15, జులై 2011, శుక్రవారం

రాజీనామాలు చేసి, రోడ్డున పడ్డ ఎమ్ పీలు, ఎమ్మెల్యేలు ఏమి సాధించారు?

ఎవరో ఒక ఉప ప్రాంతీయ పార్టీ (తెరాస) నాయకుడి మాట పట్టుకొని అతని ప్రలోభాలకు లోనై, అతగాడి బ్లాకు మెయిల్ పోలిటిక్స్ కి తాము లొంగి, లొంగని వారిని ఒప్పించి ఒక జాతీయ పార్టీ (కాంగ్రెస్), మరియొక రాష్ట్ర ప్రాంతీయ (తెలుగు దేశం) పార్టీ ల ఎమ్మెల్యేలు, ఎంపీలు,రాష్ట్ర మంత్రులు తమ తమ పార్టీల హై కమాండ్లు వద్దు వద్దని వారించినా వినకుండా తెలంగాణా వచ్చేస్తుందని భ్రమించి ఈ నెల జూలై 4, 2011 న ఒక్క పెట్టున, మిడతల దండులా రాజీనామాలు చేసి పారేశారు. తెలుగు దేశం ఎమ్మెల్యేలు రాజీనామా తర్వాత తెలంగాణా బస్సు యాత్ర అని ఒక బస్సు అద్దెకు తీసుకొని నాలుగు రోజు లు తిరిగి ఆ తర్వాత కాళ్ళు లాక్కు వచ్చి చతికిల పడ్డారు. కొంతలో కొంత ఈ తెలుగు దేశం పార్టీ నాయకులకి తెలంగాణా సాధన కోసం పాటుపడుతున్నారన్న పేరు దక్కింది.


కానీ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణా నాయకులు అభాసుపాలు అయ్యారు. ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ నాయకులు తాము రాజీనామా చేసేసామని గర్వంగా ఫీలయి హై కమాండ్ దగ్గరకు వెళ్ళారో, వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం లేక తల దించుకొని హైదరాబాద్ వచ్చారు. ఇంక హైదరాబాద్ వచ్చాక చూస్తే, తమకు దక్కవలసిన క్రెడిట్ అంతా తెలుగు దేశం పార్టీ కొట్టేసింది. ఈ లోపులో శ్రీ కేసీఆర్ తనకు తోచిన విధంగా కార్యక్రమాలని తన ఏజంటు మరియూ తను నమ్మిన బంటూ అయిన ప్రొ.కోదండ రామ రెడ్డి గారు కలిసి అమలు చేయడం ప్రారంభించారు. శ్రీ కేసీఆర్ గారు కార్యక్రమ ప్రణాళిక ప్రకటించినప్పుడు కూడా ఈ దగా పడ్డ నాయకులను కనీసం తలవను కూడా తలవలేదు. ఎందుకంటే తన అవసరం తీరిపోయిన తర్వాత టాయిలెట్ పేపర్ ని పారేసినట్లుగా వీరితో ప్రవర్తించారు. ఇది చూసీ, కాంగ్రెస్ నాయకుల ప్రత్యర్థులు కూడా నోరు వెళ్ల బెట్టారు. ఇంక గత్యంతరం లేక, ఈ రాజీనామా చేసిన కాంగ్రెస్ నాయకులు ప్రజలలో మమేకం కావడానికి ప్రయత్నం లో భాగంగా 48 గంటల నిరాహార దీక్ష ప్రకటించారు. ఈ నాయకులు 48 గంటలు కూడా గడవకుండానే మధ్యలోనే కాడి వదిలేసే ఆనందంతో గంతులు వేసారు. ఏమి ఊడ బొడిచారని డాన్సులు? తెలంగాణా వచ్చేసిందా?తెరాసా నాయకులు కేసీఆర్, వారి పుత్రిక మరియూ వీరి వందిమాగధులు, ఆస్థాన విద్వాంసులు అందరూ కలిసి కాంగ్రెస్ వారి దీక్షని విరమింప చేయడానికి వారి స్టేజీ మీద చేరి కాంగ్రెస్ కండువాలను తమ మేడలో ధరించి వాటితో ముక్కు మొగమూ తుడుచుకొని ఆనందించారు. అదే స్టేజీ మీద శ్రీ కేసీఆర్ గారు తన చెవిలో ఏదో భూతం మంత్రం ఊదింది అన్న చందంగా వచ్చే రెండు వారాలలో తెలంగాణా ఇచ్చేస్తాము అనే సూచనలు తనకు ఢిల్లీ నుండి కాంగ్రెస్ హై కమాండ్ నుండి అందాయని కేశవ రావు భుజం తడుతూ ప్రకటించేశారు. అంతేకాక, ఈ కాంగ్రెస్ నాయకులు అందరూ ఇలాగే కలసి కట్టుగా పనిచేయాలని ఆజ్ఞలు జారీ చేసారు. అంటే, ఆ స్టేజీ మీదున్న మాజీ (అనవచ్చునా) ఎమ్మెల్యేలు, ఎంపీలు వారి హై కమాండ్ దృష్టిలో చవటలు ఎందుకూ కొరగాని వారు అనే అర్థం తో పాటు పార్లమెంటు లో రెండే సీట్లు కలిగిన తెరాసా అధ్యక్షులు శ్రీ కేసీఆర్ హై కమాండ్ వారికి ఆప్తుడు అనే బిల్డప్ ఇచ్చి మరీ వెళ్ళారు.


ఇప్పుడు ఈ మాజీల భవిష్యత్తు ఏమిటి అనేది వారికే కాదు ఎవరికీ అర్థం కాకుండా ఉంది. అంటే సమస్య ఎక్కడికక్కడే అలాగే మిగిలే ఉంది. అంటే ఈ తెలంగాణా కాంగ్రెస్ నాయకులు రాజీనామాలు చేసి ఎందుకూ కొరగాకుండా పోయి రోడ్డున పడ్డారు అంటే తప్పేమిటి. చెప్పుడు మాటలు వింటే వీరికి పట్టిన గతే ఎవరికైనా పడుతుంది అనిపించడం లేదూ? మధ్య మధ్యలో ఈ రాజీనామా చేసిన తెలంగాణా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక అరుపు, ఒక ప్రకటన మీడియా లో ఇస్తూ ఉంటారు. కంగారు పడకండి. కావున, నా ప్రియతమ సీమాంధ్ర వాదులారా మీరు కూడా మీ నాయకులని రాజీనామా చేయమని ఒత్తిడి చేయకండి. లేకపోతె, వాళ్లు కూడా, వీళ్ళ లాగే బస్ స్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుంది.

వీళ్లకి తోడు ఓ యూ మరియూ కే యూ విద్యార్ధి నాయకులు ఆమరణ నిరాహార దీక్ష అని జూలై 11, 2011 న మొదలు పెట్టిన తరువాత పూర్తిగా ఒక రోజు గడవక ముందే వైద్యులు విద్యార్థుల ఆరోగ్యం క్షీణించిపోతోందని హాకీ మ్యాచ్ కామెంటరీ లాగ స్టేట్మెంట్లు. ఆమరణ నిరాహార దీక్ష అని మూడు రోజులు తిండి మానేసినందుకు కళ్ళు వేల్లబెట్టిన ఓ యూ మరియూ కే యూ వృద్ధ విద్యార్ధి నాయకులు వీరు.సరే ఎలాగయితేనేమి 3 రోజుల దీక్ష పూర్తీ అయ్యింది.మరీ మూడు రోజులుకూడా తిండి లేకపోతె చచ్చిపోయే వాళ్లు ఆమరణ నిరాహార దీక్ష అని కూర్చోవడం అవసరమా?


వీళ్లు, ఈ వృద్ధ విద్యార్ధి నాయకులు, కోట్లకు పడగలెత్తిన విప్లవ గాయకులు, పూర్తిగా ఒక రోజు కూడా దీక్ష చేయలేని నాయకులు వీళ్లు తెలంగాణా సాధించి పెడతారా? ఏమో చెప్పలేము. ఏమైనా చేయవచ్చు. వీళ్లు మిగిలిన వారికి చాకలి ఐలమ్మ గారి గురించి, కొమురం భీం గారి గురించి చెప్పి ఊదర కొడతారు. అంతే కాక అమరజీవి పొట్టి శ్రీ రాములుగారి తో పోల్చడం ఒకటి మనకు బోనస్. అసలు వీళ్లకు వారి పేర్లు తలుచుకొనే అర్హత కూడా లేదు.


ఓహో ఏమి ఉద్యమం? ఏమి నాయకులు? ప్రత్యెక తెలంగాణా పట్ల ఎంత అంకిత భావం?

1 కామెంట్‌:

  1. అయ్యో, మీరు నిన్న మన వినోద వార్తా చానళ్ళు చూడలేదా!?బహు చక్కగా డాన్సులు వేసారు కదా. చివరికి వీరి అసలు ప్రతిభ వెలుగులోనికి వచ్చింది.

    రిప్లయితొలగించండి