30, అక్టోబర్ 2011, ఆదివారం

రాష్ట్ర సమైక్యతే ఇందిరమ్మకు ఘన నివాళి!

ఆంధ్రప్రభ సంపాదకీయం: 'భావోద్వేగాలతో ముడిపడి ఉన్న అంశాలపై తొందరపడి హడావుడిగా నిర్ణయాలు తీసుకుంటే అవి జాతి ప్రయోజనాలను దెబ్బతీస్తాయి. అలాంటి నిర్ణయాలు తీసుకునే వారిని భవిష్యత్‌ తరాలు క్షమించవు. తాత్కాలిక రాజకీయ ప్రయోజనం కన్నా దేశ విశాల ప్రయోజనాలే నాకు మిన్న' అని మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ దాదాపు నలభై ఏళ్ళ క్రితం జై ఆంధ్ర ఉద్యమం సమయంలో స్పష్టం చేసిన అభిప్రాయాలు నేడు మన రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు వర్తిస్తాయి. ధీరవనితగా, కలకత్తా మహాకాళీగా ఆనాటి ప్రతిపక్ష నాయకుడు అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రశంసలు అందుకున్న ఇందిరాగాంధీని పదిమంది మగవారిపెట్టు అని అమెరికా మాజీ అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌ ఓ సందర్భంలో కొనియాడారు. బ్యాంకుల జాతీయ కరణ, రాజభరణాల రద్దు వంటి సాహసోపేతమైన నిర్ణయాలను ఆమె ప్రధానమంత్రి పదవిని చేపట్టిన రెండేళ్ళకే తీసుకున్నారు. సాహసానికి పర్యాయపదంగా నేటికీ నిఘంటువుల్లో నిలిచిపోయిన ఇందిరాగాంధీ తన అంగరక్షకుల తుపాకీ గుళ్ళకు నేలకొరిగి రేపటికి (అక్టోబర్‌ 31వ తేదీ నాటికి) 27 సంవత్సరాలు పూర్తి అవుతుంది. అయినప్పటికీ ఇందిరాగాంధీ పేరు చెబితే నేటికీ ఓట్లు రాలుతాయి, రాలుతున్నాయి. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఇందిరమ్మ రాజ్యం తెస్తానన్న వాగ్దానంతోనే దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చారు.

ఇందిరాగాంధీ ఎంతటి సాహసోపేతురాలైనా, ఈ దేశ సంస్కృతీ సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, ఇంకా చెప్పాలంటే, భారతీయ సంస్కృతిని పుణికి పుచ్చుకోవడమే కాక, వాటిని పరిరక్షించడం కోసం జీవితాంతం కృషి చేశారు.

ముల్కీ నిబంధనల వంటి భావోద్వేగాలకు సంబంధించిన అంశాలపై ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు అన్ని వర్గాలతోనూ చర్చించి, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందనీ, ముఖ్యంగా, ప్రాంతీయ వాదాలు తలెత్తినప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం కాక, జాతి విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి పార్టీ నిర్ణయాలు తీసుకోవాలనీ, ఈ విషయంలో అధికారంలో ఉన్న పార్టీపై బాధ్యత మరింత ఎక్కువ ఉంటుందని ఆనాడు ఆమె పార్లమెంటులో చేసిన ప్రసంగంలో స్పష్టం చేశారు. ప్రభుత్వం అన్ని ప్రాంతాలకూ, వర్గాలకూ, ప్రజలకూ బాధ్యత వహిస్తుంది కనుక, అధికారంలో ఉన్నవారు అన్ని ప్రాంతాలకూ న్యాయం చేకూర్చే రీతిలో తమ వైఖరులను స్పష్టం చేయాలి. తాత్కాలికమైన భావోద్రేకాలకూ, ఒత్తిడులకు లోనై నిర్ణయాలు ప్రకటించకూడదు. ఈ విషయం ప్రత్యేకాంధ్ర, ప్రత్యేక తెలంగాణా డిమాండ్లకే కాక, దేశంలోని ప్రత్యేక రాష్ట్రాల కోసం ఉద్యమాలు సాగుతున్న విదర్భ, గూర్ఖాలాండ్‌ వంటి డిమాండ్లకు కూడా వర్తిస్తుందని ఆమె ఆనాడు స్పష్టం చేసిన మాటలు ఎంత నిత్యనూతనమైనవో, నేటికీ అవి ఏ తీరులో వర్తిస్తాయో వేరే చెప్పనవసరం లేదు.

ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ల నేపధ్యాలను శ్రద్ధగా పరిశీలిస్తే, వెనకబాటుతనం, అధికారంలో ఉన్నవారి అనాదరణ, అన్యాయాలకు గురికావడం వంటివి ఉమ్మడిగా కనిపించే లక్షణాలు. అయితే, అంతమాత్రాన రాష్ట్రాలను ముక్క చెక్కలు చేస్తూ పోతే మన దేశం చివరికి పూర్వపు సంస్థానాలుగా చీలికలు పీలికలు అవుతుంది. ఈ సమస్యలకు పరిష్కారం విభజన ఎంత మాత్రం కాదు, అలాగే, దోపిడీ అనే దానికి ఆద్యంతాలు లేవు. అలాగే, కుల, మత,ప్రాంతీయ విభేదాలు లేవు. దోపిడీ స్వభావం గలవారు తమ సొంత వారినే, ఆఖరికి రక్తం పంచుకుని పుట్టిన వారిని సైతం చేస్తారన్నది తరతరాలుగా నిరూపితమైన నిప్పు కణికలాంటి సత్యం. స్వాతంత్య్రం వచ్చే నాటికి దేశంలోని సంస్థానాలను ఇండియన్‌ యూనియన్‌లో విలీనం చేయడానికి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఎంత కష్టపడ్డారో ఒక్కసారి చరిత్ర పుటలను తిరగేస్తే తెలుస్తుంది. ఆనాడు ఆయన ప్రదర్శించిన ధైర్య సాహసాల కారణంగానే కాశ్మీర్‌, హైదరాబాద్‌ రాష్ట్రాలు ఇండియన్‌ యూనియన్‌లో విలీనం అయ్యాయి. అందుకే ఆయనకు ఉక్కుమనిషి అని పేరొచ్చింది. తెలంగాణా సమస్య ఐదున్నర దశాబ్దాలుగా కొనసాగుతున్న సమస్య అని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఇటీవల చేసిన ప్రకటనలో ఎంతమాత్రం అసత్యం లేదనడానికి రుజువు ఈ పాత చరిత్రే. ఆనాడు ఇందిరాగాంధీ తొందరపడి నిర్ణయం తీసుకుని ఉండి ఉంటే, తెలుగుజాతిని నిలువునా చీల్చిందన్న అపప్రథను మూటగట్టుకుని ఉండేది. భాషాప్రయుక్త రాష్ట్రాల పుట్టుపూర్వోత్తరాల గురించి క్షుణ్ణంగా తెలుసుండటం వల్ల ఆమె తన హయాంలో రెండుసార్లు విభజనోద్యమాలు తలెత్తినప్పుడు ఆంధ్రప్రదేశ్‌ విభజనకు ససేమిరా అంగీకరించలేదు. 1969లో మర్రి చెన్నారెడ్డి సారథ్యంలో సాగిన తెలంగాణా ఉద్యమం సమయంలోనూ, 1972లో జైఆంధ్ర ఉద్యమం కాలంలోనూ ఆమె దృఢ వైఖరిని ప్రదర్శించారు. ఈ రెండు ఉద్యమాల సందర్భంగా స్థానికుల భావోద్వేగాలను (సెంటిమెంట్లను) గౌరవిస్తామని ప్రకటిస్తూనే, విభజన డిమాండ్‌కి ఎంతమాత్రం తలొగ్గేది లేదని నిష్కర్షగా స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ సమయంలో రెండు ప్రాంతాల ప్రజల మధ్య కుదిరిన పెద్ద మనుషుల ఒప్పందాన్ని తుచ అమలు జరపాల్సిన బాధ్యత పాలకులదనీ, అలాగే, ఆ ఒప్పందం అమలు జరిగేట్టు ఒత్తిడి తేవలసిన బాధ్యత ఆవలి వర్గం (తెలంగాణా) వారిదని ఆమె స్పష్టం చేశారు. ఒకే భాష మాట్లాడే ప్రజల మధ్య భావసమైక్యతను సాధించడం ఎంతో సులభమని ఆనాటి పెద్దలు భావించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర విభజన చేయాలని పీకమీద కత్తిపెట్టి ఒత్తిడి తేవడం ఎంత మాత్రం సమంజసం కాదు.

ఇందిరాగాంధీ అధికార వారసత్వాన్ని కాకపోయినా, రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని 125 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీకి ప్రస్తుతం సారధ్యం వహిస్తున్న సోనియా గాంధీ సమష్టి నిర్ణయాలకు ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ, ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ విషయంలో మాత్రం ఒత్తిడులకు లోను కావడం వల్లనే ప్రస్తుత సంక్లిష్ట స్థితి ఏర్పడిందనే అభిప్రాయం జనంలో నాటుకుంది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు రెండవ కమిషన్‌ (ఎస్సార్సీ) ఏర్పాటుకు పార్టీ కట్టుబడి ఉన్నట్టు 2004 ఎన్నికల ప్రణాళికలో పేర్కొనడం జరిగింది. ఎన్ని ఒత్తిడులు వచ్చినా కాంగ్రెస్‌ పార్టీ వైఖరి అదేనని సోనియా స్పష్టం చేసి ఉండి ఉంటే ఆమెకు ప్రస్తుత తలనొప్పులు ఉండేవి కావు. అలాగే, తెలుగు ఆమె తన అత్తగారి పంధానే అనుసరిస్తోందని జనం భావించడానికి వీలుండేది. బతికున్నంత కాలం ఇందిరమ్మ రాజ్యం జపం చేసిన రాజశేఖరరెడ్డి కూడా ఇందిరమ్మ విధానాన్నే కొనసాగించారు. ఆయన అడ్డుపడటం వల్లే తెలంగాణా ఆగిపోయిందంటూ ప్రచారంచేస్తూ వచ్చిన ప్రత్యర్ధులు ఆయన మరణానంతరం తెచ్చిన ఒత్తిడి కారణంగా కాంగ్రెస్‌ అధిష్ఠానం విభజనపై ఊగిసలాట వైఖరిని ప్రదర్శిస్తూ వస్తోంది. అదే ఇప్పుడు అధిష్టానం మెడకు చుట్టుకుంది. ఈ ఊబిలోంచి ఎలా బయటపడాలా అని నేటికీ మేధోమథనం చేస్తోంది.

తెలంగాణా సెంటిమెంట్‌ని గౌరవిస్తూనే సమైక్యరాష్ట్రాన్ని కొనసాగించడం అసాధ్యమైన విషయం కానేకాదు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి పదవులను వంతుల వారీగా ఆంధ్ర, తెలంగాణా ప్రాంత నాయకులు నిర్వహిస్తూ, నీళ్ళు, నిధుల పంపకంలో పారదర్శకతను పాటిస్తూ వచ్చి ఉంటే తాజా ఉద్యమం తెరమీదికి వచ్చి ఉండేది కాదు. అలాగే, ప్రాజెక్టులు, కాంట్రాక్టులు, ముఖ్యమైన పదవుల పంపిణీ విషయంలో ఇచ్చి పుచ్చుకునే ధోరణితో వ్యవహరించి ఉన్నా ప్రస్తుత పరిస్థితి తలెత్తి ఉండేది కాదు, నాయకుల మధ్య అహం వల్ల అపోహలు పెరిగి, అంతరాలు పెరిగాయన్నది కాదనలేని వాస్తవం. వెనుకటి అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకుని ఉండి ఉంటే విభజనోద్యమం వచ్చి ఉండేది కాదు. నాయకుల అహానికి తోడు, రాజకీయ స్వార్ధం వల్లే విభజనోద్యమాలు తరచుగా పుట్టుకొస్తున్నాయన్నది తిరుగులేని నిజం. సర్దుబాటు గుణం ఉంటే ఎంతటి జటిలమైన సమస్యలనైనా పరిష్కరించుకోవచ్చు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే ఇందిరమ్మకు మనం అర్పించే నిజమైన నివాళి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి