20, జులై 2011, బుధవారం

అకస్మాత్తుగా అవతరించి..

వీరాజీయం- ఆంధ్ర భూమి: బంద్‌ల ఇబ్బందులు పడలేక జనం మూల్గుతున్నారు. బంద్‌వల్ల ఆర్‌టిసికి ‘పదికోట్లు’ కన్నం-అంటే, రైల్‌రోకో చేత రైల్వేకి యాభై కోట్లు నష్టం-అంటున్నారు పెద్దలు. తీతాలు-అంటే తీసేసిన తాశిల్దారు మొహాలెట్టుకుని ఇందిరా పార్కు దగ్గర నిరాహార దీక్షకు కూర్చుని-‘‘దిక్కుమాలిన సూర్యుడు నత్తనడక నడుస్తున్నాడన్నట్లు’’ రెండోరోజు దీక్షలో రెస్ట్‌లెస్‌గా ఉన్న-జానా, కేకే లాంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు- ఇందిరమ్మనీ, సోనియామాతనీ మార్చి మార్చి తల్చుకుంటుంటే-అకస్మాత్తుగా అక్కడ గులాబీ రంగు కండువాతో వూడిపడ్డాడు ....అలా అవతరించినదెవరో కాదు. వ్యూహాత్మక మవున వ్రతం దాల్చిన మహారధుడు-శ్రీమాన్ కెసిఆర్ ది గ్రేట్. గులాం నబీ ఆజాద్‌గారు సంధించిన ‘ఏకాభిప్రాయ సాధనాస్త్రం’ దెబ్బ తట్టుకోలేక ఏకంగా ‘‘్ఫర్టీ ఎయిట్ అవర్స్’’-అనగా రెండు దినములు-నోట్లోకి నాలుగు వేళ్లూ వెళ్లకుండా కాపాడుకుంటూ-మాట్లాడుటకు అనగా-మీడియాతో మాత్రమే మాట్లాడుటకు తప్ప మరోరకంకగా నోరు వాడమని కూర్చున్న జానా, కె.కె లాంటి అతిరథ మాజీ మహారధులు డీలా పడివున్నారు. కేంద్రంనుంచి ‘దూతా’-గానీ, సందేశం గానీ వస్తుందేమోనని ఎదురు చూస్తున్న నాయకులంతా ఒక్కసారి-గరుత్మంతుని చూసిన పక్షుల్లాగా-లేచి, తెరాస బాస్‌ని సాదరంగా ఆహ్వానిస్తూ-అట్టి తరి వేరొండు పూల మాల గాని దండగాని లేని కతంబున -త్రివర్ణాంకిత కాంగ్రెస్ కండువాని మువ్వనె్నలు మెరియగా-మురుస్తూ-ముచ్చటగా మెడలో వేసి ఆసీనులు కండు!’’ అన్నారు.

పంజరంలోనుంచి బయటపడ్డారే గానీ-ఎగురలేని పక్షుల్లాగా అయిపోయారు వాళ్లు పాపం! రాజ్యం ఉండీ కూడా నెత్తిన కిరీటం లేకుంటే -రాజుల్నే గుర్తించని ఈ రోజుల్లో-కిరీటం మైనస్-టి.కాంగ్రెస్ నాయకుల్ని-‘‘టి ఉద్యమ’’’ నిర్మాత స్వయంగా వచ్చి, వాటేసుకుని ‘‘డోంట్ వర్రీ..బీ హ్యాపీ..నాకు సంకేతాలు వస్తున్నాయ్’’ అన్నాడట. డైలాగుల్ని రిహార్సల్స్ లేకుండా చెప్పడానికి ప్రయత్నించే పాత్రధారుల్లా కెసిఆర్ బ్యాటింగ్‌ను చూస్తూ ఉండిపోయారు వాళ్లు. ‘‘రెండు వారాల్లో మీ పార్టీ హై కమాండ్ తెలంగాణ ఏర్పాటుకు ఓ ప్రకటన చేసి తీరుతుంది’’ అన్నాడు రావు. ‘‘క్లైమాక్స్‌కి వచ్చేశాం. క్రెడిట్ మీదే అవుతుది. కొనసాగించాడు దీక్షను’’ అంటూ ప్రోత్సహించాడు.

తన సహజ పంచాంగం విప్పి సందేశామృతాన్ని ఇచ్చి నకెసిఆర్‌జీ, కాంగ్రెస్ కండువాని తన గులాబీ కండువా పక్కనే చుట్టుకుని వున్న మెడను ఓసారి రిక్కించి నిష్క్రమించగా మీడియా నారదుడికి-షడ్ర సోపేతమయిన విందు లభించినట్టుగా ఉంది. గులాంనబీని పక్కన బెట్టుండ్రీ-. ఆయన మాట వినుండ్రీ! కిరణ్‌కుమార్‌రెడ్డి మాయలో పడకుండ్రీ’’-అన్నట్లు మొహాలు పెట్టారు.... తెలంగాణ కోసం పదవులను అటు ఇటు కాని ‘త్రిశంకు నరకం’లో వ్రేలాడతీసి కూర్చున్న హేమా హేమీలు జనాల్ని ఎట్లా మెప్పించడమా? అన్న సందిగ్ధంలో పడ్డారు. దీక్ష విరమించారు.సొంత పార్టీ మనుషులు-మాజీ ‘కాంపా’ అధ్యక్షులు, మంత్రులు-సారీ, ఇంకా మాజీ కాదు కాబోలు-రాజీనామా వీరులు-వాళ్లకి ‘వెదర్ రిపోర్ట్’ అందలేదు. కాంగ్రెస్ పార్టీనుంచి క్రెడిట్ తన్నుకుపోదాం అనుకుంటున్న తెరాస నాయకుడి దగ్గరనుంచి సంకేతాలు తీసుకోవడమా? పైగా ముంబయి బాంబు పేలుళ్లలో సతమతమైపోతున్న పార్టీ అధినాయకత్వం-తక్షణం వీళ్లకు అందుబాటులో కూడా ఉండదు కదా? పోలీసుల్ని, మీడియాని తప్ప మరెవ్వరినీ పని చెయ్యకుండా తెలంగాణ ప్రాంతాన్ని స్తంభింపచేసిన-జాయింట్ యాక్షన్ కమిటీలకు కూడా కెసిఆర్ చేతిలోవున్న ముక్క-‘తురుఫు’ ముక్కా? లేక ఉత్తుత్తి ముక్కా? అన్నది తెలియడంలేదు.

ఏమిటో ఒక తెలియని స్థితిలో పడ్డాడు కెసిఆర్‌గారు కూడా- ఎట్నుంచి చూసినా, ఇప్పుడు నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్నది - ‘ఇబ్బందులే’ గానీ, అవి ‘బంద్‌లు’ కావు అన్న నిరసన ధ్వనులు వినిపిస్తున్నాయ్. ఒకప్పుడు టిడిపికి చెందిన తెలంగాణ నాయకుడు నాగం-విద్యార్థుల ఆమరణ నిరాహార దీక్షను విరమింపచేసారు. ‘‘అది వాళ్లకి స్కోరింగ్ పాయింట్’’ అన్నారు కొందరు. తెలంగాణలో-‘విద్య’ చతికిలబడ్డదంటూ-‘‘ఎంతోమంది తమ పిల్లల్ని-విజయవాడ, గుంటూరులు తీసుకునిపోయి-అక్కడ నారాయణ, చైతన్య అంటూ-ఇంటర్‌మీడియట్‌లో చేర్పిస్తున్నారు’’ అన్న వార్తలు కూడా పత్రికల్ని అలరిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో మరోబంద్-ఇంకో బంద్ అనడానికి వీలు లేనట్లుగా ఉంది జెఏసి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కాక్రూగారు-మరో న్యాయమూర్తి ఆఫ్‌జుల్ పుర్కార్‌గారూ ఉన్న ‘్ధర్మాసనం’- వారు కెసిఆర్ కోదండరామ్‌లకీ అలాగే బంద్ అనంగానే-ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం మాని-రైళ్లు, బస్సులు రద్దుచేసి ప్రజల్ని నానా ఇక్కట్లకు గురి చేసినందుకు-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడ ‘శ్రీముఖం’ పంపించారు. ‘‘సీమాంధ్రా వాడెవడయినా పిటిషన్ కొట్టాడా?’’ అనడిగాడు, ఓ తటస్తవాది కుతూహలంగా. ‘‘కాదు..వరంగల్ వినియోగదారుల ‘్ఫరమ్’ అధ్యక్షుడు-చక్రపాణిగారు ‘చక్రం’ సంధించాడు- అసలీ బంద్‌లు-రాజ్యాంగంలోని 21వ అధికరణానికి భంగం కలిగిస్తున్నాయ్- అని పిటిషన్‌దారుని వాదన.’’ ఆమాటకొస్తే సుప్రీంకోర్ట్-లోగడ ఒకటికి మూడుసార్లు బంద్‌లు పిలిచే రాజకీయ పార్టీల మీద ‘అక్షింతలు’ వేసింది. ‘ఆంక్షలు’ పెట్టింది.

సుప్రీంకోర్ట్ ఈజ్ బ్యాక్ ఆన్ యూ!

http://www.andhrabhoomi.net/sub-feature/veerajeeyam-308

1 కామెంట్‌: