29, జులై 2011, శుక్రవారం

తెర పైకి ఇంకెన్ని డిమాండ్లు రాబోతున్నాయో!


 ఆంధ్రజ్యోతి: తెలంగాణపై సంప్రదింపులు కొనసాగుతుండగా.. మరో ప్రత్యేకరాష్ట్ర డిమాండ్ తెరపైకి వచ్చింది. ఆదిలాబాద్ నుంచి విజయనగరం వరకు ఉన్న ఏజెన్సీని 'మన్యసీమ'గా ఏర్పాటు చేయాలని కోరుతూ మన్యసీమ ఆదివాసీ గిరిజన ప్రజాప్రతినిధుల ఫోరం తరఫున ఆదివాసీ గిరిజన ప్రజా ప్రతినిధులు.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌ను కలిసేందుకు శుక్రవారం ఢిల్లీ వెళుతున్నారు. ఆయన్ను కలిసి మన్యసీమ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వివరించనున్నారు. ఈ ఫోరానికి ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ చందా లింగయ్యదొర చైర్మన్‌గా వ్యవహరిస్తుండగా.. ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, బాలరాజ కన్వీనర్లుగా వ్యవహరిస్తున్నారు.

ప్రతినిధి బృందంలో వీరితో పాటు ఎమ్మెల్యేలు రాజన్నదొర, సుగ్రీవులు, మిత్రసేన, ఆత్రం సక్కు, సత్యనారాయణరెడ్డి, సోమా, మాజీ ఎమ్మెల్యేలు కుంజా భిక్షం, తాటి వెంకటేశ్వర్లు తదితరులు ఉంటారు. ఢిల్లీలో కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్, ఎంపీ బలరాం నాయక్ కూడా వీరితోపాటు ఆజాద్‌ను కలవనున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు సీతక్క, నగేష్ కూడా వెళ్లాల్సి ఉన్నా.. చివరి క్షణంలో ఆగారు. మన్యసీమ ప్రతినిధి బృందం ఆగస్టు 1న రాష్ట్రపతిని, కేంద్ర హోంమంత్రి చిదంబరాన్ని కలవనుంది. ఢిల్లీ వెళ్తున్న నేపథ్యంలో ఆయనకు వివరించాల్సిన అంశాలపైన ఇక్కడి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఫోరం ప్రతినిధులు సమావేశమై కసరత్తు చేశారు.
 

మన్యసీమ డిమాండ్‌కు కారణాలను ఫోరం నేతలు వివరించారు. బ్రిటిష్ హయాంలోనే జల్, జంగ్, జమీన్ పేరుతో ప్రత్యేక పరిపాలన ఉద్యమం జరిగిందని, అప్పుడు హెలెన్‌డ్రాప్ అనే అధికారితో అధ్యయనం చేయించి 1917లో తమ ప్రాంతాన్ని ట్రైబల్ ఏరియాగా నాటి ప్రభుత్వం డిక్లేర్ చేసిందని వెల్లడించారు. స్వాతంత్య్రం వచ్చాక.. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్‌లో ఏజెన్సీ ప్రాంతాన్ని చేర్చి ఆదివాసీలకు కొన్ని హక్కులు కల్పించారని, అది అమలుకాకుంటే స్వయంపాలనా ఏర్పాటు చేయవచ్చునంటూ ఆరో షెడ్యూల్‌లో పేర్కొన్నారని వెల్లడించారు.

యేటా ఆదివాసీలు లక్షల సంఖ్యలో మలేరియా, డయేరియాలతో మరణిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆరోపించారు. మైదాన ప్రాంతంతో పోలిస్తే.. ఆదివాసీల జీవితం 20 ఏళ్లు తక్కువని డబ్ల్యుహెచ్ఓ 2010లో ప్రకటించిన సంగతి గుర్తు చేస్తున్నారు. తమకు దక్కాల్సిన వనరులు దక్కకపోవడంతో ఏం చేయాలనేదానిపైన 2006లో భద్రాచలంలో ఆదివాసీ మేధావులు, ప్రతినిధులతో సమావేశం జరిగిందని, భద్రాచలం రాజధానిగా మన్యసీమ రాష్ట్ర ఏర్పాటు ఒక్కటే పరిష్కారమని అందులో నిర్ణయం జరిగిందని వెల్లడించారు. 


కదలిన మన్యం
 సూర్య దినపత్రిక: తెలంగాణ- సమైక్యాంధ్ర ఉద్యమాలకు పోటీగా మహా మన్యసీమ రాష్ట్ర సాధన ఉద్యమం మరింత ఊపందుకుంది. ఈ ఉద్యమ తీవ్రత శుక్రవారం ఢిల్లీని తాకనుంది. మహా మన్యసీమ కోసం మడ మ తిప్పని ఆదివాసీ నేతలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆదివాసీలకు ‘స్వయం ప రిపాలన’ ఎంత అవసరమో విస్పష్టం తెలియ జేయడానికి శుక్రవారం హస్తినలో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాం నబీ ఆజాద్‌తో భేటీ కానున్నారు. స్వయంగా ఆజాదే వారిని పిలిపిం చడం గమనార్హం.

రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి కిశోర్‌చంద్ర దేవ్‌ ఈ ఉద్యమం వెనుక కీలకపాత్ర పోషిస్తున్నా రు. తెలంగాణ కంటే ముందు నుంచీ అంటే 1917 నుంచీ మన్యసీమ డిమాండ్‌ ఉందని ఆయ న ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఢిల్లీకి వెళ్లనున్న ఈ బృందం వచ్చేనెల 1న రాష్ట్ర పతి, హోం మంత్రిని కలిసి వినతిపత్రం అందజే యనున్నారు. హస్తినలోనే మకాం వేసి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకు న్న గిరిజన నేతలతో నూ లాబీయింగ్‌ నిర్వహించ బోతున్నారు. స్వయం పరిపాలన కోసం కాంగ్రెస్‌పార్టీకి చెందిన ఆదివాసీ ఎమ్మెల్యేలు మన్యసీమ ఆదివాసి గిరి జన ప్రజా ప్రతినిధులు ఫోరంగా ఏర్పడ్డారు.

ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా లను కలిపి మన్యసీమ రాష్ట్రంగా ప్రకటించాలనే డిమాండ్‌కు దశాబ్దాల చరిత్ర ఉంది. చెంచుల ప్రాబల్యం అధికంగా ఉన్న శ్రీశైలంను జిల్లా కేంద్రంగా చేసుకుని కర్నూలు, మహబూబ్‌నగర్‌, ప్రకాశం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలను ఏకఛత్రం కిందికి తేవాలనే డిమాండ్‌ తీవ్రతరమైంది.జల వనరులు, అటవీ, ఖనిజ సంపద పుష్క లంగా ఉన్న ఈ ప్రాంతాలన్నీ ఒక రాష్ట్రంగా ఏర్ప డాలన్న ఉద్యమం ఏడాదిన్నర కాలంగా విస్తృతం గా కొనసాగుతోంది. తెలంగాణ, ఆంధ్ర, గ్రేటర్‌ రాయలసీమ డిమాండ్లు వినిపిస్తున్న క్రమంలో ఇప్పుడు గ్రేటర్‌ మన్యసీమ కూడా ‘ప్రత్యేక జాబి తా’లో చేరడం విశేషం. ఇది రాజకీయ పార్టీలకు కొత్త ఉత్సాహాన్ని, కొత్త అంశాన్ని ఇచ్చినట్టయింది.

మన్యసీమ మొనగాళ్లు అల్లూరి సీతారామ రాజు, కొమురం భీమ్‌ల పోరాట స్ఫూర్తే ఈ ఉద్య మానికి ఊపిరి పోసింది. ఖమ్మంజిల్లా భద్రాచలంలో కొన్నేళ్ల కిందటే పురుడు పోసుకున్న ఈ ఉద్యమం..ఇక మరింత ఉధృతం కానుంది. అదే క్రమంలో...నల్లమల అడవులు వ్యాపించిన ప్రాంతాలను కూడా ఆదివాసీల ‘స్వయం పాలిత కేంద్రం’గా ప్రకటించాలనే డిమాండ్‌ ఉంది. అపారమైన అటవీ సంపద ఈ జిల్లాల సొంతం. ఆదివాసీల బలం అటవీ సంపదే. గోదావరిని ఆసరాగా చేసుకుని గిరిజనులు జీవనం కొనసాగిస్తూ వస్తున్నారు. శ్రీకాకుళంజిల్లాలోనూ మహానది, వంశధార, నాగావళి పరీవాహక ప్రాంతాల్లో ఏజెన్సీ గ్రామాలు ఉన్నాయి.

కొన్ని జిల్లాల్లో గిరిజనుల ప్రాబల్యమే ఎక్కువ. ఒక్క ఖమ్మం జిల్లాలో మొత్తం 46 మండలాలు ఉండగా..వాటిల్లో సగానికి పైగా అంటే-29 మండలాలు ఏజెన్సీ ప్రాంతాలుగా గుర్తింపు పొందడం గమనార్హం.
ఆదివాసీలు ప్రత్యక్ష దైవాలుగా భావించే అల్లూరి సీతారామ రాజు, కొమురం భీమ్‌ల హయాంలోనే ప్రత్యేక ‘మన్యసీమ’కు బీజం పడిందనే వాదనలు ఉన్నాయి. వారి హయాంలోనే ‘జంగల్‌’, ‘జమీన్‌’, ‘పానీ’ నినాదంతో అప్పట్లోనే ఆదివాసీలు స్వయం పాలన కోసం పోరాడినట్లు సమాచారం ఉంది. ‘మీ రాజ్యం మీదే’ అంటూ స్వాతంత్య్రానికి ముందే బ్రిటిష్‌ ప్రభుత్వం చట్టాలు సైతం చేసిందని గణాంకాలు చెబుతున్నాయి.

1/70 చట్టం, అటవీ హక్కులు, 15వ క్రమబద్ధీకరణ..వంటి చట్టాలు ఆదివాసీల సంక్షేమం కోసమే రూపుదిద్దుకున్నాయి. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన అనంతరం మార్పులు జరుగుతున్న కొద్దీ ఆదివాసీల చట్టాలు అటకెక్కుతూ వస్తున్నాయని గిరిజన సంఘాల ఆరోపణ. క్రమంగా వలసలు పెరగడం, అటవీ సంపద దోపిడీకి గురవడం జరుగుతోంది. సమాజం ఆధునికతను సంతరించుకుంటున్న కొద్దీ ఆదివాసీలు వెనుకబాటుతనానికీ, దోపిడీకి గురవుతున్నారు.

కనీస వైద్యం పొందలేని దయనీయ స్థితిలో ఆదివాసీలు బతుకీడుస్తున్నారని ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు సైతం వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో..ఆదివాసీలు స్వయం ప్రతిపత్తి, స్వయం పాలన దిశగా అడుగులు వేస్తున్నారు. ఇటీవలి కాలంలో అటవీ విస్తీర్ణం బాగా తగ్గిపోవడంతో వారు క్రమంగా మైదాన ప్రాంతాల వైపు తరలి రావాల్సి వస్తోంది. చేతివృత్తులు, కులవృత్తులంటూ ఏవీ లేకపోవడంతో పట్టణాల్లో కూలిపనులు చేసుకుంటూ జీవించాల్సిన దుస్థితిలో ఉన్నారు. అడవి తల్లిని నమ్ముకుని తేనె, ఉసిరి, విస్తరాకులు వంటి అటవీ ఉత్పత్తులను విక్రయించుకుంటూ బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా జీవిస్తున్న వారు క్రమంగా ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని అంతర్జాతీయ సంస్థల నివేదికలు సైతం ఉటంకిస్తున్నాయి.

ఆదివాసీలకు స్వయం పాలన హక్కు ఉందని, ఈ విషయాన్ని రాజ్యాంగంలోనూ ఉటంకించారని నిపుణులు చెబుతున్నారు. రాజ్యాంగంలోని షెడ్యూల్‌ 5, షెడ్యూల్‌ 6 దీన్నే పేర్కొంటోందని అంటున్నారు. ఈ షెడ్యూల్‌ను అమలు చేసే విశేష హక్కులు గవర్నర్‌కు ఉన్నాయనేది వారి వాదన. గిరిజన ప్రజా ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, దీనిపై నిర్ణయం షెడ్యూల్‌ 5, షెడ్యూల్‌ 6ను అమలు చేసే హక్కు గవర్నర్‌కు ఉందని చెబుతున్నారు.

శ్రీకృష్ణ కమిటీ దృష్టికీ డిమాండ్‌
మన్యసీమ డిమాండ్‌ను జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ దృష్టికీ వెళ్లింది. గతంలో మన్యసీమ రాష్ట్ర సాధన సమితి కన్వీనర్‌ చందా లింగయ్య దొర, మాజీ ఎమ్మెల్యే కుంజా బిక్షంల నేతృత్వంలో 30 మంది ప్రతినిధులు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌జిల్లాలకు చెందిన ఇన్‌ఛార్జీలు ఈ బృందంలో ఉన్నారు. చెంచు, కోయ, కోయ రెడ్లు ఇలా 30 గిరిజన జాతుల నాయకులు కలిసి శ్రీకృష్ణ కమిటీకి తమ గళాన్ని వినిపించారు.

ఉద్యమం ఉధృతం చేస్తాంః చందా లింగయ్య
మన్యసీమ రాష్ట్రం కోసం గతంలో చేపట్టిన ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నట్లు మన్యసీమ సాధన సమితి కన్వీనర్‌ చందా లింగయ్య స్పష్టం చేశారు. ఉద్యమ స్వరూపాన్ని వివరించారు. ‘ఈ డిమాండ్‌, ఈ ఉద్యమం ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. తెల్లదొరల కాలం నుంచే ఈ డిమాండ్‌ ఉంది. మన్యసీమ రాష్ట్రం కోసం 2006లోనే భద్రాచలంలో జాతీయ స్థాయి సదస్సును కూడా నిర్వహించాం..’ అని ఆయన చెప్పారు.

కేంద్రం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ..ఆదివాసీలు కనీస ప్రగతి సాధించ లేదని అన్నారు. నిధుల మళ్లింపు, వనరుల దోపిడీ దీనికి ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. బొగ్గు గనులు, కృష్ణా గోదావరి చమురు నిక్షేపాలు, ఖనిజ సంపద, గనులు..ఇవన్నీ ఆదివాసీల ప్రాంతాలకు చెందినవేనని అన్నారు. వాటి ద్వారా వేల కోట్ల రూపాయల మేర ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నప్పటికీ..ఆదివాసీలను పట్టించుకున్న నాధుడే లేరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాము రాజ్యాంగ బద్ధంగానే స్వయం పాలన కోరుతున్నామని అన్నారు.

భద్రాచలం రాజధానిగా..
ఆదిలాబాద్‌ నుంచి శ్రీకాకుళం వరకు తొమ్మిది జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలను ప్రత్యేక మన్యసీమ రాష్ట్రంగా ప్రకటిస్తే దీనికి భద్రాచలాన్ని రాజధానిగా చేయాలని సూచన ఉంది. అలాగే..ఉట్నూరు, మంచిర్యాల (ఆదిలాబాద్‌), మంథని (కరీంనగర్‌), మేడారం, మహబూబాబాద్‌ (వరంగల్‌), భద్రాచలం, కొత్తగూడెం (ఖమ్మం), రంప చోడవరం (తూర్పు గోదావరి), పోలవరం (పశ్చిమ గోదావరి), పాడేరు, నర్సీపట్నం (విశాఖ), పార్వతీపురం (విజయనగరం), సీతంపేట, పాతపట్నం (శ్రీకాకుళం)లను జిల్లా కేంద్రాలుగా చేస్తే అనువుగా ఉంటుందని సమితి భావిస్తోంది.

7 లోక్‌సభ, 48 అసెంబ్లీ స్థానాలు
భౌగోళికంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఏడు లోక్‌సభ, 48 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఒక్కో నియోజకవర్గం పరిధిలో సుమారు 2 నుంచి రెండున్నర లక్షల మంది గిరిజన జనాభా ఉండటం గమనార్హం.

ఢిల్లీ వెళ్లే ఎమ్మెల్యేలు వీరే..
పి బాలరాజు (పోలవరం), కెవి సత్యనారాయణ రెడ్డి (రంపచోడవరం), రాజన్నదొర (సాలూరు), సుగ్రీవులు (పాలకొండ), రేగ కాంతారావు (పినపాక), కుంజా సత్యవతి (భద్రాచలం), మిత్రసేన (అశ్వారావు పేట), ఆత్రం సక్కు (ఆసిఫాబాద్‌), జి నగేష్‌ (బోధ్‌).


1 కామెంట్‌:

  1. TO DEMAND IT DOES NOT COST ANYTHING. THERE ARE ABOUT 600 DISTRICTS IN THE COUNTRY. EACH DISTRICT SHALL START DEMANDING A SEPARATE STATE AND EVERY STATE WILL THINK OF DEMANDING A SEPARATE COUNTRY!! ITS A TEMPTING THOUGHT FOR EVERY STATE WITH COAST LINE.

    IT WAS A GREAT BLUNDER TO BIFURCATE THE COUNTRY WITH LANGUAGE AS BASIS.

    రిప్లయితొలగించండి