24, జులై 2011, ఆదివారం

కేంద్రానిదే బాధ్యత

ఆంధ్రజ్యోతి ముఖాముఖం: ఆంధ్రప్రదేశ్ అవతరణపై సాధికారతతో మాట్లాడగలిగిన కొద్ది మంది మేధావుల్లో - ప్రొఫెసర్ కె.వి. నారాయణరావు ఒకరు. ఆయన పరిశోథనా గ్రంథాలు 'ద ఎమర్జెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్' (1973), 'తెలంగాణా - ఏ స్టడీ ఇన్ ద రీజినల్ కమిటీస్ ఇన్ ఇండియా' (1972) - అంతర్జాతీయంగా ఖ్యాతి గడించాయి. తెలంగాణాపై ఆయన రాసిన పుస్తకాన్ని లండన్‌కు చెందిన 'టైమ్స్' పత్రిక ప్రశంసించింది. తెలంగాణ ఉద్యమంపైన.. మన రాష్ట్రంలోని స్థితిగతులపైన విస్పష్టమైన అభిప్రాయాలున్న నారాయణరావుతో ఈ వారం ముఖాముఖి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి?
స్వాతంత్య్రం తర్వాత కొన్ని రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి. ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌లు ఏర్పడ్డాయి. ఆ సమయంలో నెహ్రూ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ డిమాండ్‌లను పరిశీలించింది. బెంగాల్‌ను బీహార్‌ను కలపాలని.. కర్ణాటకను, ఆంధ్రను కలపాలని.. ఇలా అనేక రకాల డిమాండ్‌లు వచ్చాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలను కలిపి ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకొనే ముందు కొంత చర్చ జరిగింది. కేరళలో మలబారు వంటి కొన్ని ప్రాంతాలను కలిపి ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించాలనే డిమాండ్‌పై ఈ చర్చ జరిగింది. కేరళను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తే - కమ్యూనిస్టుల ప్రాబల్యం పెరిగిపోతుందంటూ కృష్ణమీనన్ ఈ ప్రతిపాదనను వ్యతిరేకరించాడు. కేరళ తర్వాత ఆంధ్రరాష్ట్రంపై కూడా చర్చ జరిగింది. ఆ సమయంలో- తెలంగాణ ప్రాంతం కమ్యూనిస్టులకు పెట్టని కోటగా ఉండేది. అలాంటి ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వటానికి నెహ్రూ సర్కారు అంత సముఖంగా లేదనేది నా అభిప్రాయం. అంతే కాకుండా - ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ల వంటివి రెండు స్థాయిల్లో ఉంటాయి. మొదటి స్థాయిలో ప్రజలు- ప్రత్యేక రాష్ట్రం వల్ల తమకు ఎలాంటి లాభం చేకూరుతుందనే విషయాన్ని ఆలోచిస్తారు. రెండో స్థాయిలో రాజకీయ నాయకులు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు వల్ల తమకు ఎలాంటి లబ్ది చేకూరుతుందని ఆలోచిస్తారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ సమయంలో కేంద్రం తమకు ఎలా లబ్ది చేకూరుతుందనే విషయాన్ని మాత్రమే ఆలోచించింది. ఇక్కడ మరో విషయం గురించి కూడా చెప్పుకోవాలి. ఎస్సార్సీ నివేదిక కూడా - ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుకు వ్యతిరేకత వ్యక్తం చేయలేదు.

ప్రత్యేక తెలంగాణ రాకుండా ఆంధ్రనాయకులు అడ్డుకున్నారనే వాదన కూడా వినిపిస్తూ ఉంటుంది..
ఇందులో వాస్తవం లేదనిపిస్తుంది. 1950లలో కేంద్ర నాయకత్వాన్ని ప్రభావితం చేయగల ఆంధ్రనేతలు ఎవరూ లేరు. నా ఉద్దేశంలో తెలంగాణకు సంబంధించిన నిర్ణయం కేంద్రమే తీసుకుంది. నెహ్రూ ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు. 1970లలో మళ్లీ ఆ నిర్ణయాన్ని సంపూర్తిగా అమలు చేయటంపైనే ఆయన కుమార్తె ఇందిర మొగ్గుచూపింది. ఇక 2011లో ఇందిర కోడలు సోనియా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఎదురుచూడాలి.

మీ వాదన ప్రకారం తెలంగాణకు సంబంధించిన అంశాలపై కేంద్రమే పూర్తి బాధ్యత వహించాలి..
అవును. కేంద్రమే పూర్తి బాధ్యత వహించాలి. అయితే కేంద్రం ఈ విషయంలో అలక్ష్యం చూపించింది. నైతిక బాధ్యత కూడా తీసుకోలేదు. ఉదాహరణకు పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఉల్లంఘించారనుకుందాం. అది ఎందుకు అమలు కావటం లేదు అనే విషయాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. కాని కేంద్రం మౌనంగా ఉంది. ఇదే విధంగా ప్రణాళిక సంఘం కూడా వ్యవహరించింది. ప్రణాళికా సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపుతుంది. ఆ సమయంలో- ఏ ప్రాంతానికి ఎ ంత ఖర్చు పెడుతున్నారు? ఒక ప్రాంతంపై అశ్రద్ధ చూపుతుంటే ఎందుకు చూపుతున్నారు? వంటి అంశాలపై ప్రణాళిక సంఘం ఆరా తీయొచ్చు. అంతే కాకుండా అటు కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోను కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో కూడా తెలంగాణాకు అందాల్సిన అంశాల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.

ఉద్యోగాల విషయంలో తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగిందని.. అందువల్ల ప్రత్యేక రాష్ట్రం కావాలనే వాదన బలంగా వినిపిస్తూ ఉంటుంది. ఈ అంశాలపై మీరు అధ్యయనం చేశారు కదా. మీ అభిప్రాయమేమిటి?
ఈ విషయంలో కొన్ని నిజాలు ఉండచ్చు. కాని ఎక్కువ అసత్యాలు మాత్రం ప్రచారంలో ఉన్నాయి. 1969 ఉద్యమ సమయంలో కూడా ఇలాంటి ప్రచారాలు జరిగాయి. ఉద్యోగాల విషయంలో ఆ సమయంలో జస్టిస్ వాంఛూ కమిటీ ఒక నివేదిక ఇచ్చింది. దీని ప్రకారం చూస్తే- మొత్తం 92,552 ఉద్యోగాలను భర్తీ చేస్తే- వాటిలో ప్రాంతీయేతరులు కేవలం 3,799 మంది మాత్రమే ఉన్నారు. ఉద్యోగాల విషయంలో కొందరికి అన్యాయం జరిగి ఉండచ్చు. కాని దానిని చాలా ఎక్కువగా చిత్రీకరించటం సరి కాదు.

ఇంత కాలంగా అందరినీ వేధిస్తున్న తెలంగాణ సమస్యకు పరిష్కారమేమిటి?
ఇక్కడ ఒక విషయం అందరూ చాలా స్పష్టంగా గమనించాలి. ఆంధ్రప్రజలు తమ ప్రాంతానికి రావాలని తెలంగాణ వారు కోరుకోలేదు. వారంతట వారే వచ్చారు. దానివల్ల కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. వీటిని సంయమనంతో పరిష్కరించుకోవటం మంచిది. అయితే ఇది చెప్పినంత సులభం కాదు. అనేక విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. హైదరాబాద్‌నే ఒక ఉదాహరణగా తీసుకుందాం. ప్రాంతాల భేదం లేకుండా ఆంధ్రప్రదేశ్‌లో నేతలు - తమ స్వార్థం కోసమైతేనేమి.. ఇతర కారణాల వల్లనైతేనేమి హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టిపెట్టారు. దీనితో పెట్టుబడులు ఇక్కడే ఎక్కువగా వచ్చాయి.

అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు, విశ్వవిద్యాలయాలు ఇక్కడే కేంద్రీకృతమయ్యాయి. ఇంత అభివృద్ధి జరిగిన తర్వాత - ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మంటే ఆంధ్ర ప్రాంత పరిస్థితి ఏమిటి? ఒక వేళ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే - అక్కడ ప్రజలకు విశ్వవిద్యాలయాలు వద్దా? వీటితో పాటుగా అసలు ఆ ప్రాంతానికి రాజధాని ఎక్కడ ఉండాలి? - ఇలాంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వీటిపై భావోద్వేగాలు లేకుండా చర్చ జరగాలి. ఈ చర్చల్లో కూడా కేంద్రం ప్రముఖ పాత్ర పోషించాలి. 'తాంబూలాలు ఇచ్చేసాం తన్నుకుచావండి..' అనే వైఖరి అవలంభించటం సరికాదు. ఈ సమస్యలపై చర్చ జరిగినప్పుడే పరిష్కారం కూడా లభిస్తుంది.

- ఇంటర్వ్యూ: సి.వి.ఎల్.ఎన్.ప్రసాద్

https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2011/jul/24/edit/24edit5&more=2011/jul/24/edit/editpagemain1&date=7/24/2011

6 కామెంట్‌లు:

  1. ఇకనైనా సీమాంధ్ర ప్రజలు పై విషయాలు గుర్తెరిగి, తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అడ్డుపడకుండా, పై ఇంటర్వ్యూ చివరి పేరాలో పేర్కొన్నట్టు - ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికి ఏం కావాలో వాటి గురించి కేంద్ర ప్రభుత్వంతో చర్చించి సాధించుకోవాలి. ఈ విషయంలో అవసరమైతే తెలంగాణ ప్రజలు తమవంతు మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నారు.

    రిప్లయితొలగించండి
  2. "ఇకనైనా సీమాంధ్ర ప్రజలు పై విషయాలు గుర్తెరిగి"

    ఏ విషయాలు? వేర్పాటువాదులు అమాయకులకు నూరిపోసిన పచ్చి అబద్ధాలు గురించి మాట్లాడుతున్నారా?

    రిప్లయితొలగించండి
  3. Only Kerala& TN Special Armed Police can understand తెలంగాణ ప్రజల ఆకాంక్ష well and do justice, not even Andhra Police. ;) :D

    రిప్లయితొలగించండి
  4. నాయనా!Chaitanya!
    "పై విషయాలు.." అంటే "పైనున్న పోష్టులోని విషయాలు" అని కూడా అర్థం కాదా?
    తమరు ఏ పోష్ట్ పెడుతున్నారో .. దాన్ని కూడ చదవరా?
    ఆ విషయాలు తమ పోష్టులోనివే - కట్ అండ్ పేష్ట్ చేస్తున్నా - చదువుకోండి -

    "ఆ సమయంలో- తెలంగాణ ప్రాంతం కమ్యూనిస్టులకు పెట్టని కోటగా ఉండేది. అలాంటి ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వటానికి నెహ్రూ సర్కారు అంత సముఖంగా లేదనేది నా అభిప్రాయం. అంతే కాకుండా - ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ల వంటివి రెండు స్థాయిల్లో ఉంటాయి. మొదటి స్థాయిలో ప్రజలు- ప్రత్యేక రాష్ట్రం వల్ల తమకు ఎలాంటి లాభం చేకూరుతుందనే విషయాన్ని ఆలోచిస్తారు. రెండో స్థాయిలో రాజకీయ నాయకులు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు వల్ల తమకు ఎలాంటి లబ్ది చేకూరుతుందని ఆలోచిస్తారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ సమయంలో కేంద్రం తమకు ఎలా లబ్ది చేకూరుతుందనే విషయాన్ని మాత్రమే ఆలోచించింది. ఇక్కడ మరో విషయం గురించి కూడా చెప్పుకోవాలి. ఎస్సార్సీ నివేదిక కూడా - ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుకు వ్యతిరేకత వ్యక్తం చేయలేదు."
    "ఈ విషయంలో కొన్ని నిజాలు ఉండచ్చు... ఉద్యోగాల విషయంలో కొందరికి అన్యాయం జరిగి ఉండచ్చు."
    "ఇక్కడ ఒక విషయం అందరూ చాలా స్పష్టంగా గమనించాలి. ఆంధ్రప్రజలు తమ ప్రాంతానికి రావాలని తెలంగాణ వారు కోరుకోలేదు. వారంతట వారే వచ్చారు. దానివల్ల కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి."

    రిప్లయితొలగించండి
  5. /ఆంధ్రప్రజలు తమ ప్రాంతానికి రావాలని తెలంగాణ వారు కోరుకోలేదు. వారంతట వారే వచ్చారు./
    ఓహో! గట్లనా, గైతే మంచిది, వాళ్ళే ఇష్టం లేనపుడే వదలి పోతారులే. వచ్చేందుకే మీ ప్రమేయం లేనపుడు పోయేందుకూ మాత్రం ఎందుకుండాలి?

    మరి 'నా తెలంగాణ కోతి రతనాల వీణ ' అన్న దాశరథి ఏమన్నారో ఓ సారి గూగుల్చేసుకోని రండి నాయనా. 50ఏళ్ళ తరువాత డౌట్లెందుకొస్తున్నాయో, కుంభకర్ణుడైనా 6నెల్ల కోసారి లేచేవాడంటంటారు.

    ఎవడు ఏమన్నాడు, కులీ కుతుబ్షా మస్తాన్ అలీతో ఏమన్నాడు? నిజాం, కాశిం రజ్వీ ఏం కలలు కన్నారు? పజిల్స్ అలి 1955లో ఏంచెప్పాడు? నెహ్రూ లేడీ మౌంట్బాటంతో తెలంగాణ మీద ఏం షెప్పిండు, ఇందిరమ్మ వీపు ఎందుకు వాయగొట్టింది? చెన్నారెడ్డి ఏం చేసిండు? అనేవి అనవసరం. Time bar ఐన చరిత్రల మీద ఈకలు పీకే తీరిక మీకువుండచ్చు, మాకు లేదు. తీరిగ్గా రోడ్డు పక్కల ఫ్రీగా తిని పాన్ వేసుకోని, గోడలమీద, రోడ్లమీద హస్కేసుకోండి.
    నక్సలైట్ల అజెండా అమలుకు, నిజాం జెండా పాతుకోవడానికి, రోడ్లంబట తిని కుప్పిగెంతులేసుకోవడానికి ఓ రాష్ట్రాన్నిచ్చే ప్రసక్తే లేదు. బాగు పడాలంటే పని చేయాల్సిందే, ఎవరో వచ్చి మిమ్మల్ని ఉద్ధరించరు. ఇగ వూకే ఏడిస్తే పోనీలే అని హైద్రాబాద్ స్టేట్(నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి) బగైర్ లంగాణా ఇస్తాం, 20ఏళ్ళతరువాత కూడా హైద్రాబాద్ స్టేట్ కలవాలనుకుంటే కలుపుకోండి. రెండువారాల్లో ఏ మాట చెప్పున్రి, లేదంటే గదే ' కల్సుందాం రా!' సమఝ్ అయ్యిందా బిడ్డా?

    రిప్లయితొలగించండి
  6. "నాయనా!పై విషయాలు.." అంటే "పైనున్న పోష్టులోని విషయాలు" అని కూడా అర్థం కాదా?తమరు ఏ పోష్ట్ పెడుతున్నారో .. దాన్ని కూడ చదవరా?
    ఆ విషయాలు తమ పోష్టులోనివే - కట్ అండ్ పేష్ట్ చేస్తున్నా - చదువుకోండి -"


    తండ్రీ! మీరు మహాభారతం లో తెలంగాణాను కనుగొన్న ఘనులు. మీకు కట్ అండ్ పేస్టు తెలియదని కాదు. పాపం నారాయణరావు గారు మొహమాటపడి మధ్యేమార్గం అన్నట్లుగా మాట్లాడారు.లేకపోతే ఆయన అడ్రస్ కనుకొని మరీ మీతోటి వాళ్ళకు బెదిరింపులకు,దాడులకు దిగుతారని ఆయనకు తెలుసు.మీకు పేస్టు చేసిన లైన్లు తప్ప ఏమియును కనిపించలేదా?పై విషయాలు అంటే అక్కడ బోలెడు విషయాలు ఉంటివి. అటువంటిది మీరు చివరి పేరాలో ఆయన ఏదో నిగూడంగా పేర్కొన్నట్టు - ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికి మార్గాన్ని చూపినట్లు మాట్లాడినారు.

    రాష్ట్ర విభజన ఏ ప్రాతిపదికన జరగాలన్నది వేర్పాటువాదులు ఇప్పటికి పేర్కొనలేదు. నారాయణరావు చెప్పినట్లు " ఎక్కువ అసత్యాలు మాత్రం ప్రచారంలో ఉన్నాయి". అసత్యాలు పునాదులపై ఎంత కాలమని నిలబడతారు? మీరు దీనిని చదివారా?http://visalandhra.blogspot.com/2011/07/blog-post_924.html

    రిప్లయితొలగించండి