సూర్య దినపత్రిక సంపాదకీయ పేజి :తెలంగాణ రాష్ట్ర సాధన తన వల్ల మాత్రమే సాధ్యమని చెప్పుకుంటున్న తెరాస అధిపతి కెసిఆర్ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని విద్రోహ దినంగా జరుపుకుంటున్న నేపథ్యంలో పార్టీ కార్యాలయంలో నల్ల జెండా ఎగురవేయకుండా ఆ బాధ్యతను నాయనికి ఇచ్చి మాయమైపోయారు. కెసిఆర్ ఈ వానిషింగ్ ట్రిక్ కొత్తదేం కాదు కానీ కాంగ్రెస్ పార్టీలోంచి వచ్చిన శాసనసభ్యులకు ఆహ్వానం పలికిన పార్టీకి అధిపతిగా, నరనరానా తెలంగాణ వాదం జీర్ణించుకుపోయిన వ్యక్తిగా తన నిరసనను ప్రకటించకపోవడమే ఆశ్చర్యాన్ని రేకెత్తించే అంశం. పోనీ తెలంగాణ జాక్ నేతలతో కలిసి ఢిల్లీలో కొండా లక్ష్మణ్ బాపూజీ దీక్షకు ఏమైనా వెళ్ళారా అంటే అదీ లేదు. అసలు ఇలా ఎవరికి వారు కాకుండా అన్ని పార్టీల తెలంగాణ నేతలు ఒకచోట చేరి విద్రోహ దినోత్సవాన్ని జరిపారా అంటే అదీ లేదు. ఆయన ప్రస్తుతం వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారుట. బహుశ ఇదంతా అందులో భాగమే కాబోలు. ఉద్యమం నడుస్తున్న తీరే విచిత్రంగా ఉన్నది.
ఎవరికి వారే. ఎవరి అస్తిత్వ పోరాటం వారిదే. తమ తమ అస్తిత్వాలకు భంగం వాటిల్లకుండా, ఐకమత్యం లేకుండా తెలంగాణను సాధించేందుకు పోరాడుతున్నామనే భ్రమ కల్పించేందుకు నాయకులు పడుతున్న తాపత్రాయాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. సకల జనుల సమ్మె జరుగుతున్న సమయంలో జాక్ నాయకులతో కలిసి వెళ్లిన కెసిఆర్ ప్రధానిని కలిసి వచ్చిన తర్వాత సకల జనుల సమ్మె అటకెక్కింది. ఆయన ఢిల్లీలో పెద్దలతో ఏదో ఒప్పందం కుదుర్చుకువచ్చి ఉద్యమాన్ని నీరు గార్చారనే ఆరోపణలు, విమర్శలకు పరిమితం కావడం మినహా ఇతర పార్టీలలోని తెలంగాణ నాయకులందరూ కలిసి కట్టుగా కేంద్రం పై ఒత్తిడి తెచ్చేందుకు సమ్మెను కొనసాగించేందుకు ప్రయత్నాలు చేయలేకపోయారు.
ఇలా ఒక సందర్భమేమిటి? అనేకానేక సందర్భాల్లో వివిధ రాజకీయ పార్టీల్లోని నేతలు తమ మధ్య ఉన్న అనైక్యతను బయట పెట్టుకుంటూనే ఉన్నారు. ఒకరి నాయకత్వాన్ని మరొకరు అంగీకరించే పరిస్థితి లేదు. నిన్నటి వరకూ ఇతర రాజకీయ పార్టీలను దుమ్మెత్తి పోసిన కెసిఆర్ పై నేడు ఇతర పార్టీల నాయకులు ధ్వజమెత్తుతున్నారు. ఒకరిపై ఒకరు బురద జల్లుకుని తమకు తెలంగాణ పట్ల ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తున్నామనుకుంటున్నారే తప్ప ప్రజలలో విశ్వసనీయత కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందనే భయం ఎవరికీ ఉన్నట్టుగా కనుపించడం లేదు. ఈ తెలంగాణ రాజకీయ క్రీడలో సామాన్యులు పావులుగా మిగిలిపోతున్నారు.
ఇప్పటికే బాన్సువాడ ఎన్నికల ఫలితాలు ఆ విషయాన్ని తేల్చివేశాయి. ఉద్యమ తీవ్రత లేదా ఆకాంక్ష నాయకులు చెప్తున్నంత, టివిలలో చూపుతున్నంత తీవ్రంగా లేవనే సంగతిని ఈ ఫలితాలు బయటపెట్టాయి. ఎందుకంటే గతానుభవంతో డిపాజిట్ కూడా దక్కదనే భయంతో, పరువు నిలుపుకునేందుకు తెలుగుదేశం పార్టీ అసలు అభ్యర్ధినే నిలబెట్టలేదు. ఆ విషయాన్ని మసిబూసి మారేడు కాయ చేయాలనుకున్నా వాస్తవమదే. కానీ ధైర్యం చేసి నిలబడిన కాంగ్రెస్ అభ్యర్ధి అనూహ్యంగా ఓట్లు చీల్చారు. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి తరుఫున ప్రచారం చేసేందుకు ఎవరూ పోకపోయినా తెలంగాణ ప్రజలు ఆ పార్టీ మీద ఉన్న ప్రేమతో కాసిని ఓట్లు వేసేశారు. దీనితో క్లీన్ స్వీప్ చేస్తామనుకున్న టిఆర్‌ఎస్ బిత్తరపోవలసి వచ్చింది. ఉద్యమం ప్రారంభమైన మొదట్లో ఉప ఎన్నికలు జరిగినప్పుడు తెలంగాణ ప్రజలు తెరాస అభ్యర్ధులకు మినహా మరే పార్టీకి డిపాజిట్లు కూడా దక్కనివ్వని పరిస్థితి ఉన్నది. ఆ స్థితి నుంచి ఓట్లు చీల్చుకునే స్థితికి రావడం ఉద్యమంలో వస్తున్న మార్పును సూచిస్తోంది.
పోనీ ఒకే పార్టీలో ఉన్న టి నేతల మధ్య ఏమైనా సఖ్యత ఉన్నదా అంటే అదీ నేడు కనుపించడం లేదు. ముఖ్యంగా టి కాంగ్రెస్‌లో లుకలుకలు అయితే బహిరంగంగా బయటపడ్డాయి. తెలంగాణ మీద అపరిమితమైన ప్రేమను కనబర్చడంలో ముందున్న జానారెడ్డి సకల జనుల సమ్మెను విరమించమని ఉద్యోగులకు పిలుపివ్వడం మిగిలిన వారిని భగ్గుమనిపించింది. అందుకే మధుయాష్కీ గౌడ్ టివిలకెక్కి జానారెడ్డిని తన స్టైల్లో తీవ్రంగా విమర్శించి, నిందించారు. ప్రస్తుతం కెకె, యాష్కీ, పొన్నం ప్రభాకర్ వంటి నాయకులంతా తమ పరువు పోకుండా ఉండేందుకు ప్రకటనలు చేస్తున్నా వాటి పదును కనీసం గాటు పెట్టేలా కూడా ఉండడం లేదు. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ నుంచి తెరాసకు ముగ్గురు శాసనసభ్యులు వలస వెడితే వెళ్ళి ఉండవచ్చు.
లగడపాటి లెక్కల ప్రకారం మరో ఐదుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు కూడా వెళితే వెళ్ళవచ్చు. అయితే ఇదంతా తెలంగాణ మీద ప్రేమ కన్నా ముఖ్యమంత్రి మీద ఉన్న అసహనం కావచ్చు. కోమటి రెడ్డి వెంకటరెడ్డి మాత్రం పార్టీ నుంచి వెళ్ళకుండా తనదైన స్టైల్లో నవంబర్ 1న దీక్షకు కూర్చున్నారు.వాస్తవానికి కిరణ్ మీద ఉన్న ఆగ్రహమే ఆయన అలా ప్రవర్తిస్తున్నందుకు కారణమని అనేవారు లేకపోలేదు. తెలంగాణ దెబ్బ నుంచి తెలుగుదేశం పార్టీ ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నట్టు కనుపిస్తోంది. అందుకే వారు ఉద్యమానికి ప్రాధాన్యతనివ్వడం కన్నా కెసిఆర్‌ను టార్గెట్ చేసుకోవడానికే ప్రాధన్యతనిస్తున్నారు. బాన్స్‌వాడ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత పార్టీ అధినేత, ఇతర నాయకులు కూడా నాలుక కరుచుకున్నట్టు కనుపిస్తోంది.
ఆ ఫలితాల ధోరణి చూసిన తర్వాత వచ్చిన ఆత్మవిశ్వాసంతో ఈసారి అన్ని చోట్ల నుండి పోటీ చేస్తామంటూ బాబు ప్రకటించుకున్నారు. తమ కేడర్‌ను దక్కించుకునే ప్రయత్నంలో తెలంగాణ పై పోరాటం కన్నా టిఆర్‌ఎస్ అధినేతను లక్ష్యంగా చేసుకొని లబ్ధి పొందాలనే ప్రయత్నాలను ముమ్మరంగా ప్రారంభించింది. పోలవరం ప్రాజెక్టు టెండర్ల వ్యవహారంలో కెసిఆర్ లబ్ధి పొందారంటూ బురద జల్లుడు ప్రచారాన్ని తెలుగుదేశం నాయకులు చాలా తీవ్రంగానే ప్రారంభించారు. ఎన్డీయే హయాంలో తెలంగాణ అంశం అడుగకుండానే ప్రస్తావనకు వచ్చినా నో అని బాబు ఖండితంగా చెప్పినప్పుడు ఈ నాయకులంతా మౌన ప్రేక్షక పాత్ర ఎందుకు వహించారో, ఇప్పుడు మాత్రమే వారికి తెలంగాణ పై పట్టరాని ప్రేమ ఎందుకు వచ్చిందో తెలిసిన విషయమే.
నాడే పట్టుబట్టి వారే ఉద్యమం చేసి ఉంటే ఈపాటికి తెలంగాణను సాధించి ఉండేవారేమో! ఆ ఘనత, కీర్తి వారికి దక్కేవేమో! కానీ అప్పుడు వారంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. అం దుకే ఎవ్వరూ నోరెత్త లేదు. ఇప్పుడు పార్టీ అధికారంలో లేకపోవడంతో తెలంగాణపై బాహాటంగా తమ ప్రేమను వ్యక్తపరుస్తున్నారు. ఇక ఆ పార్టీలో కూడా ఒకరితో ఒకరికి పొసుగుతున్న దాఖలాలు కనుపించడం లేదు. నాగం జనార్దన రెడ్డి పార్టీని వీడిపోయారు. ఆయన సొంత కుంపటితో తిరుగుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నంత కాలం విద్రోహ దినం కాని రాష్ట్ర అవతరణ దినోత్సవం ఈసారి తెదేపా నాయకులకు అలా కనిపించడం ఆశ్చర్యమే కదూ? అధికారంలో ఉండి మంత్రులుగా కొనసాగినంత కాలం బుద్ధిగా జెండాలు ఎగరేసిన వీరిలో ఎక్కువ మంది మంగళవారం నాడు ఢిల్లీలో కొండా లక్ష్మణ్ బాపూజీ దీక్షకు మద్దతుగా అక్కడ చేరడం ఒక వింత.
ఈ మొత్తం వ్యవహారంలో లబ్ధి పొందింది ఎక్కువగా తెరాస మాత్రమే. తనకున్న క్యాడర్‌ను స్థిరీకరించుకుంది. ఇతర పార్టీల నాయకుల మధ్య చిచ్చు రేపడానికి కారణమైంది. కొన్ని పార్టీల నుంచి నేతలను ఆకర్షించింది. తెలుగుదేశం పార్టీని తెలంగాణలో నిర్వీర్యం చేసినంత పని చేసింది. మొత్తం మీద తెరాస తెలంగాణలో బలపడింది కానీ సమస్యకు పరిష్కారాన్ని మాత్రం కనుగొనలేకపోయింది. నానా హడావిడీ చేసి ఇరు ప్రాంతాల మధ్య విద్వేషాలను రగల్చడం మినహా అది సాధించిందేం లేదు. అవసరమైతే కెసిఆర్ మరోసారి ఆమరణ దీక్ష చేస్తారు అంటూ తెరాస నాయకులు ప్రకటించారు కానీ దానికి ముహూర్తం కుదిరినట్టులేదు.
ఈ రకంగా ఎవరి స్టైల్లో వారు తెలంగాణ ఉద్యమాన్ని తమ భుజస్కంధాలపై వేసుకున్న రీతిలో బిల్డప్‌లు ఇచ్చుకుంటున్నారు. తప్పితే మూల సమస్యను ఎలా పరిష్కరించాలన్న విషయంపై ఒక చోట కూడి ఆలోచనలు చేయడం లేదు. 1969, 1972 నాటి ఉద్యమాలలో అన్ని పార్టీల వారూ కలిసి కట్టుగా, ఒకే తాటిపై నిలిచి ఉద్యమించారు. అయినా వారు లక్ష్యాన్ని సాధించలేకపోయారు. ఇప్పుడు ఒక పార్టీ నాయకుడు మరొక పార్టీ నాయకుడితో కలవకుండా ఎదుటివారిని విమర్శిస్తూ లక్ష్యసాధన కోసం ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు. తాజాగా దీక్షకు కూర్చున్న కోమటి రెడ్డి వెంకటరెడ్డి అన్ని పార్టీల వారు తమ జెండాలను పక్కన పెట్టి ఐక్యంగా పోరాడాలంటూ పిలుపిచ్చారు. ఇలాంటి పిలుపులు ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచి అన్ని కోణాల నుంచి వందలాదిసార్లు వచ్చి ఉంటాయి. కానీ జరిగింది శూన్యం. నాలుగు సిగలు కలవలేవంటారు కానీ ఇక్కడ నాలుగు క్రాఫులు కూడా కలిసే పరిస్థితి లేదని తేటతెల్లమైపోయింది. మరి తెలంగాణ కేంద్రం ఇచ్చినప్పుడే తీసుకోవాలి ఇంక.
- డి. అరుణ
/ఆయన ప్రస్తుతం వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారుట./
రిప్లయితొలగించండిసోనియా, సింగన్న, చిదంబరం, రాహువ్ గాడిదీ ... అందరూ వ్యూహాత్మకమౌనమే... :D ఒక్క అదవానీ ఒకాడే తెగ అరుస్తున్నాడు... ఇస్తా ఇస్తా ఏక్ కా దో అని. ఎవరూ అడగటం లేదాయన్ని. :)
After Rail roko arrests agitators got the real taste of police,now no one will come out like earlier days. TV people are running this movement. No leader is interested in this,oly for political gain they will make some noises. Let BJP divide Maharashtra, West Bengal, Tamilnadu, UP, and Bihar first and then come to AP
రిప్లయితొలగించండి