనా ఉండనీ. బయటి శత్రువుల దగ్గరికి వచ్చేసరికి మనం మనం ఒక్కటే - అంటాడు భారతంలో ధర్మరాజు. కొంచెం తేడాతో మన నాయకరత్నాలూ అదే టైపు. వారిలో వారికి కొన్ని గొడవలైనా ఉండనీ! పార్టీలూ, ప్రాంతాలూ, వాదాలూ, విధానాలూ వేరు వేరేకానీ! జనం కంట్లో కారం కొట్టి తమ పబ్బం గడుపుకునే విషయంలో వారూ వారూ ఒక్కటే. జనాన్ని ఎంత విడదీసినా, మన నాయకుల మధ్య వ్యాపార సంబంధాలు, కుటుంబ బాంధవ్యాలు, రహస్య ప్రేమానుబంధాలు షరామామూలే.

తెలంగాణ ఉద్యమం ఉద్ధృతంగా సాగుతున్న సమయాన జై తెలంగాణ అంటూ బోనమెత్తుకున్న పాలమూరు మంత్రమ్మ, సమైక్యాంధ్ర కోసం కడదాకా పోరాడతానని ఘోషించిన నెల్లూరు మంత్రయ్య ఎంచక్కా వియ్యమందలేదా? ఆంధ్రోళ్లను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టే తెరాస యువరాజు తనకు ఆంధ్రావాళ్లతో వ్యాపార సంబంధాలు బాగానే ఉన్నాయని స్వయంగా ఒప్పుకోలేదా? సాక్షాత్తూ తెరాస మారాజే లక్షలమంది సాక్షిగా తన ప్రియశత్రువు లగడపాటికి ఐ లవ్ యూ చెప్పలేదా? వై.ఎస్. జలయజ్ఞాన్ని తెలుగుదేశీయులు ఒక చెంప అడ్డంగా తిట్టిపోస్తూండగానే వారి పార్టీ పెద్దాయన అదే జల యజ్ఞంతో భారీ కాంట్రాక్టు కొట్టెయ్యలేదా? ఎమార్ గోల్‌మాల్‌పై నారా బాబూజీ అలుపెరగని పోరాటం సాగిస్తూండగానే ఆయన కుటుంబీకులకు అదే ఎమార్ దందాలో కారు చౌకగా స్థలం దక్కిన వైనం ఎవరికి తెలియదు? ఆ మాటకొస్తే అందులో అందినకాడికి ప్లాట్లు నొక్కెయ్యకుండా ఏ పార్టీవాళ్లు మడికట్టుకు కూచున్నారు?

ప్రభుత్వం రెక్కలు విరచడానికి ఏకధాటిగా సకల జనుల సమ్మె చేపట్టి అందులో భాగంగా బడులూ, కాలేజీలూ వారాలతరబడి బందు చేయంచి, సామాన్య విద్యార్థుల చదువులు పాడుచేసినవారు తమ బిడ్డలను మాత్రం తాము ద్వేషించే సీమాంధ్రలోని విద్యాసంస్థల్లో ముందే జాగ్రత్తపడి చేర్పించలేదా? మిగతా విద్యాసంస్థలను తెరవబోతే రాళ్లేయంచి నానా ఆగం చేసిన వాళ్లు తమ ఇంటి చిన్నారులు చదివే ఖరీదైన కార్పొరేట్ చదువుల దుకాణాలపై మాత్రం దాడి జరగకుండా చూసుకోలేదా? సమ్మె కట్టించి సకల జనులను నానా బాధలకు గురిచేసిన నేతాశ్రీలు సమ్మె కారణంగా తాము నష్టపోయన దాఖలాలున్నాయా? రాజకీయ నాయకులు పొద్దునే్న వచ్చి కాసేపు మొగం చూపించి, మళ్లీ ఎవరి కాంట్రాక్టులను వాళ్లు, ఎవరి వ్యాపారాలు వాళ్లు చూసుకుంటున్నారని తెలంగాణ ఉద్యోగుల నాయకుడే కుండబద్దలు కొట్టలేదా? ఆంధ్రోళ్ల పేరు చెబితే భగ్గుమనే తెలంగాణ హేమాహేమీల్లో ఎంతమంది ఆంధ్రా పెట్టుబడిదారులతో కుమ్మక్కయ నదీనదాల్లో అక్రమంగా ఇసుక తోడేస్తూ, కొండలు, గుట్టలు ముక్కలు చేస్తూ తెలంగాణ రుణం ఎంత బాగా తీర్చుకోవటం లేదు?

ఇలా చెబుతూపోతే ఎందరో మహానుభావులు!

- సాక్షి 

2 కామెంట్‌లు:

  1. ee tikka naakodukulaki burra arikalulo unte enni cheppi upayogam endanna.

    రిప్లయితొలగించండి
  2. We the public and common people are made fools. The politicians are always friends and have proximity among them. We have to realise about the evil intentions of so called leaders. Please wake up and do not get into the trap of these politicians of any region.

    రిప్లయితొలగించండి