7, జులై 2011, గురువారం

అప్రమత్తంగా ఉండాల్సింది ప్రజలే!

తెలంగాణా ప్రాంత కాంగ్రెస్, తెలుగుదేశం, టిఆర్ఎస్, సిపిఐ, బిజెపి ప్రజాప్రతినిధుల రాజీనామాలు ఇటీవలి రాజకీయాల్లో ఒక ముఖ్య ఘట్టం. ఇన్ని పార్టీలకు చెందిన ఇంతమంది కలసి ఒకేసారి రాజీనామా చేయడం రాజకీయంగా చాలా ప్రాధాన్యత కలిగివున్నదనడంలోనూ సందేహం లేదు. అయితే ఈ నిర్ణయంతో అధిష్టానం దిగిరాక తప్పదని చెప్పిన వారి అంచనాలు పూర్తిగా పూర్వపక్షం చేసేలా కేంద్ర పరిశీలకుడు గులాం నబీ ఆజాద్ హోంమంత్రి చిదంబరం మాట్లాడారు. తాజాగా కోర్ కమిటీ సమావేశం సూచనలు కూడా ఆ దిశలోనే వున్నాయి. కనక వీటివల్ల తక్షణమే ఏవో నాటకీయ పరిణామాలు మౌలిక ప్రకటనలు వచ్చేస్తాయన్న వూహాగానాలు వూహలేనని తేలిపోయింది. సాంకేతికంగానూ రాజీనామాలు ఇప్పుడప్పుడే ఆమోదం పొందవు. స్పీకర్ నాదండ్ల మనోహర్ వచ్చి, ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా కలిసి అభిప్రాయానికి రావడానికి ఎంత సమయం తీసుకుంటారో ఆయన ఇష్టం. దీనిపై స్పష్టమైన నిబంధనలేమీ లేవు. అప్పటికి కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల వైఖరులు ఎలా వుంటాయనేది మరో ప్రశ్న.


ఇంతకూ ఈ రాజీనామాలను ఎలా అర్థం చేసుకోవచ్చు? ప్రత్యేక రాష్ట్రానికి తాము కట్టుబడి వున్నామని నిరూపించుకోవడానికి కాంగ్రెస్ నేతల రాజీనామల సమర్పణ ఉపకరిస్తుంది. ఇప్పటి వరకూ దాడులకు విమర్శలకు లక్ష్యంగా వున్న తెలుగుదేశం నేతలు ఆ తాకిడి నుంచి కాస్తయినా బయటపడటానికి తామూ గట్టిగా వున్నామని తప్పు కాంగ్రెస్‌దేనని చెప్పుకోవడానికి అవకాశం కలుగుతుంది. కేంద్రం నుంచి అన్నీ అననుకూల సంకేతాలే వస్తున్న నేపథ్యంలో టిఆర్ఎస్, జెఎసిలు వేడి పెంచేందుకు ఇది దారి తీస్తుంది. దీనిపై ఎలాగూ ఇతర ప్రాంతాల వారూ తమ శైలిలో స్పందిస్తారు గనక మరోసారి కేంద్రం భిన్నాభిప్రాయాలను సాకుగా చూపే అవకాశం లభిస్తుంది. ఈ సంక్షోభాన్ని కారణంగా చూపి రాష్ట్రపతి పాలన వంటిది పెట్టేస్తే అన్ని సమస్యలనూ తాత్కాలికంగా దాటవేసేందుకు దారి దొరుకుతుంది.


ప్రజాస్వామ్య ప్రక్రియ వెనక్కు పోతుంది గనక పాలకుల జవాబుదారీతనం వుండదు. ఏకపక్ష చర్యలు ప్రకటనలు పెరుగుతాయి. రాజీనామాలు చేసి గుండె బరువు దించుకున్న కాంగ్రెస్ నేతలు ఆ మధ్యాహ్నమే విమానమెక్కి ఢిల్లీ వెళ్లి మరోసారి మంతనాలు మొదలెట్టడమే కాదు, రాజీనామా చేయని కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి నివాసాన్ని వేదిక చేసుకున్నారు! అందువల్ల ఈ అంశంలో తుది వాక్యం ఇంకా వెలువడలేదనే అనుకోవాలి. ఇవన్నీ ఎలా వున్నా చిదంబరం సుస్పష్టంగా కాంగ్రెస్ తెలుగుదేశం అభిప్రాయాలతో అభిలపక్షం జరిగిన తర్వాతే తమ వైఖరి చెబుతామని ప్రకటించడం కేంద్రం ధోరణిని తెల్పుతుంది. రాజీనామాలకు నాయకత్వం వహించిన జానారెడ్డి స్వయంగా దీనివల్ల రాజకీయ సంక్షోభం రాలేదని, తాము పార్టీని ధిక్కరించడం లేదని ప్రకటించారు! గ్రేటర్ హైదరాబాద్ మంత్రులు వీరితో కలవకపోవడం కూడా రాజకీయ భౌగోళిక ప్రాధాన్యత గల విషయం. ఉప ముఖ్యమంత్రితోపాటు ఈ రాజీనామా పత్రాలు అందుకున్న డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క కూడా ఇక్కడి వారే.


తెలంగాణా ప్రాంత కాంగ్రెస్ నేతల కోణంలో ఈ రాజీనామా నిర్ణయం వారి అస్తిత్వం కోసం అనివార్యంగా భావించి తీసుకున్నదే తెలుగుదేశం పరిస్థితి కూడా ఇందుకు పెద్ద భిన్నంగా లేదు. టిఆర్ఎస్, జెఎసిలు కాంగ్రెస్ వారిని హర్షించిన స్థాయిలో తెలుగుదేశంను హర్షించకపోవడంలోనూ బోలెడు రాజకీయముంది. ఈ మూడు రాజకీయ శక్తుల ఆధిపత్య వ్యూహాలు వైరుధ్యాలు కొనసాగుతున్నాయనేది ఈ సందర్భంలోనూ తేటతెల్లమవుతున్నది. కెసిఆర్ మంత్రి జానారెడ్డి ఇంటికి వెళ్లడంతో మొదలైన ఈ కొత్త అధ్యాయం భవిష్యత్తులో ఆయన నాయకత్వాన్ని కాంగ్రెస్ ఒప్పుకోవడానికి దారి తీస్తుందా? లేక ఆ ఉభయ శక్తులను దగ్గర చేస్తుందా? కేంద్ర కాంగ్రెస్ మాయాజాలం వల్లనే ఆంధ్రప్రదేశ్ ఇంతటి సంక్షోభంలో కూరుకుపోతే ఆ పార్టీ పతాకం పట్టుకుని వారు వెళ్లడాన్ని జనం హర్షిస్తారా?


ఇంతకూ పదే పదే ఢిల్లీ యాత్రలు చేస్తూ అక్కడ ప్రధాని తదితరుల స్పందనను వూరించి చెప్పిన వారు ఇప్పుడు రాజీనామాలు చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందో వివరించాలి. కాని విచిత్రంగా ఇప్పుడు కూడా అదే ధోరణిలో మాట్లాడుతూనే వున్నారు. ఇది జాతీయ స్థాయి నిర్ణయం అనడంలో పొరబాటేమీ లేదు. డిసెంబరు 9 నే గాక 23 నూ పరిగణనలోకి తీసుకోవాలన్నది కూడా వాస్తవమే. కాకపోతే ఆ రెండు కూడా కాంగ్రెస్ రాజకీయ మాయాజాలంలో భాగమన్నది అసలు విషయం. ఇప్పుడు ఏదో జాతీయ స్థాయిలో బాధ్యతాయుతంగా వ్యవహరించినట్టు చెబుతున్న ఢిల్లీ పెద్దలు ఇప్పటి వరకూ ఆ సంగతి మర్చిపోయారా? జాతీయ పార్టీ అంటూనే ప్రాంతీయ తత్వాలను వాడుకోవడంలో కాంగ్రెస్ ఏ ఒక్కరి కన్నా ఎక్కువ పాత్ర వహించిందని దేశమంతటికీ తెలుసు. 1999లో తెలంగాణా విభజన నినాదాన్ని కూడా కాంగ్రెస్ (టిఆర్‌సిసిసి) రంగం మీదకు తెచ్చిన తర్వాతనే టిఆర్ఎస్ అందిపుచ్చుకుంది. 1969లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమ సందర్భంగా వి.బి.రాజు తదితర మంత్రులు రాజీనామా చేస్తే చాలా తతంగం నడిచింది. చివరకు రాజీనామా చేసిన వారే కాంగ్రెస్‌ను కాపాడుకుందాం అని నినాదమిచ్చి ముఖ్యమంత్రి మార్పుతో సరిపెట్టారు.


1972లో జై ఆంధ్ర నినాదంపై ఎనిమిది మంది మంత్రులు రాజీనామా చేసినప్పుడు రాజీగానే ముగిసింది. 2009 డిసెంబర్ 9 ప్రకటన తరువాత జరిగిన రాజీనామాల ప్రహసనం కూడా ఏమైందో ప్రజలు చూశారు కనక రాజీనామాలు వేడి వొత్తిడి పెంచవచ్చునేమో గాని రాజకీయ పరిష్కారాలు రాష్ట్ర విభజనలు సాధించలేవని ఇప్పటివరకూ నడిచిన చరిత్ర చెబుతున్నది. అయినా కాంగ్రెస్ నేతలు, వారిని పురిగొల్పిన వారు ఈ నిర్ణయంపై అతిశయోక్తిగా మాట్లాడుతుంటే కేంద్ర నాయకులు తేలిగ్గా తీసేస్తున్నారు. ఎలాగూ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి ప్రతికూలంగా వుంది గనక దీన్ని ఖాతరు చేయనవసరం లేదనే మేక పోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.


ప్రాంతీయ సమస్యల విషయంలో కాంగ్రెస్ తెలుగు దేశం నేతలకూ టి ఆర్ ఎస్‌కూ స్పష్టంగా తేడా ఉంటుంది. తెలంగాణ విభజన కోర్కెపై వేడి చల్లారకుండా చూడటంపైనే టిఆర్ ఎస్ రాజకీయ మనుగడ ఆధారపడి వుంటుంది. కాగా ఆ వేడి తమకు నష్టం చేయకుండా చూసుకోవడం మాజీ, ప్రస్తుత పాలక పక్షాలనేతల లక్ష్యంగా వుంటుంది. అవసరమైతే వారు అటూ ఇటూ సర్దుకుని అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఆధిక్యత కాపాడుకోవడానికి చూస్తారు తప్ప ఒకే అంశం చుట్టూ తిరగడానికి టి ఆర్ ఎస్ లాగా సిద్ధం కాలేరు. ప్రాంతానికి సంబంధించిన నాయకుల వరకూ అలా చేసినా ఆ పార్టీలు మొత్తంగా అలా చేయలేవు. టి ఆర్ ఎస్‌కు ఉన్న రాజకీయ ప్రాతినిధ్యమే పరిమితం గనక దాన్ని విస్తరించుకోవడం, తెలంగాణకు తానే ప్రధాన ప్రతినిధిగా రూపొందడం దాని ఎజెండా. ఈ నేపథ్యంలో ఏం జరిగినా వ్యూహాత్మక ప్రయోజనం టిఆర్ఎస్‌కు ఎక్కువగా వుంటుంది. హైదరాబాదు నగరంలో టిఆర్ఎస్ పట్టు పరిమితంగా వుండడం కూడా ఒక అననుకూలత.


ఈ వాస్తవాలన్నీ ప్రస్తుత పరిణామాల్లో ప్రతిబింబిస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ నేతల వైఖరిని సాకుగా చూపించి కోస్తా రాయలసీమల్లో వేడి పెంచడానికి పాలకపక్ష నేతలు ప్రయత్నం చేయొచ్చు. అటూ ఇటూ తీవ్రంగా మాట్లాడుకుని కృత్రిమంగా ఉద్రిక్తత పెంచుతారు. కేంద్రం ఈ పరిస్థితులు మూలంగానే తాను ఏమీచేయలేకపోతున్నానని చెలగాటం కొనసాగిస్తుంది. మరింతగా దాగుడుమూతలాడుతుంది. తన విధానమే చెప్పకుండా ఇంకా తేదీలు తేలని అఖిలపక్ష సభకు అందరూ వస్తేనే నిర్ణయం ప్రకటిస్తాననడం హాస్యాస్పదం. కెసిఆర్ వంటి వారు ఎంతగా కోరుకున్నా కేంద్రం క్రీడలు ఆగేవి కావు. శైలజానాథ్, టిజి వెంకటేష్ ఎంత గట్టిగా వాదించినా ఈ పరిణామాలలో ఆ పార్టీ దోషమూ దాగదు. ఈ పోటాపోటీ ఎత్తుగడల పర్యవసానాలు పడేది మాత్రం ప్రజలపైనే. అందుకే ఈ రాజకీయ వ్యూహాల లోతుపాతులు తెలుసుకుని అప్రమత్తంగా వుండాల్సింది కూడా ప్రజలే!


-తెలకపల్లి రవి 

https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2011/jul/7/edit/7edit5&more=2011/jul/7/edit/editpagemain1&date=7/7/2011

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి