తోటి తెలుగువాడి కోసం పరితపించిన చిత్తూరు వాసి
(ఆంధ్రజ్యోతి ఆన్‌లైన్, గల్ఫ్ ప్రతినిధి) తెలంగాణ, సమైక్యాంద్ర ఉద్యమం ఊపందుకున్న నేపథ్యం.. విద్యాధికులైన ప్రవాసీయులు ప్రాంతీయ విద్వేషాలతో ఇంటర్నెట్ వేదికలపై పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్న తరుణం.. అయినా అవేవీ పట్టనట్టుగా ఈ చిత్తూరు వాసి తోటి తెలుగువాడి కోసం పరితపించాడు. ఎడారి గ్రామంలో దిక్కూ మొక్కూ లేకుండా మరణించిన నిజామాబాద్ జిల్లా వాసి కోసం తెలంగాణవాదులెవరూ ముందుకు రాకపోయినా సలీం నడుం బిగించాడు.
నానా తంటాలు పడి అతడి మృతదేహాన్ని స్వదేశానికి పంపించాడు. సౌదీ అరేబియాలోని రియాద్‌కు 200కిలో మీటర్ల దూరంలో హోతా అనే ఏడారిలో నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన బొమ్మకొండ స్వామి గౌడ్ గుండెపోటుతో జూలై 5న మరణించాడు. స్వామిగౌడ్ తన వద్ద పని చేయడం లేదని అతని మృతదేహం ఖర్చును తాను భరించనని అరబ్బు యజమాని చేతులెత్తేసాడు. కనీసం రెండు నెలల పెండింగ్, స్పాన్సర్ లేని కేసులలో మాత్రమే భారతీయ ఎంబసీ మృతదేహం తరలింపునకు నిధులు చెల్లిస్తుంది. మృతదేహాన్ని తెప్పించాల్సిందిగా మృతుడి కుటుంబం స్థానిక ఎంపీ మధుయాష్కీని కోరగా ఆయన హామీనిచ్చినప్పటికీ అది అమలు కాలేదు.
ఈ పరిస్థితుల్లో ఆ గ్రామంలో సైకిల్ దుకాణం నడుపుకొంటున్న చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన సలీం వారం రోజులపాటు తిరిగి అధికారిక లాంఛనాలు పూర్తి చేసి భారతీయుల నుంచి విరాళాలు సేకరించి మృతదేహాన్ని స్వదేశానికి పంపించాడు. సిరిసిల్ల నియోజకవర్గంలోని కోనరావుపేట మండలానికి చెందిన బాష రాజయ్య ఒమన్‌లో మరణించగా, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నల్లూరి హరిబాబు మృతదేహాన్ని మస్కట్‌కు తీసుకొచ్చి హైదరాబాద్ పంపించాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి