5, నవంబర్ 2011, శనివారం

మావోయిస్టు మేధావుల అరణ్యరోదన

ఆంధ్రజ్యోతి సంపాదకీయ పేజీ: హరగోపాల్ వ్యాసంలోని మావోయిస్టు సిద్ధాంత పోకడలను నేను బయటపెట్టినందుకు ప్రతిగా మరో మావోయిస్టు వివరణను 'లోకే అరణ్య' రాశారు. రాష్ట్ర విభజనకు ప్రాతిపదికలను చివరి పేరాలో పరోక్షంగా చెప్పారట! ఏమిటవి? "పెట్టుబడులు, స్వార్థప్రయోజనా లు, వ్యవస్ధీకృత దోపిడీలు లేకపోవడం, రాజకీయాలు, ఆర్ధిక సంయోజనాలు వేరుపడడం, సామాజిక సంబంధాలు ఉన్నతీకరించబడడం'' విభజనకు ప్రాతిపదికలని ఆచార్యుల వారు స్పష్టంగా రాశారని అర ణ్య పేర్కొంటున్నారు.

రాష్ట్ర విభజనకు ఇవీ ప్రాతిపదికలని హరగోపాల్ తన వ్యాసంలో ఎక్కడా పేర్కొనలేదు. అయినా 'అరణ్య'కు ఆ యన వ్రాసింది అలా అర్థమయ్యింది. సాయుధ పోరాటాలు జరుపుతూ సోషలిస్టు సమాజం ఏర్పడాలని కోరుకొనే మావోయిస్టులు కూడా కోరేది ఇదే! రాష్ట్ర విభజనకై జరిగే ఉద్యమం, మావోయిస్టు విప్ల వ ఆశయాల కోసమే జరుగుతున్నదని ఆచార్యులవారు భ్రమలలో చిక్కుకుంటే ఆయనను చూసి జాలి పడడంకంటే చేసేదేముంది?

'స్వయం పాలన అంటే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అంటే స్వయం పాలన' అని నేను రాసిన దానిని తప్పు పడుతూ 'అరణ్య' పూర్తిగా హరగోపాల్ శైలిలో 'పాలకులెవరైనా, నిర్ణయాలు ఎవరికి అనుకూలంగా ఉంటున్నాయి అనే దానిపైనే స్వయంపాలన ఉందా, లేదా? అనేది ఆధారపడి వుంటుంది.' అని తెలియజేశారు. ఇది అసలు సిసలు మావోయిస్టు వాదన. మనదేశంలో వున్నది ప్రజాస్వామ్య పాలన అని వారు అంగీకరించరు. ఇది బూటకపు ప్రజాస్వామ్యమని, పాలకవర్గాలు పెట్టుబడిదారుల చేతిలో కీలుబొమ్మలని వారు సిద్ధాంతీకరిస్తారు.

అందుకే వారి నిర్ణయాలు ఎవరికి అనుకూలంగా వుంటున్నాయని మావోయిస్టులలాగ ప్రశ్నిస్తున్నారు. ఆ తరువాత ఈ బూటకపు ప్రజాస్వామ్యంలో పెట్టుబడిదారుల దోపిడీ నిరంతరాయంగా సాగుతుందని, పాలకవర్గాలు వారికి కొమ్ముకాస్తుంటారని మావోయిస్టులు సూత్రీకరిస్తారు. ఈ దోపిడీ వర్గాలను నిర్మూలించి విప్లవం తెచ్చి సోషలిస్టు సమాజాన్ని ఏర్పరచిన తరువాత మాత్రమే కష్టజీవుల ప్రభుత్వం ఏర్పడుతుందని, దానిని మాత్రమే 'స్వయంపాలన'గా గుర్తించగలమని మావోయిస్టులు చెప్పే విషయాలనే హరగోపాల్, అరణ్య వంటి వారు అందరికీ అర్ధమయ్యేలా మళ్ళీ మళ్ళీ చెబుతున్నారు.

అచ్చం హరగోపాల్ లానే అరణ్య కూడా రాష్ట్ర విభజనకు ప్రాతిపదిక వివరించడంలో పూర్తి గందరగోళంలో పడ్డారు. "అరవై ఏళ్ళుగా భాషలు, సంస్కృతులు, ఆచార వ్యవహారాలు, జీవన విధానాలు కలవలేకపోయినా, ఆత్మగౌరవం, స్వయంపాలన భావనతో ప్రత్యేక జీవనాన్ని కోరుకుంటే తప్పేమిటి?'' అని ప్రశ్నించారు. తమ వాదనలు బలపరచుకోవడానికి, అమాయక ప్రజలను గందరగోళంలో పడవేయడానికి మావోయిస్టు మేధావులు కూడా ఒక్కోసారి ఫాసిస్టు ధోరణిని ఆశ్రయిస్తుంటారు.

ఏక భాష, ఏక సంస్కృతి, ఒకే జీవనవిధానం, ఒకే మత సంప్రదాయాలకోసం తెలంగాణ ఉద్యమం సాగుతోందా? అంటే నూతన రాష్ట్రంలో ఉర్దూ, తమిళం, మరాఠీ వంటి భాషలు మాట్లాడే అవకాశం వుండదా? ఎవరూ భిన్న ఆచారాలు పాటించే ఆస్కారం వుండదా? అన్ని కులాలవారు ఒకే కులపు సాంప్రదాయాలు పాటించవలసిందేనా? ఈ ఆధునిక కాలంలో ఇటువంటి ఫాసిస్టు ధోరణులు దేశద్రోహకరమైనవి కావా? ఇవి రాష్ట్ర విభజనకు తగిన వాదనలు కావు. దేశ విచ్ఛిత్తికి దోహదం చేసే నినాదాలు.

ప్రజాస్వామిక వ్యవస్థపట్ల ఏమాత్రం విశ్వాసంలేని మావోయిస్టులకు, రాజ్యాంగబద్ధ సంస్థల పట్ల సహజంగానే గౌరవం వుండదు. పత్రికలు పెట్టుబడిదారుల బాకాలంటారు. న్యాయస్థానాలు దోపిడీదారుల ప్రయోజనాలు కాపాడడానికే వున్నాయంటారు. 'అరణ్య' కూడా అచ్చం హరగోపాల్ లాగానే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో తెలం గాణలోని కోట్లాది ప్రజల ప్రయోజనాలు నెరవేరుతున్నాయా? రాజ్యాంగ సంస్థలు నిష్పక్షపాతంగా తెలంగాణకు న్యాయం చేస్తున్నాయా? అని ప్రశ్నిస్తున్నారు. తమ దగ్గర సిద్ధంగా వున్న మావోయి స్టు వాదనలలో 'పేద ప్రజలు' అనే పదం బదులు 'తెలంగాణ ప్రజ లు' అని కొద్దిపాటి మార్పుచేస్తే చాలు. ప్రత్యేకరాష్ట్ర సిద్ధాంతం రెడీ!

చిట్టచివరగా కృష్ణానది 300 కి.మీ ప్రవహిస్తున్నా నీటివసతిలేక మహబూబ్‌నగర్ జిల్లా రైతులు అల్లల్లాడిపోతున్నారని హరగోపాల్ పేర్కొంటే, దానికి సమాధానంగా ఆ జిల్లా రైతులు 22 లక్షల ఎకరాలు సాగుచేస్తున్నారని నేను వివరించాను. బోరు బావులద్వారా 76 శాతం పొలం సాగవుతుందేగాని కృష్ణానది నీటి వలన కాదని 'అరణ్య' వితండవాదం చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా కూడా కృష్ణానది నీరు సాగు పొలాలలోకి ఎలా ప్రవహిస్తుంది? సముద్ర మట్టానికి 1634 అడుగుల ఎత్తులోవున్న ఆ జిల్లా ఎత్తును 800 అడుగులు తగ్గిస్తారా? లేదా కృష్ణానది ఎత్తును పెంచుతారా? కాలం చెల్లిన, వికృత మావోయిస్టు సిద్ధాంతాలతో ప్రాంతీయ విద్వేషాన్ని కలగలిపి, విభజన వాదంతో అమాయక ప్రజలను ఎంతకాలం మోసగిస్తారు?

- అడుసుమిల్లి జయప్రకాష్
మాజీ శాసనసభ్యులు

3 కామెంట్‌లు:

  1. తెలంగాణ ఏర్పడిన తరువాత, జూపల్లి కృష్ణా రావు (My home Group), జీ వినోద్ (manjeeraa group), viSaakaa group, KCR group, నామా నాగేస్వర్(madhuco) వంటి పెట్టుబడి దారులు నోటిలో పాలపీక వేసుకొని వేలు చీకు కొంటూ కూర్చుంటారా?
    అప్పుడు ఆంధ్ర పెట్టుబడి దారులు తెలంగాణ ఉద్యోగులకీ, రా.నా. లకీ లంచాలు ఇచ్చి తమ పనులు చేయకుండా ఎవరు ఆపుతారు?

    రిప్లయితొలగించండి
  2. కృష్ణానది నీళ్ళు రావా? రాలేవా? అలాగయితే కృష్ణానది కూడా సమైక్యవాదులతో చేరిపోయిందా? నాలుగు కోట్లమంది తెలంగాణా వాళ్ళమాట వినకుండా కృష్ణానది యెలా యింకోలా ప్రవహిస్తుంది? కుదరదు.

    రిప్లయితొలగించండి
  3. నీరు పల్లమెరుగు అనే విషయం తెలంగాణా వాదులెరుగరు.1969,2000-12 తె.ఉద్యమాలవల్ల నష్ట పోతోంది తెలంగాణా వారే.

    రిప్లయితొలగించండి