30, జులై 2011, శనివారం

సమ్మెలో పాల్గొంటే జీతాలు లేనట్లే!

సూర్య దినపత్రిక: ప్రభుత్వంలోనూ, ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ పనిచేస్తున్న ఉద్యోగులు సమ్మె బాట పట్టి... విధులకు ఎగనామం పెడితే ఇక జీతాలు లేనట్లేనన్న సంకేతాలు అందుతున్నాయి. ఇటీవల తెలంగాణా ఉద్య మంలో పాల్గొని విధులకు గైర్హాజరవుతూ వచ్చిన ఉద్యోగులకు జీతాలు ఎలా ఇస్తారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిన నేపథ్యంలో ఇక సమ్మె కాలానికి జీతాలు వస్తాయా...రావా అన్న చర్చ జోరందుకున్నది. సమ్మెలో పాల్గొని విధు లకు హాజరుకాని ఉద్యోగులకు జీత భత్యాలు ఎంత చెల్లించారు, ఏ విధంగా చెల్లించారు, అందుకు అనుసరించిన మార్గదర్శకాలు ఏమిటి అన్న వివరాలను సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని తాజాగా ఆదేశించింది.

జీవో 177ను అమలు చేయకుండా ఎందుకు నిలిపివేశారన్న విషయాన్ని కూడా ప్రశ్నించింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన నేపథ్యంలో హైకోర్టు జస్టిస్‌ నిస్సార్‌ అహ్మద్‌ కక్రూ, జస్టిస్‌ విలాస్‌, వి.అఫ్జల్‌ కుర్‌కర్‌లతో కూడిన హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఈ విచారణను జరిపింది. ప్రభుత్వ ఉద్యోగులు పెన్‌డౌన్‌, చాక్‌డౌన్‌, టూల్‌డౌన్‌ వంటి కార్యక్రమాలతో సమ్మెలు చేస్తే వారి జీతభత్యాల చెల్లింపులో కోత విధించే విధంగా నో వర్క్‌ -నో పే విధానాన్ని అమలు చేసేందుకు గత ఏప్రిల్‌ 13న ప్రభుత్వం 177 జీవోను తెరపైకి తీసుకువచ్చింది.

సమ్మె పేరుతో విధులకు గైర్హాజరయ్యే ఉద్యోగుల ప్రవర్తనను నియంత్రించే అధికారం ఉన్న ఈ జీవోను ఎందుకు ఉపసంహరించారో తెలపాలని హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వానికి హైకోర్టు వేసిన కొన్ని ప్రశ్నలతో తలబొప్పి కట్టినట్లయిందంటున్నారు. పూర్తి వివరాలతో రికార్డులు సమర్పించాలని ఆదేశించడంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమవుతోంది. ఇకపై సమ్మెలో పాల్గొనే ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరించేందుకు హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సర్కారు వర్గాలు పేర్కొంటున్నాయి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి