7, జులై 2011, గురువారం

ఉద్యమం ముసుగులో దళితులపై అగ్రకులాల దాడులు:మందకృష్ణ

హైదరాబాద్, జూలై 6 : "తెలంగాణ సెంటిమెంట్‌తో గెలిచి దొరలు కొద్దిసంవత్సరాలు దేశానికి కేంద్ర మంత్రులైతే తప్పులేనప్పుడు....ఎంఎల్ఏలు కూడా కాలేని దొరల కుటుంబసభ్యులు సమైక్యాంధ్రలో మంత్రులైతే తప్పులేనప్పుడు...పెద్దమనుషుల ఒప్పందం అమలులో భాగంగా కొంతకాలం దళితుడు ఉప ముఖ్యమంత్రి అయితే తప్పెలా అవుతుంది?' అని ఎమ్ఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు.

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ తన పదవికి రాజీనామా చేయాలంటూ టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. తెలంగాణ ప్రజలు దొరల రాజ్యం కోరుకోవడం లేదన్నారు. తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వ ర్గాల ప్రజలు దొర ల పెత్తనం కోరుకోవడం లేదని, సామాజిక తెలంగాణ కావాలంటున్నారని ఆయన చెప్పారు.


దొరల తెలంగాణగా మారే ఏ పరిణామాన్ని ఎట్టిపరిస్తిితుల్లో అంగీకరించమని ఆయన స్పష్టం చేశారు. బుధవారం ఇక్కడి పార్సీగుట్టలోని సంఘం కార్యాలయంలో ఎమ్ఆర్‌పీఎస్ అధ్యక్షుడు యాతాకుల భాస్కర్‌తో కలిసి మందకృష్ణ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఉపముఖ్యమంత్రి రాజీనామా చేయాలన్న డిమాండ్లను ఆయన తోసిపుచ్చారు.


ఉప ముఖ్యమంత్రి రాజీనామా కోరడం పెద్దమనుషుల ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనన్నారు. రాజనరసింహ రాజీనామా డిమాండ్‌తో తెలంగాణలో సామాజిక న్యాయం అంగీకరించబడదని దొరలు స్పష్టం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. సమైక్యాంధ్రకు దళితున్ని ఉపముఖ్యమంత్రిగా అంగీకరించని దొరలు, తెలంగాణ రాష్ట్రం వస్తే దళితున్ని ముఖ్యమంత్రిగా ఎలా చేస్తారని ప్రశ్నించారు.


తెలంగాణలోని 90 శాతం అణగారిన వర్గాల మనోభావాలను గుర్తించకుండా, తమతో మాట్లాడకుండా కేంద్రం తెలంగాణమీద నిర్ణయం తీసుకుంటే అది దొరల చేతికి రాజ్యాన్ని అప్పచెప్పడమే అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఇవ్వాలని, అయితే అణగారిన వర్గాలను దొరలకు బలివ్వవద్దని ఆయన కోరారు.


" ఏ ఒప్పందంలో లేని అడ్వకేట్ జనరల్ పదవి ఈ మధ్యకాలంలో తెలంగాణ రెడ్లకు ఇస్తే ఇది తెలంగాణ ప్రజల త్యాగఫలితమని గర్వంగా ప్రకటించిన దొరలకు...తెలంగాణలో అత్యధిక జనసంఖ్య ఉండి, తీవ్ర అణచివేతకు, వివక్షకు, దోపిడికి గురైన మాదిగ సామాజికవర్గానికి చెందిన దామోదర్ రాజనరసింహకు ఉపముఖ్యమంత్రిగా అవకాశం రావడం తెలంగాణ ప్రజల విజయంగా కనిపించడం లేదా? తెలంగాణ రాకముందే అగ్రకులాలకు ఉన్నత పదవులిస్తే అది పోరాట ఫలితం అయినప్పుడు దళితులకు, ఇతర అణగారిన కులాలకు పదవులొస్తే అది తెలంగాణ ద్రోహం ఎలా అవుతుంది?'' అని మందకృష్ణ ప్రశ్నించారు.


తెలంగాణ ఉద్యమం ముసుగులో అగ్రకులాలు అణగారిన వర్గాల ప్రతినిధులను అవమానిస్తూ దాడులు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. " నిజామాబాద్‌లో మంత్రి సుదర్శన్‌రెడ్డిని అడ్డుకొని కనీసం నిరసన తెలుపని వారు..,ప్రతిపక్ష ఎమ్మెల్యే దళితుడయిన హన్మంత్‌షిండేపై దాడిచేయడమే కాకుండా ఆయన కారును తగులపెట్టారు.


ప్రొఫెసర్ జయశంకర్ అంత్యక్రియల సందర్భంగా పరామర్శకు వెళ్లిన అధికారపార్టీ అగ్రకుల నేతలను ఏమీ అనని వారు దళిత ప్రజాప్రతినిధులైన ఎంపీలు రాజయ్య, వివేక్, మంత్రి శంకర్‌రావుపైదాడులు చేయించడం ఉద్యమం ముసుగులో అగ్రకులాలు కక్షతో చేస్తున్న దాడులు కావా? పై సంఘటనలు రుజువులు కాదా? తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజిక వర్గాలు తెలంగాణను కోరుతున్నామేగానీ దొరల దాడులు, దొరల రాజ్యాన్ని కాదని కేంద్రం త్వరగా గుర్తించాలి'' అని మందకృష్ణ డిమాండ్ చేశారు.


తెలంగాణ అంశంపై ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాల ప్రతినిధులతో కేంద్రం చర్చలు జరుపాలని ఆయన డిమాండ్ చేశారు. డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ స్ఫూర్తికి అనుగుణంగా చిన్నరాష్ట్రాల ఏర్పాటును ఎమ్ఆర్‌పీఎస్ సమర్ధిస్తుందని చెప్పారు. అంబేద్కర్ స్ఫూర్తితో తెలంగాణలోని అణగారిన వర్గాల పక్షాన నిలబడి పోరాడుతామని ఆయన చెప్పారు.


"మమ్మల్ని, మా వర్గాలను వాళ్ల కాళ్లకాడ ఉండాలని దొరలు కోరుకోవచ్చు కానీ మేము వారి కాళ్లకాడ పడి ఉండాటానికి, దొరల జీతగాళ్లుగా ఉండటానికి సిద్దంగా లేము. మేము కోరేది సామాజిక తెలంగాణే. దొరల తెలంగాణ వద్దు'' అని ఆయన స్పష్టం చేశారు. మాదిగ ప్రజాప్రతినిధులను రాజీనామాల నుంచి మినహాయించాలన్నారు.


మాదిగ సామాజికవర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ నాయకత్వంలో మాదిగ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీలకు అతీతంగా ఢిల్లీకి వెళ్లి ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. వర్గీకరణ అంశాన్ని ముందుగా పరిష్కరించడం ద్వారానే సమైక్యాంధ్రలోగానీ, తెలంగాణలోగానీ మాదిగల వాటా తేలుతుందన్నారు. 

https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/jul/7/main/7main24&more=2011/jul/7/main/main&date=7/7/2011

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి