26, అక్టోబర్ 2011, బుధవారం

''టీ''బ్రేక్‌లో గుబులు కబుర్లు

ఆంధ్రప్రభ సంపాదకీయ పేజీ: ప్రస్తుతం ఆంగ్లపత్రికలలో మాత్రమే కాక తెలుగు ప్రచార మాధ్యమాలలో కూడా, ఇంగ్లీషు అక్షరం ‘‘టీ’’ తో మొదలై లేదా జోడించబడి వాడబడుతున్న పలు తెలంగాణకు సంబంధించిన పదబంధాలలో ‘‘ి ఇసశీ’’ ఒకటి. మరికొన్ని ఉదాహరణలు టీ కాంగ్రెస్‌ టీ టి దేశం, టీ ఉద్యోగులు, టీ చర్చలు, టీ మీటింగులు, టీ కలెక్షన్లు, టీ పొగలు, టీ సెగలు, టీ తగవు, టీ ఆందోళన, టీ సమ్మెలు వగైరా, వగైరా ఈ పదాలలోని టి అక్షరం తెలంగాణ పదానికి సూక్ష్మీకరణమని తెలుసుకదా. కొద్దిపాటి స్వోత్కర్షను అనుమతిస్తామంటే ఒక విషయం చెప్పాలి. 17 నెలల క్రితం ఈ వ్యాసకర్త హైదరాబాద్‌లో శ్రీకృష్ణ కమిషన్‌ ముందు హాజరై  టీ tangle  అన్న శీర్షికన ఆంగ్లంలో 20 పేజీలు వినతి పత్రం సమర్పించటం జరిగింది. కమిషన్‌ సభ్య కార్యదర్శి దుగ్గల్‌ టి. అక్షరం దేనికి క్లుప్త సూచికగా వాడబడిందో వెంటనే గ్రహించి, ఆ విషయాన్ని ఇతర సభ్యులతో నవ్వుతూ పంచుకుని టీ తాగుతూ నాతో టీ తో మీ పదప్రయోగం బాగుందని అన్నారు. సరే యాదృచ్ఛికంగానే కావచ్చు ఇప్పుడు, ఈ టి పద ప్రయోగాలు మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. (టి అక్షరం పవిత్రపదమైన తెలుగుకి సూచికగా గతంలోలా మళ్లీ మారిపోతే ఎంతో బాగుంటుంది కదా! సరే ఇప్పుడు వార్తాపత్రికలు టీవీ ఛానళ్లు సకల జనుల సమ్మె (నిజానికిందులో జనం పాల్గొనలేదు, ఉద్యోగులు మాత్రమే పాల్గొని వాళ్లని 'అబ్బో' అని ప్రశంసించేలా కాదు 'అబ్బా' అని బాధతో విల విల లాడేలా చేశారన్నది వేరే విషయం) సడలిన సందర్భాన్ని టి బ్రేక్‌గా ప్రస్తావిస్తున్నారు.

మీటింగులలోను, టీ బ్రేక్‌ ఉంటుంది. ప్రత్యేక రాష్ట్ర సాధనోద్యమం పేరిట జరుగుతున్న రాజకీయ ఆట ఇది కాబట్టి క్రికెట్‌ ఆటలో వచ్చే టీ బ్రేక్‌తో దీన్ని పోల్చటం అనుచితం కాబోదు. ఎందుకంటే, టెస్ట్‌ మ్యాచ్‌లలానే, ఇదీ సుదీర్ఘంగానే సాగుతోంది. ఆట ఇంకా పూర్తికాలేదు. ఆధిక్యం ప్రస్తుతానికి లేదా ఆఖరిరోజున టీ బ్రేక్‌కి ముందు ఏ జట్టుకన్నా తుది ఫలితం గురించి ఉత్కంఠ ఉంటుంది. ఓడిపోబోతున్నవాళ్లు కూడా ప్రగల్భాలు పలుకుతూనే ఉంటారు పైకి. లోలోపల ఓటమికి ఏ సాకులు చెప్పాలా, ఎవరిపై నిందలు మోపాలా అని ఆలోచించుకుంటూనే మరి ఇప్పుడు ఈ టీ విరామం సమయంలో టీ కెప్టెన్‌ ఇతర టీ ఆటగాళ్లు ఎలాంటి టీ కబుర్లు, గుబుళ్లు గుసగుసలుగా చెప్పుకుంటారో వాస్తవాధారిత కల్పనా శక్తితో ఊహించుకుందామా! మళ్లీ ఆట మొదలయ్యేవరకు ఖాళీగా ఉండకుండా ''టి కెప్టెన్‌'' కనుసైగలనర్థం చేసుకుని మిగిలిన ఆటగాళ్లు దూరంగా ఉండిపోగా వారసత్వ బలంతో జట్టులో ప్రధాన లేదా టాప్‌ ఆర్డర్‌ బాట్స్‌మెన్‌గా రూపొందిన కొడుకు, కూతురు మాత్రమే ఆయన్ని ఒక మూలకి అనుసరిస్తారు.

నాన్నోయ్‌ మేం మొదట్లో కొంచెం విముఖంగా ఉన్నా, బోలెడన్ని రాజకీయ ఆర్థిక ప్రయోజనాలుంటాయని ఆశ, నసపెట్టి జట్టులోకి లాక్కొని వచ్చేవు. ఇంతవరకు బడుల నుంచి రాబడులు, ముట్టడుల భయంతో ముడుపులు, ఓట్లెలా ఉన్నా కోట్లు బాగానే దక్కేయి. కాని ఇప్పుడో! పోలవరం పొగలు కమ్ముకుంటూ ఊపిరాడనివ్వటం లేదు. నౌకా వ్యాపారం గురించి కూడా అంతా బట్టబయలవుతుందేమోనన్న దిగులు పెరిగిపోతుంది. కరుణానిధి సంతానం గతి మాకూ పట్టకూడదంటే, జల్దీ ఏదోటి చెయ్యాలె -ప్రత్యేక రాష్ట్రానికి ప్రత్యామ్నాయంగా కుటుంబ రక్షణ ప్యాకేజీ కుదుర్చుకోవాలె! టి మేనల్లుడి గురించి ఫికరు చేయొద్దుసుమా -అతనికి అవసరమైతే ఇంకో జట్టులోకి జంప్‌ చేసేటి తెలివి తేటలున్నాయిలె. ఏందలా మన బొబ్బిలి దగ్గరి అనకాపల్లి బెల్లం కొట్టినరాయిలా గమ్మునూర్కుని ఉన్నావు. క్విక్‌ ఏదోటి చెయ్యినాన్నా చేతితో కలిసి పోవటంతో సహా అనొచ్చు.'

ఇంకో మూలకి చేరిన ఒకే సామాజిక వర్గానికి చెందిన వృత్తి ధర్మాన్ని కాలదన్ని, ప్రభుత్వంపై (ఒక ప్రాంతపు ప్రజలపై కూడా) వాచాలత్వపు బౌన్సర్లు విసిరిన ఇద్దరు ఉద్యోగ నేతల గుసగుసలిలా ఉండొచ్చు -ఉద్యమంలోకి రాకముందే కడుపులో చల్లకదలకుండా, మనపాట్లేవో పడి కొన్నిప్లాట్లు సంపాదించాం -ఏందో ఎమ్మెల్యేనో, తదుపరి మంత్రో అయిపోవాలని ఈ అగ్గిలోకి దూకుడుగా వచ్చేం -ఇప్పుడు ఉద్యమం పూర్తిగా చల్లారిపోతే ఎస్మా గిస్మా ఏసిబి, గీసిబి, విజిలెన్సు గిజలెన్స్‌ జాన్తానై అవడానికి వీలుంటుందా టోపీ పెట్టుకున్నా అవన్నీ మాఫీ అవుతయ్యా ఏం చెయ్యాలె!

ఇకపోతే వైస్‌ కెప్టెన్‌ హిజ్‌ మాస్టర్స్‌ వాయిస్‌, ఒంటరిగా నిల్చుని, ఏవో కాగితాలు చూసుకుంటున్నాడు. అవి ఆయన ఉద్యమకాలపు సాలరీ స్లిప్పులో, లీవ్‌ రికార్డుల్లో కావొచ్చు. లేదా జట్టు ఓటమి చెందిన తర్వాత టీవి వాళ్లకి గడగడా చెప్పాల్సిన సాకుల ప్రసంగపాఠాలు కావొచ్చు. ఈ జట్టులోకి వద్దంటున్నా కెప్టెన్‌ నిత్యం తిడుతున్నా, దూరిపోయి స్వపక్షంపైననే బౌన్సర్లు వేయడానికి విభజనవాద జట్టుకి బ్యాటింగు చేయడానికి శాయశక్తులా ప్రయత్నించిన టి కాంగ్రెస్‌ పేపర్‌ టైగర్లు ఇంకో మూలకి చేరి, యుటర్న్‌ తీసుకోవడానికి ఏం చేయాలో చర్చించుకుంటున్నారు. వారి చర్చల్లో వచ్చే మొదటి అంశం అమ్మ చెప్పిందే మాకు వేదం అని ముందే చెప్పలా -

''పన్నెండో ఆటగాడు'' (ఈయన పేరు చెప్పేసుకుందాం లెండి కెకె) గడ్డం పీక్కుంటూ వ్యాకరణం, ఫుల్‌స్టాప్‌లు కామాలు లేని మిశ్రమ భాషలో ఇంకో మూలన నిలబడి అక్కడున్న గోడను కాసేపు మైకుగా భావించుకుని స్వగతంగా అనుకునే మాటలు ఇలా ఉండొచ్చు -నాన్సెన్స్‌ స్టోరీ అంటే ఎస్‌టిఓఆర్‌వై కథ అని అర్థం -అడ్డం తిరిగింది -హౌ టు గెట్‌ రీనామినేషన్‌ టు రాజ్యసభ? అఫ్‌కోర్స్‌ వర్కింగు కమిటీలో మళ్లీ దూరాలె' -ఇంకా టీ టి దేశం నేతలు వీళ్లలానే ఎంతగా అడిగినా టి జట్టులో స్థానం లభించక పోయినందువలన కోపగించి, ఏదోలా ఆటకి అంతరాయం కలిగించాలని ప్లాన్లు వేసినవాళ్లు, స్టేడియం లోనే ఉన్నారు గాని, టీ జట్టు కోలుకోవాలని, టి గేమ్‌ నెగ్గాలని కోరుకోవటం లేదు. బ్లేమ్‌ గేమ్‌ ప్లాన్లు చర్చించుకుంటున్నారు.

ఇకపోతే సమైక్యవాద జట్టు సభ్యులంతా ఐక్యంగా ఉండి తలోచోటుకి పోకుండా, ఒక్క చోటుకే చేరుకుని ఈ టి బ్రేక్‌లో చర్చించుకునేది ఇలా ఉంటే బాగుంటుంది -సులభంగా నెగ్గాల్సిన మేచ్‌ని ఇంతవరకు తెచ్చుకున్నాం, అతి విశ్వాసంతో ఒక అంపైరు చిదంబరం తప్పుడు నిర్ణయం ఇంతవరకు తెచ్చింది. కనీసం రెండో అంపైరు ప్రణబ్‌ సరిగానే వ్యవహరిస్తున్నారు. అదే పదివేలు. థర్డ్‌ అంపైరు కాంగ్రెస్‌ అధిష్టానం -మేచ్‌ రిఫరీ కేంద్ర ప్రభుత్వం కూడా సరిగానే వ్యవహరిస్తారన్న విశ్వాసం ఉంది. ఐనా మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న 18 కోట్ల మంది తెలుగువాళ్లు 121 కోట్ల భారతీయుల ఆశలనూ వమ్ము చేయకూడదు. అంపైర్ల మీద ఆశలు పెట్టుకోవద్దు. మీ స్వశక్తిని నిరూపించుకుని, చిత్తశుద్ధితో సంకల్పబలంతో ఆడి గేమ్‌ గెల్చుకుందాం. ఇంకో విషయం ఓడిపోబోతున్న జట్టు వాళ్లు తమకు అలవాటైన తిట్ల పురాణాన్ని ఇంకా పెంచుతారు. మనం సంయమనం సంస్కారం చూపాలి. అంతేకాదు ఓడిన జట్టుని కించపరచకూడదు క్రీడా స్ఫూర్తిని చూపాలి.'

ఇప్పటికే తుది ఫలితం సమైక్య వాదానికి అనుకూలంగా 18 కోట్ల మంది, తెలుగు ప్రజలు (తెలంగాణవాసులు కూడా) మొత్తం 121 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షల కనుగుణంగానే ఉండబోతోందన్న సంకేతాలున్నా కొంత ఉత్కంఠ తప్పటంలేదు గాని, భయపడొద్దు -అంతా మేలే జరుగుతుంది. కాని ఇలాంటి రాజకీయ క్రీడలు మళ్లీ మళ్లీ జరగకుండా రాజ్యాంగ బద్ధమైన నిషేధం విధించాలి.

-చేగొండి రామజోగయ్య
వ్యాసకర్త విశ్రాంత బ్యాంకు అధికారి, విశాలాంధ్రమహాసభ సభ్యులు

1 కామెంట్‌: