26, అక్టోబర్ 2011, బుధవారం

గమ్యం చేరని ఉద్యమం

ఆంధ్రజ్యోతి సంపాదకీయ పేజీ: కార్ల్ పాపర్ అనే సామాజిక శాస్త్రవేత్త చెప్పినట్లు సామాజిక శాస్త్రజ్ఞుడికి రెండు లక్షణాలు తప్పక ఉండాలి. ఒకటి వాస్తవాలను పరిశీలించడం, వాటిని ఒకదానితో ఒకటి ముడిపడివున్నవని గ్రహించడం. రెండవది ఆ వాస్తవాల ఆధారంగా ఆ నిర్దిష్ట సమస్య మీద ఒక ప్రెడిక్షన్ చెయ్యడం. ఒక దాన్ని 'వ్యరిఫయబిలిటీ' అని, మరోదాన్ని 'ప్రెడిక్టబిలిటీ' అనీ అంటారు.

2009 డిసెంబర్ 9 నాటి చిదంబరం ప్రకటన ఏ వాస్తవాల నేపథ్యంలో వచ్చింది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కె.విపి.రామచంద్రరావు, వారి చుట్టూ రూపొందిన మంత్రులు, శాసనసభ్యులు ప్రభుత్వాన్ని పడగొట్టి తాము తిరిగి రాజకీయ అధికారంలోకి రావాలనే ఒక బలమైన ప్రక్రియ నడుస్తున్నప్పుడు, అకస్మాత్తుగా తెలంగాణ సమస్య మళ్ళీ తెరమీదికి వచ్చింది. ఆనాడు దాదాపు 140 మంది శాసనసభ్యులు, ముప్పావు మంత్రి మండలి జగన్-కెవిపి చెప్పుచేతల్లో ఉన్నారు.

అయినా కాంగ్రెస్ అధిష్ఠానం జగన్‌ను ముఖ్యమంత్రిని చెయ్యడానికి సిద్ధంగా లేదు. తమ ప్రభుత్వాన్ని కూలగొట్టకుండా చూసుకోవడం ఆనాడు కాంగ్రెస్ ముందున్న రాజకీయ కర్తవ్యం. ఇక్కడ కాంగ్రెస్ బచ్చాగా భావించే జగన్ ప్రభుత్వాన్ని కూలగొడితే కేంద్రంలో సోనియా గాంధీ రాజకీయ నైతిక ఆధిక్యతకు ఎంతో ప్రమాదమున్న రోజులవి.

ఈ దశలోనే టిఆర్ఎస్ నేత అన్నిరకాలుగా బలహీనంగా ఉన్నందు వల్ల అతనిచే 'ఉపస ఉద్యమం' చేయించి తెలంగాణపై తెగకుండా ముడులుపెట్టే ప్రకటన చేయాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ కొచ్చింది. ఇక్కడే తెలంగాణ ప్రాంతానికి మూడవ దశ 'ఉద్యమ ఉరితాడు'ను కాంగ్రెస్ బిగించింది. డిసెంబర్ 9న 'తెలంగాణ రాష్ట్ర నిర్మాణ ప్రక్రియ మొదలైంది. అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం పెడుతుంది' అన్న ప్రకటన ఒకవైపు జిత్తుల ఆశను తెలంగాణ ప్రజల ముందుపెట్టి రెండవ వైపు జగన్, కెవిపి ఆటలను కట్టించే మ్యాఖవెల్లియన్ రాజకీయం చేసింది.

కాంగ్రెస్ నుంచి ఇక్కడ స్వరాష్ట్ర నినాదం, అక్కడ సమైక్య నినాదం ఏకదాటిన రప్పించి ముందు జగన్-కెవిపిల ఆటకట్టి వేశారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు మరోపని అప్పచెప్పారు. అదే రెండు ప్రాంతాల్లో ఉద్యమాలు. ఈ స్వయం సృష్టి ఉద్యమం ద్వారా చేతుల జారకుండా కాల్పులు జరగకుండా డబ్బు మార్పిడి అటు నుంచి ఇటు, ఆత్మహత్యల పేరుతో రాజకీయ హత్యలు జాగ్రత్తగా జరగనిచ్చారు. సాధారణ తెలంగాణ ప్రజల్లో తెలంగాణ ఇక వచ్చే స్తుందనే భ్రమను కేంద్రమే కల్పించి, అది జరక్కుండ ఉండేందుకు రాజకీయ రంగాన్ని నిత్య నాటకంగా జరగనిచ్చారు.

1969 ఉద్యమానికి, ఇప్పటి ఉద్యమానికి ఒక ప్రధాన తేడా ఏమిటంటే అప్పుడు తెలంగాణ ఇచ్చే సమస్యే లేదని మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కనుక కాల్పులు, నిర్బంధం నిరంతరంగా కొనసాగించింది. ఉద్యమంలో డబ్బు వ్యాపారానికి ఆస్కారం లేదు. ఆనాడు అంత డబ్బు కూడ రాష్ట్రంలో లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే మరో సమస్యను పరిష్కరించేందుకు ఉద్యమాన్ని సృష్టించింది. కనుక అది కాల్పులకు పూనుకోలేదు.

కొంత మంది విద్యార్థులు తప్ప నాయకులు, పాత ఉద్యమ జీవులు, కొత్తగా ఉద్యోగ రంగం నుంచి సృష్టించబడినోళ్ళు ప్రభుత్వ బంధువులగా తిరగనారంభించారు. అటు, ఇటు నాయకులు తిట్టుకున్నట్లు కనబడినా డబ్బు లావాదేవీలు బాగా నడిచాయి. తెలంగాణలోని పై నాయకత్వానికి ఖర్చుకు మించిన ఆదాయం పెరిగి 'ఉద్యమ వ్యాపారాలు' చాలా పుట్టుకొచ్చాయి. 1969లో ఇవి మనకు కనపడవు. ఆంధ్రులు పదవుల ఆశలు చూపారు కాని పైసలు అంతగా ఇవ్వలేదు.

ప్రపంచంలో ఏ ఉద్యమంలో లేనిది, తెలంగాణలో కూడ ఎప్పు డు లేనిది ఆశాజీవులను 'ప్రేరేపించి చంపడం' అందులో నాయకు లు కుల-వర్గాల వారినికాక మొదటి తరం విద్యారంగంలోకి వచ్చిన అమాయకులను చావుకు 'ఉరికి పురికొల్పడం' మనం మొదటిసారి చూస్తాం. తడిగుడ్డతో తలకోసినట్లు, ఉద్యమంలో డబ్బు, పలుకుబడి సంపాదించుకోవడం ఒకవైపు 'అమాయక జీవుల చావులు' మరో వైపు ఒకే నాణానికి బొమ్మ, బొరుసులా సాగాయి.

విద్యా రంగంలో తమ కర్తవ్యాన్ని ఎప్పుడూ సీరియస్‌గా నిర్వహించని మేధావి బృందమొకటి రెండు ప్రాంతాల్లో కమిటీలేసుకుని కట్టలు సంపాదించడం మనకు మొదటిసారి కనిపిస్తుంది. అయితే తెలంగాణలో బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీలు చదువుకొనే అన్ని విద్యాసంస్థలను నిరంతరంగా మూయించడం, బంద్‌ల ద్వారా కూలి, నాలి జనాల నిత్య జీవితాన్ని మరింత పాడు చెయ్యడం ఒక అవసర ఉద్యమంగా ముం దుకు తెచ్చారు. సకల జనుల సమ్మెతో దాన్ని పరాకాష్టకు చేర్చారు. దీనికి గైడెన్స్ కూడ కాంగ్రెస్‌దే. తెలంగాణ వెనుకబడిందని చెబుతూనే ఇక్కడ వెనుకబడినవారిని ఎప్పుడు పైకి రాకుండా ప్రభుత్వ స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు నిరంతరం మూసేసి వారిని రోడ్లమీద నిలబెట్టకపోతే రాష్ట్రాన్ని ఎట్లా సాధిస్తామని, సంపాదించే వారు, ప్రభుత్వ బంధువులు సిద్ధాంతం చెప్పడం మనం చూస్తాం.

ప్రభుత్వం అసలు నాయకులను గాని, అగ్రకుల మేధావులనుగాని తీవ్ర నిర్బంధంలోకి నెట్టిన స్థితి కూడ లేదు. వారిని చాలా గౌరవంగా చూస్తున్నారు. కేంద్రం రాల్చదల్చుకోని తెలంగాణను రాలుస్తానని చెప్పింది కనుక దానికి రాళ్ళు కొడుతూనే ఉండడం ఉద్యమ కర్తవ్యమైంది. తాను కాల్పుల్లో చంపకుండా, యువత స్వయంగా చస్తున్నట్లు చూపబడుతున్న హత్యాకాండలో అందరికీ ఒక ఆనందం కనిపించింది.

వెనుకటి కాలంలో స్త్రీలను చంపి సతి అయిందని శవానికి మొక్కినట్లు నేతల-మేధావుల మొక్కుళ్ళు కూడ మొదటిసారి చూస్తున్నాం. తెలంగాణ రాదని అర్థమైనా దానికి మరో రెండు రాళ్ళు కొట్టి, అట్లా కొట్టని వాళ్ళను తిట్టడం కూడ ఇప్పుడొక ఉద్యమమైంది. ఉద్యమం ఊపు పెరిగితే చావులు పెరుగుతున్నాయి. ఊపు తగ్గితే చావులు తగ్గుతున్నాయి. ఇది ప్రపంచంలోనే మొదటి వింత. ఆంధ్ర పెట్టుబడి ప్రభుత్వం పిల్లలు చస్తూంటే సంతోషిస్తూ, ఉద్యమ నాయకులను ఎనలేని విధంగా గౌరవిస్తూంది. ఎందుకు? ఈ మొత్తం ప్రక్రియ వల్లనే పడిపోయే ప్రభుత్వం నడుస్తూ ఉంది.

కనుక దాన్ని పడగొట్టడానికి సిద్ధంగా వున్న దేవుని బిడ్డ రెండు మతాల మధ్య ఊగిసలాడడం వలనో ఏమో 'శ్రీకృష్ణ జన్మస్థానం' పోయే రోజులు దగ్గరపడుతున్నాయి. అంటే చిదంబరం చిటుకు బాగానే పనిచేసింది. ఇక్కడ మనం మీడియా మీమాంసను కూడ జాగ్రత్తగా చూడాలి. ఒకవైపు రాలని తెలంగాణకు 1969 నుంచి రాళ్ళు కొడుతూనే ఉంటే, స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీల్లో పాఠాలు నేర్చుకోవడానికి బదులు విద్యార్థులు, ధూమ్‌ధామ్ చెయ్యడం, బతుకమ్మ లాడడం, టివి ఛానళ్ళకు కన్నుల పండుగైంది.

ధనవంతులు కాక, బీదోళ్ళంత రోడ్లమీద వంటలు చేసుకు తింటుంటే, దీనిని ఒక ఉద్యమంగా చూపించడం ఆనందంగా ఉంది. ఈ క్రమంలోనే ఓబులాపురం ఇనుము గాలి బ్రదర్స్ ఇంట్లో బంగారమైనట్లు, జలయజ్ఞం జగన్ ఆజ్ఞతో ఇంద్ర భవనాలుగా మారినట్లు ఉద్యమ ధనం తెలంగాణ మీడియాగా మారుతుంది. మన శవాలను మన మీడియాలో చూసుకొని, వాటి గురించి చదువుకొని బడుగు మేధావులు సైతం స్వాతంత్య్రం వచ్చేసినట్లు ఉపన్యసిస్తూనే ఉన్నారు. ఇక్కడ మేధావి తనానికి కొత్త నిర్వచనం ఇచ్చారు. పరిస్థితులను రాజకీయంగా అంచనా వెయ్యడం మానేశారు.

ఈ క్రమంలోనే ఆంధ్ర పెట్టుబడిదారులకొకటి అర్థమైంది. తెలంగాణలో చదువుల పోటీ పెరగకుండా ఉండాలంటే ఉద్యమాలను నిరంతరం చేస్తూనే ఆ ప్రాంతం నుంచి కొన్ని కుటుంబాల గర్భస్త పెట్టుబడిదారుల్ని తయారుచేయాలి. ప్రాంతీయ ఉద్యమాలు కూడా పైకులాల్లో పంపిణీ సరిగా లేకపోతే ముందుకు వస్తాయి. కనుక ఇప్పుడు తెలంగాణ మీడియాకు అడ్వర్‌టైజ్‌మెంట్లు అధిక టారిఫ్‌కు, అడిగినన్ని ఇస్తూపోతే, పెట్టుబడి కొంత చేతులు మారినా 'కుల -వర్గ' ప్రయోజనాలు కాపాడుకోవచ్చు. ఈ సిద్ధాంతం అమలు చేసే క్రమంలోనే ఫోన్లమీద ప్రాంతాలకు అతీతంగా మితృత్వం, రోడ్ల మీద ప్రాంతాల వారీగా శతృత్వం చూపడం చాలా సులభమైంది.

యూపీఏ -2లో తప్పులు చేస్తూన్నట్లు కనబడుతూ ప్రభుత్వాన్ని కాపాడుకునే నూతన ప్రక్రియ పకడ్బందీగా అమలవుతోంది. ఢిల్లీలో ఒక బలమైన కమిటీ కష్టాలు తెస్తూంది, వాటిని అతి సులభంగా అధిగమిస్తుంది. ఇక్కడ జగన్ ప్రమాదం నుంచి బయటపడడం, టిడిపిని బలహీనమైన ప్రతిపక్షంగానే కొనసాగించేందుకు, తెలంగాణ ఉద్యమం, టిఆర్ఎస్‌ను బలపర్చడం రెండు అవసరమయ్యాయి.

టిఆర్ఎస్ ఢిల్లీకి ఎప్పుడూ శత్రువు కాదు. అక్కడి నుంచి వచ్చే కను సైగలను అది కనిపెడుతూనే ఉంటుంది. తెలంగాణ నాయకత్వం రాజకీయ వ్యాపారంతో ఆస్తులు పెంచుకున్నంత కాలం నిజంగా తెలంగాణ రావడం కూ డా అద్దంలో ప్రతిబింబమే. జగన్ జైలుకు పోతే మిగిలే శత్రువు టిడిపి. దానిచుట్టూ వున్న తెలంగాణ బిసిలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మత్తులో పడి టిఆర్ఎస్ చుట్టూ భజన చేస్తున్నారు.

ఈ ప్రాంతంలోని అన్ని సీట్లు 2014లో టిఆర్ఎస్ గెలిచినా కాంగ్రెస్‌కు నష్టమేమి లేదు. ఆ పార్టీ నాయకుని కుటుంబ కంపెనీల చుట్టూ పెరుగుతున్న ఆస్తుల్ని యథేచ్ఛగా పెరగనిచ్చి ఆక్రమ ఆస్తుల పెరుగుదల కర్ర చూపితే చాలు వాళ్ళు ఎక్కడ ఓటు వెయ్యమంటే అక్కడ వేస్తారు. అంతిమంగా టిఆర్ఎస్ వాపు కాంగ్రెస్ బలుపే. ఆ పార్టీ రాజకీయ అధికారం లేకుండానే 'ఉద్యమ అధికారం'తో ఈ ప్రాంతపు 'ముడుపుల పాయ' నొకదాన్ని తయారు చేసుకుంటుంది.

అదే కాంగ్రెస్‌కు కావలసింది. పాఠాలు చెప్పకుండా పంతుళ్ళకు జీతాలు, పనిచేయకుండా ఉద్యోగులకు జీతాలు, కాల్పులు లేకుండా కొంతమంది యువకులు 'అమరవీరు'లవ్వడం మొదలైన వాటితో ప్రభుత్వానికి సమస్యేమీలేదు. రాష్ట్రాన్ని విభజించి బిజెపి పన్నిన చిన్న రాష్ట్రాల వలలో పడితే కేంద్రంలో కూడా అధికారముండదని కాంగ్రెస్ వారికి తెలుసు. యూపీఏ మిత్రపక్షాలు ప్రత్యేక రాష్ట్రానికి మద్దతివ్వరనీ తెలుసు. అయినా డిసెంబర్ 9 ప్రకటన చేశారు.

ఆ మరుసటి రోజు తెలంగాణ తమ్ముళ్ళు ఫ్రెంచి విప్లవం వచ్చిందని, బట్టలిప్పుకొని ధూంధాం చేసుకుంటే, పెద్ద చదువులు చదివిన దొరసాన్లు బతకమ్మలాడారు. తెలంగాణ మేధావివర్గం సైతం 'అమ్మ పుట్టినరోజు ప్రకటించింది' అని ఫ్యూచర్ ప్లాన్లు చాలా వేసుకున్నారు. తరువాత కమిటీలొచ్చినాయి. తెలంగాణ వానరసేనకు చావులొచ్చినాయి, కేసులొచ్చినాయి. నాయకులుగా ఉన్నవారికి, కొత్తగా ఎదిగిన వారికి ఆంధ్రోళ్ళు అడిగినన్ని చందాలిచ్చి, తెలంగాణ కూడ ఇవ్వరు కదా!

తెలంగాణ ఇంక రాలే, వచ్చే అవకాశం కూడ లేదు. ఉద్యమాలు మాత్రం నడుస్తూనే ఉంటాయి. 2014 దాకా వాటి అవసరం ఇరుపక్షాలకు ఉన్నది. తెలంగాణ చదువును సంపూర్ణంగా చంపితే తప్ప ఆ ప్రాంతానికి పాత వైభవం రాదని పాటలు రాసుడు, పుస్తకాలేసుడు ఇప్పుడు ఎంతో అవసరం. తెలంగాణ-నా తెలంగాణ -విద్యావంతులు కనిపెట్టిన ఏకైక పోరాటరూపమిది.

ఈ పోరాటం 2014, ఆ తరువాత 2019... 2024 ఎన్నికల గుండా పయనిస్తూ జై తెలంగాణ నినాదంతో కొనసాగుతూనే ఉంటుంది. దాని అసలు లక్ష్యం ఈ ప్రాంతంలోని సకల బడుగుజీవుల చదువుల్ని అభివృద్ధిని, సంపూర్ణంగా చంపేయడం...చూస్తూ ఉందామా... చూస్తూనే ఉందామా... సకల జనుల చావునీ సంపదల జోరునీ...?

- కంచ ఐలయ్య
వ్యాసకర్త సామాజిక శాస్త్రవేత్త, సుప్రసిద్ధ రచయిత

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి