4, నవంబర్ 2011, శుక్రవారం

పాపం ఆనపకాయ!

"ఆంధ్రా వాళ్ళు సొరకాయ అంటారు, తెలంగాణా వాళ్ళు ఆనపకాయ అంటారు." - KCR

ఆంధ్రప్రభ : భారతీయ యోగాగురు బాబా రామ్‌దేవ్‌, ఓ దొరవారి పుణ్యాన ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా మరింత అధికంగా మన రాష్ట్రంలో ఆనపకాయ వివాదాల్లో చిక్కుకుంది! ఏమైనా ఆనపకాయకి ఇంతవరకు అంటే బాబా రామ్‌దేవ్‌ మనదొరవారు, పూనుకునే వరకు ఎక్కువ ప్రాధాన్యత రాలేదు. లేత గరికగడ్డితో, బీరకాయతొక్కతో మంచిపచ్చడి చేయవచ్చు. ఆనపకాయకికా యోగ్యతాలేదు. వంకాయకి క్వీన్‌ ఆఫ్‌ వెజిటబుల్స్‌ (కూరగాయల్లో రాణి) అన్న హోదా ఉంది. బెండకాయకి లేడీస్‌ ఫింగర్‌ అన్న నాజూకు నామం ఉంది. గోంగూర (శాకంబరి) తోటకూర, గుమ్మడి, చిక్కుడు ఇవన్నీ సినిమా పాటలకి ఎక్కేయి -కందసామెతల్లోకి పోయింది (సొరకాయ కోతలన్న నానుడి దీనికీ దక్కిందిలే) అలా కూరగాయలన్నీ ఏదో ఒక హోదా దక్కించుకున్నాయి. ఆనపకాయ ఏ రకమైన రచనా ప్రక్రియలోనూ స్థానం సంపాదించుకోలేదు. పద్యం, గద్యం కవిత, తవిక, నాటకం, నానీలు ఎందులోనూ లేదు. అంటే సబ్బుబిళ్ల, కుక్కపిల్ల, అగ్గిపుల్ల పాటి చేయలేకపోయిందన్నమాటేగా!

ఇక జాతీయ స్థాయిలో ఆనపకాయకింత అకస్మాత్తుగా అంతప్రాధాన్యత లేదా వివాదం ఎందుకొచ్చిందో ముందుగా చెప్పుకుందాం. ఈ వ్యాసకర్తకు రామ్‌దేవ్‌ బాబా పట్ల అగౌరవంలేదు. యోగాకి సంబంధించినంతవరకు మా ఆవిడ వేల రూపాయల టిక్కెట్లు కొనుక్కొని ఆయన యోగా కేంపులలో ముందువరసలో కూర్చోడానికి వెళ్ళడాన్నీ ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు. ఐతే ఆయన దాదాపు ఒక సంవత్సరంన్నర క్రితం ఆనపకాయను రసం తీసుకుని గ్లాసుడు కాదు -బోలెడు పొద్దున్నే గటగటా తాగేస్తే సర్వరోగ నివారిణిగా పనిచేస్తుందని, బిపి షుగర్‌లను బ్రహ్మాండంగా నియంత్రిస్తుందని, అంతేకాదు -గుమ్మడికాయలా ఉన్నవాళ్లని గమ్మున పొట్లకాయలలా గమ్మత్తుగా చేయగల్గే మహత్తు దానికుందని ప్రచారం చేశారు. దాన్ని సామాన్యులు, పామరులేగాక పండితులు, శాస్త్రవేత్తలు కూడా గుడ్డిగా పాటించేరు. పొలోమంటూ ఈ చిట్కాని అతిగా పాటించిన సుశీల్‌ శర్మ అనే 59 ఏళ్ల, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (ఐసిఐఆర్‌) లో డిప్యూటి డైరెక్టర్‌గా పనిచేస్తున్నాయన దుర్మరణం పాలయ్యాడు. దానికి కారణం ఆనపకాయ రసం అతిగా సేవించడమేనని నిర్ధారణౖంది. ఇంకా ఎంతమందో ఎన్నో దుష్ప్రభావాలకు లోనయ్యారన్న వార్తలూ వచ్చేయి. దేశమంతటా గగ్గోలు ప్రారంభమైనందున ప్రభుత్వం ఆనపకాయ రసం యొక్క వైద్య గుణాలు పరిశోధించాలన్న ఆదేశాలు జారీ చేసింది.

ఆ పరిశోధనను ఎయిమ్స్‌ హాస్పిటల్‌లో వైద్య విభాగాధిపతి ఎస్‌.కె.శర్మ నేతృత్వంలో ఒక వైద్యుల బృందం ఒక సంవత్సరం పాటు చేపట్టింది -వారి పరిశోధనా ఫలితాలు ఈ వారంలోనే వెల్లడయ్యాయి. అవేమంటే (1) ఆనపకాయ రసానికి రోగనివారణ గుణాలు లేనే లేవు (2) పైగా దీని జ్యూస్‌లో విషతుల్యమైన ఏసిడ్‌ (ఆవ్లుం) ఉంది. దానిపేరు టెట్రాసైక్లిక్‌ ట్రిటార్‌ పెనాయిడ్‌ క్యూకర్బేటినస్‌ (3) దీన్ని అతిగా సేవిస్తే అరుచి, వాంతులు, తలతిరగటం వంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ రావటమే కాదు -మరణం కూడా సంభవించవచ్చు (4) ఆనపకాయ రసాన్ని ఏ ఇతర కూరగాయలు లేదా పళ్లరసాలతో కలిపి సేవిస్తే దుష్పరిణామాలు ఇంకా ఎక్కువ స్థాయిలో ఉంటాయి. (5) విడిగా సేవించాలనుకున్నా ఒక ముక్కకొరికి, అది ఏమాత్రం చేదుగా ఉన్నా రసం తీయటం -సేవించటం మానేయాలి. (6) సేవించిన తర్వాత ఏమాత్రం అసౌకర్యంగా అనిపించినా ప్రాథమిక చికిత్సగా ఎక్కువ నీళ్లు తాగి వెంటనే వైద్యసహాయం పొందాలి. అయ్యా ఈ ఆరు సూత్రాలను బట్టి ఏం తెలుస్తోంది ఆనపకాయను పచ్చిగా కాదు ఉడకబెట్టి ఏదో కూర అప్పుడప్పుడు వండుకోండి గాని దాని జ్యూస్‌ తాగొద్దనే కదా. ఐనా, బాబాగారు తన చిట్కానే కరెక్టంటున్నారు.

ఇప్పటికీ ఇక దొరవారి చిట్కా సంగతి -ఆనపకాయ అనేటోళ్లంతా మనోళ్లు అంటే తెలంగాణీయులు సొరకాయ అనేటోళ్లు ఆంధ్రోళ్లు అనేది -ఇది ఎర్రచీరకట్టుకున్నోళ్లంతా -అన్నట్లు లేదా ఐనా అనుయాయులు వారు చెప్పే ఇతర సూక్తులతోబాటు (ఆంధ్రోళ్లు రాక్షస సంతతి వంటివి) దీన్ని ప్రచారం చేస్తున్నారు. ఇదెంత అసంబద్ధమైన సూత్రీకరణో మళ్లీ మళ్లీ వివరించవలసిన పని లేదు గాని, సొరకాయ ఆనపకాయలకు, జంతికలు, మురుకులకు, గోంగూర -పుంటికూరలకు, పులిహోర -చిత్రాన్నంలకు, గారెలు -వడలకు, సాంబారు పప్పుచారులకు అవి ఒకటే ఐనా వేర్వేరు రాష్ట్రాలివ్వటం సాధ్యమా అని ప్రశ్నించాలి. దొరవారికి రాజకీయ, ఆర్థిక కుటుంబ ప్రయోజనాల రక్షణ ప్యాకేజీ కుదిరే వరకు వేర్వేరే అంటూనే ఉంటారు కాబోలు -ప్రస్తుతానికి ఆనపకాయ కొచ్చిన అగచాట్లకు జాలిపడి దాన్నైనా వదిలివేస్తే బాగుంటుంది -లేకపోతే ఆయనకి మన ఆనపకాయ బాబాగా బిరుదునివ్వాల్సి ఉంటుంది.

అంతకుముందు ఇంకే కూరగాయ, మంచి ఆకుకూర లేకపోతేనే ద్వితీయ ప్రాధాన్యంగా వండుకునేది మాత్రం గానే ఆనపకాయ ఉండేది, ఇప్పుడేమో ఇంత వివాదాస్పదమై పోయిందిగాని! నిజానికిది ముల్కీ కూరగాయ కానేకాదు. గుమ్మడి, కొబ్బరికాయల్లా దేశీయం కూడా కాదు. అందుకే వాటికి కూష్మాండం, నారికేళం అని పేర్లున్నట్లు దీనికి సంస్కృత భాషలో ఏ పేరూ లేదు. పూజా పునస్కారాలకు, లేదా దిష్టి తీయడానికి వాటినుపయోగిస్తాం గాని ఆనపకాయకా హోదాలేదు. ఆనపకాయ మొదట్లో ఆఫ్రికాలో పుట్టి లేదా పండి, కాలక్రమేణా అన్ని దేశాలకు పాకిన పాదు. అంటే, టమాటా క్యారెట్‌, క్యాబేజీ, బంగాళాదుంప, కాలీఫ్లవర్‌, కేప్సికమ్‌ లాంటి వలస కూరగాయే ఇదన్నమాట -దీని శాస్త్రీయ నామం స్పానిష్‌ భాషలో ఃకేపబుజాః ప్రపంచ వ్యాప్తంగా వృక్షశాస్త్ర (బోటనీ) గ్రంథాల్లో వాడబడుతున్నపేరు లాజనారియా సైసేరేరియా. ఆంగ్లంలో బాటిల్‌ గార్డ్‌ అంటారు. కొన్ని గుండ్రంగా పొట్టిగా ఉన్నా, కొన్ని లావుపాటి పొట్లకాయలలా పొడుగ్గా ఉన్నా, మొత్తానికి సీసా షేపుతో పోల్చవచ్చునని కాబోలు. ఇంకో కారణం ఎండబెట్టిన ఈ కాయను చిల్లుచేసి, డొల్లచేసి నీళ్లపాత్రగా కూడా ఉపయోగించే అలవాటు చాలాదేశాల్లో పూర్వం నుండి ఉంది. ఆనపకాయను హిందీలో ఃలౌకీః, మరాఠీలో ఃదూదీ బోసాలః, కన్నడంలో ఃసొరకాయిః, అస్సామీలో ఃజాతీలాలోః, బెంగాలీలో ఃలావ్‌ః, గుజరాతీలో ఃదీధీయాః, మళయాళంలో ఃచురక్కః అంటారు.

తెల్గూ ఈజ్‌ ది ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌ అని గొప్పగా చెప్పుకుంటాము గదా (మనలో మనం ఎంత కొట్టుకు చస్తున్నా!) ఆ ఇటాలియన్‌లో కుబుజ్జా అంటారు. ఇక తెలుగులో ఆనపకాయ, సొరకాయ అని రెండు పదాలూ ఉన్నాయి. ఏ ప్రాంతంవాడైనా సమయానికి ఏ పేరు నోటికొస్తే అది పలుకుతాడేగాని దొరవారు వాక్రుచ్చినట్లు ఒక ప్రాంతం వాళ్లు ఖచ్చితంగా ఎల్లప్పుడూ ఆనపకాయ అని ఇతర ప్రాంతాలవారందరూ సొరకాయ అని అనరు. అలా సూత్రీకరించటం ఒకరకమైన ఉన్మాదం. అన్ని ప్రాంతాల్లోనూ రెండు పేర్లూ సమానస్థాయి వ్యవహారంలో ఉన్నాయి గాబట్టి ఈ రకమైన సూత్రీకరణ తప్పు.

మనజాతి నీతి, రీతి, సంస్కృతి, వేషభాషలు, ఆహారపు అలవాట్లు, ఆచార వ్యవహారాలు, ఆఖరికి దేవుళ్లు దేవతలు అంతా పూర్తిగా వేరు అని పదేళ్లుగా నిస్సంకోచంగా గడగడా చెబుతున్న దొరవారు చేసింది కాబట్టి పట్టించుకోవద్దు అనుకున్నా ఈ పచ్చి అబద్దాల్నే గుడ్డిగా నిస్సిగ్గుగా విభజన వాదులంతా గోబెల్స్‌ మాదిరి ప్రచారం చేస్తూండటం మాత్రం బహు విచారకరం -ఃవలస కూరగాయః, ఆనపకాయ గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. దానికిప్పుడొచ్చిపడిన వివాదాలు అగచాట్లు గురించి వివరించేముందు ఇది ఆఫ్రికా నుంచి అన్ని దేశాలకు పాకిన పాదు అని చెప్పుకున్నాం గదా. ఇప్పుడన్ని రాష్ట్రాలలో, ప్రాంతాల్లో, ఉపప్రాంతాల్లో పండుతోంది. ఎక్కువ వర్షపాతం, భూసారం, ఎరువులు సంరక్షణ వగైరా అవసరం లేదు.

రంగు రుచి వాసన ఉపయోగాలు ఎక్కడ కాసినా, అంటే దొరగారి దొడ్లోనైనా, దళితుని పూరిగుడిసె పై నుంచి తెంపినా, ఒకటేగా ఉంటాయి. ముందే చెప్పినట్లు గృహిణి ద్వితీయ ప్రాధాన్యంగానే, వంటింట్లో ఉపయోగిస్తుంది. ఇతర దేశాల్లో, రాష్ట్రాల్లో రకరకాల వంటలు, కూరలు చేస్తారు. తెలుగువాళ్లైతే ఆనపకాయతో కూర, వేపుడు, పులుసు, దప్పళం కుర్మా, పెరుగుతో, తెలగపిండితో ఇంకేదైనా పప్పుతో ఆకుకూరతో కలగలుపు వంటలు చేస్తారు. శనగపిండి కలిపి బజ్జీలూ చేస్తారు. నిల్వ పచ్చడికి పనికిరాదు. ముదురితే అంతే సంగతులు -ఏమైనా ఆనపకాయతో వంటకాలు అంతగా లొట్టలు వేసుకుని తినేలా ఉండవన్నది ఈ వ్యాసకర్త అభిప్రాయం.

ఐతే, దీంతో ఎవరైనా విభేదించవచ్చు, లోకోభిన్న: రుచిగదా. పైగా నాకు నా సిద్ధాంతంతో విభేదించేవారి నాలుకలు కోస్తాననే సంస్కారం, సాహసం లేవు, విభజన వాదులలా. ఇంక ఆనపకాయ ఇతర ఉపయోగాల గురించి చెప్పాలంటే ఇతర దేశాలలో ఇప్పటికీ దీన్ని ఎండబెట్టి నీళ్లు నిల్వచేసుకునే పాత్రలుగా చిన్నవైతే టీకప్పులుగా, అంతేకాదు ప్లూట్‌ (మురళి), ఫిడేల్‌ వంటి సంగీత పరికరాలను తయారు చేసుకునే అలవాటుంది -షెర్లాక్‌హోమ్స్‌ (ఆంగ్లంలో అపరాధ పరిశోధనా గ్రంథాల రచయిత) ఆనపకాయ డొల్లనే పొగాకు పీల్చే పైపుగా వాడేవాడట! ఈ విధానాన్ని మన మొఘల్‌ ప్రభువులు కొందరు హిమాలయాల్లోని సాధువులూ, పాటించారట (గంజాయి పీల్చడానికి). దొరవారు కీర్తించే నైజాం నవాబు సంగతి తెలియదు.

-చేగొండి రామజోగయ్య,
విశ్రాంత బ్యాంకు అధికారి, విశాలాంధ్రమహాసభ సభ్యులు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి