20, జులై 2011, బుధవారం

విశాలాంధ్రకు మేం అనుకూలం: హైదరాబాద్ స్టేట్ అసెంబ్లీలో డి.డి.ఇటాలియా

ఆంధ్రజ్యోతి సంపాదకీయ పేజి నుండి
మిస్టర్ డిప్యూటీ చైర్మన్,

ఆంధ్ర స్టేట్ బిల్ మీద మాట్లాడే అవకాశమిచ్చినందుకు ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 1895- 97 సంవత్సరాలలో నా ప్రాథమిక విద్యాభ్యాసం రాజమండ్రిలో జరిగిందనే విషయం, బహుశా నా మిత్రులనేకమందికి ఆశ్చర్యం కలిగించవచ్చు. నేను రాజమండ్రిలో ఉన్న సమయంలో ఇంకా గోదావరి మీద బ్రిడ్జి నిర్మించలేదు. ఆ రోజుల్లో మేము నదిని పడవ మీదే దాటాల్సి వచ్చేది. అందుకే, అతిసహజంగా నాకు ఆ ప్రాంతం మీద ఉన్న మమకారంతో , ఆ రోజు 'ఆంధ్రా బిల్లు'ను మనస్ఫూర్తిగా బలపరిచేందుకు ఉద్యుక్తుడనయ్యాను.

తమ చిరకాల వాంఛ ను నెరవేర్చుకున్నందుకు ఆంధ్ర ప్రజల్ని అభినందిస్తున్నాను. అనేక సంవత్సరాలుగా మద్రాస్ నుంచి విడిపోయి తమ సొంత రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాలన్న, తెలుగువారి ఆలోచనలు నాకు తెలుసు. నేను రాజమండ్రిలో విద్యార్థిగా ఉన్నప్పుడే ఈ విషయం విన్నాను. ఇన్నాళ్ళకైనా అది నిజయమయినందుకు సంతోషిస్తున్నాను. మీ చిరకాల వాంఛ నెరవేర్చుకోవడానికి ఎన్ని త్యాగాలు చేయవలసివచ్చిందో ఎన్ని కష్ట నష్టాలకు గురికావాల్సి వచ్చిందో, తెలియనిదికాదు.

ఇటీవల, గొప్ప దేశభక్తుడైన పొట్టి శ్రీరాములు తన జీవితాన్నే అర్పించారు. ఆయన దేశభక్తికి నివాళులర్పిస్తూ నేను శిరస్సు వంచి అభివందనాలు తెలియచేస్తున్నాను. అందరూ ఊహించిన దానికంటే అతి తొందరగా ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రకటించిన మన ప్రధానమంత్రికి కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నాను. భారత రాజ్యాంగం ఏర్పడడానికి ముందే, ఆంధ్ర రాష్ట్ర ఆలోచన ఉన్నదని మనకి తెలుసు. రాజ్యాంగ నిర్మాతలు ఆంధ్ర రాష్ట్రాన్ని రాజ్యంగంలోనే పొందుపరుద్దామనుకున్నారు.

కొన్ని సిద్ధాంత పరమైన ఇబ్బందుల వల్ల, ఆఖరి నిముషంలో, ఆ ప్రయత్నాన్ని వాయిదా వేశారు. ఆంధ్ర ప్రజలు అనవసరంగా భారత ప్రభుత్వాన్ని ఆడిపోసుకుంటున్నారు. కానీ మొన్న డిప్యూటీ హోం మినిష్టర్ దత్తార్ 'భారత ప్రభుత్వం ప్రజల కోర్కెలను నెరవేర్చటంలో ఏ మాత్రం తాత్సారం చెయ్యదని' స్పష్టం చేశారు. ఒక నిర్ణయం తీసుకునే ముందు, తప్పొప్పులు బేరీజు వేసుకోక తప్పదని, నూటొక్క సార్లు వెనకాముందు ఆలోచించుకోక తప్పదని కూడా దత్తార్ తెలియజేశారు.

ఒక హైదరాబాద్ వాసిగా, భారత ప్రభుత్వం ఇంకొంత మెరుగైన ఆలోచన చేసివుంటే బాగుండేదనిపిస్తోంది. మద్రాసు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే 12 జిల్లాలనూ హైదరాబాద్‌లో కలిపేసి వుంటే రాజధాని సమస్య హైకోర్టు సమస్య లేకుండా పోయే ది. చాలా డబ్బు కూడా అదా అయ్యేది. హైదరాబాద్‌లో తెలుగు మాట్లాడే 8 జిల్లాలతో తెలంగాణ ప్రాంతముందన్న సంగతి మనకి తెలిసిందే. 45వేల చదరపు మైళ్ళ విస్తీర్ణంతో కోటి జనాభాలో ఉన్న ప్రాంతం తెలంగాణ. నిజానికి సీడెడ్ అని పిలవబడే కర్నూలు, కడప, అనంతపూర్, బళ్లారి జిల్లాలూ, ఉత్తర సర్కారుల్లో కష్ణా జిల్లా మద్రాస్‌లో కలిపేయక ముందు హైదరాబాద్ సంస్థానం లోనివే.

అందువల్ల, సహజంగానే ఆ జిల్లాల మీద హైదరాబాద్‌కు హక్కు ఉంటుంది. ప్రభుత్వం కనక ఆ జిల్లాలను హైదరాబాద్‌లో కలిపే విధంగా ఆలోచన చేసివుంటే హైదరాబాద్ రాజ్య విభజనా జరిగివుండేది. మహారాష్ట్ర, కర్ణాటక అనే మరో రెండు భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కూడా జరిగి ఉండేది. చాలా మంది సభ్యులు, హైదరాబాద్ ప్రజలే హైదరాబాద్ రాజ్య విభజనను అడ్డుకుంటున్నట్లుగా మా మీద దాడి చేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలకు మేమే అడ్డు, అన్నట్లుగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఒక యదార్థాన్ని ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నాను.

ఇటీవలే, రెండు వారాల క్రితం హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల మున్సిపల్ కార్పొరేషన్లు, హైదరాబాద్ రాజధానిగా విశాలాంధ్ర రాష్ట్రానికి తాము అనుకూలమని బాహాటంగా ప్రకటించాయి. హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు స్వామి రామానంద తీర్థ కూడా విశాలాంధ్ర ఏర్పాటుకు మద్దతు ప్రకటించారు. విశాలాంధ్ర ఏర్పడితే తమ పరిస్థితి ఏమిటని తెలుగేతర భాషలు మాట్లాడే వారిలో ఆందోళన ఉన్న మాట నిజమే. కాని ఇది అర్థంలేని ఆందోళన. ఈ ప్రజాస్వామ్య దేశంలో, తెలుగు వారైనా మరే భాష వారైనా, అందరి హక్కులూ సమాన ప్రాతిపదికమీదే కాపాడబడతాయి.

ఈ సభలో అనేకమంది, హైద్రాబాద్ రాజప్రముఖ్ అయిన నిజాంను నిందిస్తూ మాట్లాడడం నాకు బాధ కల్గించింది. ఇది వారి సంకుచితత్వాన్ని బెటపెడ్తోంది. నిజాం కేవలం ఒక నామమాత్రపు అధినేత మాత్రమే. ఆయన పరిపాలకుడు కాదు. కొన్ని సంవత్సరాల క్రితం వరకూ నిజాం అనుభవించిన అధికారాలేమీ ఇప్పుడాయనకు లేవు. హైద్రాబాద్ రాజ్యపాలనలో ఆయన జోక్యమే లేదు. పెద్దమొత్తం భరణంగా తీసుకుంటున్నారన్న అభియోగం తప్ప నిజాంకు వ్యతిరేకంగా మరో అంశమే లేదు.

ఆ భరణం కూడా నిజాం తప్పుకాదు. భారత ప్రభుత్వానికి హైద్రాబాద్ రాజ్యానికి మధ్యజరిగిన ఒప్పంద ఫలితమది. ఒకవేళ ఆ ఒప్పందాన్ని చిత్తుకాగితంగా భావించినట్తైతే, దాన్ని చింపి పారేయండి. ఆ డబ్బు ఆపేయండి. కానీ దానికి రాజ్యాంగ సవరణ అవసరం. అంతే కానీ, ఒక మనిషి లేనప్పుడు ఆ మనిషి గురించి చెడుగా మాట్లాడటం మంచిది కాదు.

ఇక ఆంధ్ర రాజధాని విషయం, భారత ప్రభుత్వం బిల్లులోనే ఆంధ్ర రాజధాని పేరు కూడా ప్రస్తావించి వుంటే, ఈ విమర్శ వచ్చి వుండేది కాదు. రాజధాని అంటే రాష్ట్రానికి గుండెకాయ, ఆత్మ కూడా. ఇక హైకోర్టు విషయం, ఆస్తుల పంపకమూ ఆంధ్ర లెజిస్లేటర్లు తేల్చుకోవల్సిన విషయాలు. నేనందులో జోక్యం చేసుకోను.

1953 అక్టోబర్ 1 శుభముహూర్తాన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడుతోంది. వారు తెలుగువారు గానీ, కన్నడిగులు గానీ మరేభాష మాట్లాడేవారు గాని... శాంతియుతంగా జీవించమని కోరుతున్నాను. మనమంతా ఇరుగుపొరుగు వారమే... స్నేహంగా కలిసి బతకాలి. ఆఖరుగా, ఆంధ్రరాష్ట్రం అభివృద్ధి పథంలో విజయవంతంగా సాగిపోవాలని కోరుకుంటున్నాను. ఆంధ్రరాష్ట్ర అభివృద్ధి అంటే భారతావని అభివృద్ధే అని మనవి చేస్తూ... శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

- డి.డి.ఇటాలియా

1953 సెప్టెంబర్ 7న రాజ్యసభలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లుకు మద్దతు తెలుపుతూ ఇటాలియా (హైదరాబాద్) చేసిన ప్రసంగంలోని కొన్ని భాగాలివి.
(ఉండవల్లి అరుణ్‌కుమార్ రాసిన "హైద్రాబాద్'' అనే వ్యాస సంపుటిలోంచి) 


https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2011/jul/20/edit/20edit3&more=2011/jul/20/edit/editpagemain1&date=7/20/2011

1 కామెంట్‌:

  1. నేనూ అనుకూలమే. హైదరాబాద్‌ని UT/State గా చేశాక తెలంగాణాకు ఎవరూ వ్యతిరేకం వుండరు. :)) వాళ్ళు వేరైతేనే అందరికీ మంచిది. :P

    రిప్లయితొలగించండి