ఆంధ్రభూమి సంపాదకీయ పేజి :తెలుగు భాషా సాహిత్యాలు అలనా పాలనా లేక నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురైన కాలంలో కారణ జన్ముడుగా అవతరించి, మిణుకు మిణుకుమంటున్న ఆంధ్ర సాహిత్యాన్ని స్నేహసిక్తం చేసి, ప్రజ్వలింప చేసిన సాహిత్య సముద్ధారకుడు సి.పి.బ్రౌన్. 1817నుండి మూడేళ్లపాటు ఉద్యోగ శిక్షణ పొందిన బ్రౌన్ 1820 ఆగస్టు 18, 20 తేదీల ప్రాంతంలో కడప కలెక్టర్ హన్‌బరీకి, రెండవ సహాయకుడిగా కడపలో కాలుమోపాడు.
1820 ఆగస్టునుండి రెండేళ్లు కలెక్టరుకు సహాయకుడుగా పనిచేసిన తర్వాత 1822లో మచిలీపట్నంలో జిల్లా కోర్టు రిజిస్ట్రార్‌గా, రాజమండ్రిలో కలెక్టర్ మేజిస్ట్రేట్‌కు ప్రధాన సహాయకుడుగా పనిచేశాడు. 1826 జనవరి 10వ తేదీన జిల్లా కోర్టు రిజిస్టర్ (రిజిస్ట్రార్)గా చేరి 1829 ఫిబ్రవరి దాకా అసిస్టెంట్ జడ్జి, జాయింట్ క్రిమినల్ జడ్జిగా పనిచేశాడు. అప్పుడే కడపలో బంగళా మరియు తోట కొన్నాడు. పదేళ్లకి పైగా వాటిని తనస్వాధీనంలో ఉంచుకున్నాడు. అయోధ్యాపురం కృష్ణారెడ్డి ఇచ్చిన లెక్కల మేరకు బ్రౌన్, బంగళా మరియు 15 ఎకరాల తోటను 3500 రూపాయ లకు కొన్నాడు. బంగళాలో కొంత భాగాన్ని అద్దెకు ఇచ్చి తక్కిన భాగా న్ని పండిత మండలికి నివాసం కోసం ఇచ్చాడు. వివిధ ప్రాంతాలనుండి తెప్పించిన తాళపత్ర కావ్యాలను పరిశీలించి శుద్ధ ప్రతుల తయారీకి వారిని నియమించుకున్నాడు. వారి జీతభత్యాలను తన సొంత ఖర్చుతోటే భరించేవాడు. కడలో రెండు బడులను కూడా స్వంత పైకంతో నిర్వహించాడు.
తాటాకుల్లో శిథిలమైపోతూ, కొన ఊపిరితో వున్న తెలుగు కావ్యాలను కాలగర్భంలో కలిసిపోకుండా పునరుద్ధరించిన మహనీయుడు బ్రౌన్. ఈ తెలుగు సాహిత్య పునరుత్థాన కార్యంలో బ్రౌన్ దొరకు సన్నిహితంగా కృషి చేసిన వారిలో అయోధ్యాపురం కృష్ణారెడ్డి, ధర్మపురం సుబ్బన్న, రావిపాటి గురుమూర్తి శాస్ర్తీ, వఠ్యం అద్వైత పరబ్రహ్మ శాస్ర్తీ, గరిమెళ్ల వెంకయ్య, జూలూరు అప్పయ్య, పాక బుచ్చయ్య శాస్ర్తీ మున్నగు వారు బ్రౌన్‌కు సహకరించారు. అత్యంత నిజాయతీపరుడు అయోధ్యా పురం కృష్ణారెడ్డి కూడా ఆయనకు అంతే సన్నిహితంగా మెలుగుతూ కడపలో బ్రౌన్ బంగళాలో నెలకొల్పిన గ్రంథాలయానికి ఆదర్శ గ్రంథపాలకునిగా వ్యవహరించాడు.
1824లో మొదటిసారిగా, బ్రౌను వేమన పేరు విన్నాడు. వెంటనే వివిధ ప్రాంతాలనుండి 15 విభిన్న వ్రాత ప్రతులను తెప్పించుకున్నాడు. దాదాపు మూడువేల పద్యాలను సేకరించి వాటిలో 693 పద్యాలను నాలుగు భాగాలుగా విభజించి, ఇంగ్లీషులో అనువదించి 1829లో స్వయంగా ముద్రింపచేశాడు. నాలుగవ సంపుటంలోనివి అశ్లీలంగా ఉన్నందున వాటిని ప్రచురింపలేదని డాక్టర్ ఆరుద్ర రాశారు. ఈ విధంగా తెలుగు సాహిత్య కీర్తిని వేమన కీర్తితోపాటు విదేశాలకు విస్తరింపచేసిన మహాపురుషుడు సి.పి.బ్రౌన్. తెలుగు తాళపత్ర గ్రంథాలను సేకరించి వాటిని కాగితాల కెక్కించి, శుద్ధ ప్రతులను తయారుచేయించి వ్యాఖ్యానాలు, పీఠికలు రాయించి అచ్చుకు సిద్ధపరచడం, కడపలోని బ్రౌన్ కళాశాలలో నాటి రోజుల్లో నిత్యం జరుగుతుండేది. తెలుగు ప్రబంధ మండలిలో ప్రత్యేక స్థానం ఆక్రమించిన వసుచరిత్రను పునరుద్ధరించి 1829, 30లో ములుపాట బుచ్చయ్యశాస్ర్తీ (కడప జిల్లా నందలూరు వాడు)చేత ప్రతిపదార్ధ వ్యాఖ్య సామాన్య పాఠకుడికి కూడా సులువుగా అర్ధమయ్యే రీతిగా వ్రాయించాడు. వసుచరిత్ర వ్యాఖ్యానానికి పీఠికా ప్రాయంగా, బ్రౌన్‌ను ప్రశంసిస్తూ పదిహేను పద్యాలు వ్రాశాడు.
ఆనాడు రాజరాజ నరేంద్రుడు, నన్నయను పిలిచి తెలుగు భారతంను వ్రాయమని కోరినవిధంగా3‘‘సకల లక్షణ శాస్త్ర చక్రవర్తి శబ్ద శాసన సూత్ర సహిత వృత్తి లక్ష్య లక్షణ గురు లఘ వర్ణ గణవార్తికావృత్తి పద్వన్మతానువర్తి’’ అని బ్రౌన్ తదని వసుచరిత్ర విషయం చూడమన్నాడని చెప్పుకున్నాడు. బుచ్చయ్య వ్రాసిన అంకిత పద్యాలలో అత్యంత ప్రచులిత పద్యమిది.
అంకిత పాద్యల్లోని కవిత్వకైవారాలకు బ్రౌన్ ఉబ్బిపోలేదు. సామాన్యులకు సైతం అర్ధమయ్యే విధంగా జూలూరు-అప్పయ్యశాస్ర్తీ చేత మరో వ్యాఖ్యానాన్ని (1832-34) వ్రాయించి దానినే ముద్రింప చేశాడు.
బ్రౌన్ గుణపక్షపాతి. వ్యావహారిక భాషా వాదులలో అగ్రగణ్యుడు. 1825లో తెలుగు భారతాన్ని చదువ నారంభించానని, బ్రౌన్ తన స్వీయ చరిత్రలో వ్రాసుకున్నాడు. గ్రంథ పాఠాలను పూరించుకుంటూ, పాఠాంతరాలను గుర్తిస్తూ, అశ్వాసన విభజన గావించుకుంటూ పద్య సంఖ్య, మధ్యమధ్యలో కథకు అనుగుణంగా ఉపశీర్షికలు ఇచ్చుకుంటూ, శుద్ధ ప్రతిని రూపొందిస్తూ వచ్చాడు. ఈవిధంగా ఒక్కొక్క దశను దాటుకుంటూ, 18 పర్వాలకు శుద్ధ ప్రతుల తయారీకి 2714 రూపాయలు ఖర్చుపెట్టాడు. అప్పట్లో బ్రౌన్ నెల జీతం 500 రూపాయలు మాత్రమే.
4జీవద్భాషను బోధించేవి పుస్తకాలు కావు నిత్యమూ, ప్రజా వ్యవహారంలో నుండే భాషే దానిని బోధిస్తుంది. న్యాయస్థానాలలో నేను పండితుడు మొదలుపామరుని వరకు సమస్తమైన వారితో మాట్లాడవలసి వచ్చేది. ముద్దాయి, సాక్షి, ఖైదీ, స్వదేశీయ న్యాయాధికారి, చదువురాని నౌకరు వీరందరూ, నాకు ఒక విధంగా ఉపాధ్యాయులే (బ్రౌన్ స్వీయ చరిత్ర-తెలుగు సేత నిడదవోలు వెంకటరావు భారతి, మే 1963, పుట 80) ప్రజల నాలుకపై పలుకుబళ్లను సామెతలను, చాటువులు కొల్లగా సేకరించాడు. 8 కథా కావ్యాలను, 41 ద్విపద కావ్యాలను సముద్ధరించాడు. 84 శతకాలను సేకరించాడు. వీటిలో పది శతకాలను ముద్రించాడు. బ్రౌన్‌కు నిఘంటు నిర్మాతగా అజరామరమైన పేరు వచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు ఐదు నిఘంటువులను కూర్చాడు. ఇంచుమించుగా సమస్త భారతీయ భాషలతో పరిచయమున్నవాడు బ్రౌన్. ఎన్నో లఘు రచనలు చేశాడు. మంత్రశాస్త్రం, శిల్ప శాస్త్రం, ఖగోళ శాస్త్రం, జ్యోతిష శాస్త్రం మున్నగు వాటి గురించి ఎన్నో వ్యాసాలు రచించాడు. ఛందోలంకార గ్రంథాలు రాశాడు. సంస్కృతంలో సౌందర్యలహరికి వ్యాఖ్యానం రాశాడు. ఆయన రచించిన తెలుగు వాచకాలకు అప్పట్లో విశేష ప్రచారం ఉండేది. బ్రౌన్, డేవిడ్ బ్రౌన్.. కాలే దంపతులకు రెండవ సంతానంగా 1798 నవంబర్ 10న కలత్తాలో జన్మించాడు. తండ్రి డేవిడ్ బ్రౌన్ కలత్తాలోని ఫోర్ట్ విలియమ్‌లో క్రైస్తవ మత ప్రచారకుడుగా ఉండేవాడు. అతడు బహుభాషా కోవిదుడు. తండ్రి చనిపోయేనాటికి బ్రౌన్ 14 ఏళ్లవాడు. తల్లి పిల్లలతో లండన్ వెళ్లగా బ్రౌన్ లండన్‌లోని హెయిల్‌బరీ కళాశాలలో చదువుకున్నాడు. వివిధ పదవులలో రాణించిన బ్రౌన్ చివరి దశలో లండన్ యూనివర్సిటీలో తెలుగు భాషాచార్యుడుగా పనిచేసి 1884 డిసెంబర్ 12న దివంగతుడయ్యాడు. బ్రౌన్ ఆంగ్లేయుడు. అవివాహితుడు. జీవితాంతం తెలుగు భాషా సాహిత్యాలు తన ఊపిరిగా జీవించిన యోగమూర్తి. ఆర్జించిన ప్రతి పైసాను, తెలుగు సాహిత్యోద్ధరణకు, పండిత పోషణకు, గ్రంథ ప్రచురణకు వినియోగించాడు. నిజానికి బ్రౌన్ తెలుగు సాహిత్య రంగంలో తొలి పరిశోధకుడుగా, గ్రంథ సంపాదకుడుగా కీర్తింపదగినవాడు బ్రౌన్. తెలుగునాట రవాణా సౌకర్యాలు, ముద్రణాలయాలు, అక్షర్యాత అంతంతమాత్రంగా ఉన్న కాలంలో తెలుగు వెలుగును దేశాంతర వ్యాప్తి కావించిన సాహిత్య యోగి బ్రౌన్. చాలా కాలం బ్రౌన్ అప్పులతో బతికాడు. ఒక ఆంగ్ల వ్యాపారి వద్ద అప్పులు తీసుకుని ప్రతి నెలా కంతులు చెల్లించేవాడు. తెలుగు సముద్ధరణ కోసం 60వేలు దాకా అప్పులు చేసి చివరకు అన్ని అప్పులు తీర్చినట్టు తన స్వీయ చరిత్రలో వెల్లడించాడు. బ్రౌన్ ఎన్నో త్యాగరాజ కృతులను సారంగపాణి పదాలను సేకరించాడు.
బ్రౌన్ చేసిన సేవలను తెలుగువారు మరువలేదు. ఆ భాషా జీవి నివసించిన సాహిత్య యజ్ఞం జరిపిన స్థలంలో, ఆయన స్మృతి చిహ్నంగా కడపలో గ్రంథాలయ భవనాన్ని నిర్మించారు. ప్రస్తుతం బ్రౌన్ గ్రంథాలయంలో 45,000 పైగా తెలుగు, ఇంగ్లీషు, హిందీ, సంస్కృత, కన్నడ, ఉర్దు గ్రంథాలు అమూల్యమైన ఆంధ్ర పత్రిక ఉగాది సంచికలు ఉన్నాయి. దాదాపు 200 తాళపత్ర గ్రంథాలున్నాయి. బ్రౌన్ ట్రస్టు విజ్ఞప్తి మేరకు బ్రౌన్ గ్రంథాలయాన్ని 2006 నవంబర్‌లో కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయానికి అప్పగించబడింది. అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ఏటా గ్రంథాలయ నిర్వహణకు రు.30 లక్షలు మంజూరు చేశారు. ప్రతి ఏటా సి.పి.బ్రౌన్ జయంత్యుత్సవాలను నవంబర్ 10న వైభవంగా నిర్వహిస్తూ పండితులను సత్కరిస్తున్నారు.
ఇంత మహనీయుడైన బ్రౌన్ దొరగారి చిత్రపటం కూడా మనకు లభ్యమైతే చాలా బాగుంటుంది.
రిప్లయితొలగించండిబ్రౌన్ పేరు వినగానే ప్రతి తెలుగు వాడి గుండె పులకించిపోతుంది.బ్రౌన్,కాటన్- ఇద్దరూ ఇద్దరే..ప్రాతస్మరణీయులు.
రిప్లయితొలగించండిధన్యవాదాలు, చాలా మంచివిషయాలు తెలిసినాయి. తెలుగువారు ఎన్నటికి మరువలేని మహనీయుడు బ్రౌన్ మహాశయుడు శత కోటి ప్రణామములు.
రిప్లయితొలగించండి