29, జులై 2011, శుక్రవారం

తెలుగునేలంతా తెలంగాణమే!

మూడువేల సంవత్సరాల లిపి, నాణేల, శాసనాల, చారిత్రక, సాహిత్య, సారస్వతాది ఆధారాలుగల తెలు గుజాతి మూలాలను గుర్తించలేని మూఢమతులకు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోనూ కొదవలేదు. రాజ కీయ ముసుగుల్లో ఉన్న పదవీ కాంక్షాపరులు రాష్ట్ర ప్రజాబాహుళ్యం ఆవేదనను అర్థం చేసుకోలేని దుస్థి తిలో ఉన్నందున, ప్రజలే వీళ్లను కనిపెట్టి ‘ముగు దాళ్లు’ కట్టి దారికి తెచ్చుకోవలసిన సమయం ఆసన్న మైంది. మహాకవి శ్రీశ్రీ ఏనాడో చెప్పాడు. ‘‘అన్ని ప్రాంతాల ప్రజల కోరికలూ అర్థవంతమైనవే.

కాని కొందరు వినాయకుల ప్రకటనలూ, వ్యాఖ్యానాలే అర్థవంతమైనవి కావు’’ అని! ఎందుకంటే ప్రజల ఆకాంక్షలు వేరు, నాయకుల అసలు ఆశలు వేరు! నాయకుల ‘ఆశలు’ ప్రజల ఆకాంక్షలకు ఎల్లవేళలా, అన్ని కాలాల్లోనూ ప్రతిబింబాలు కావు, కాజాలవు. పదవీ కాంక్షాపరులకు, ‘మాకు పనులు కావాల’ని ఘోషిస్తున్న ప్రజలకూ మధ్య పూడ్చలేనంతగా గండి ఎప్పుడు ఏర్పడుతుందో అప్పుడు అందరి బుద్ధులూ పెడమార్గాలు తొక్కుతాయి! ఇలాంటి పెడ మార్గాల్లో ఒకటి- 1956లో అవతరించిన సమైక్య రాష్ట్రానికి ‘ఆంధ్రప్రదేశ్’ అన్న దుష్ట సమాసంతో ఉన్న పేరును తెలుగువారు ఎంపిక చేసుకోవలసి రావటం! కర్ణాటక, తమిళ నాడు, కేరళ, మహారాష్ట్రలకు లేని ఇబ్బందిని తెలుగు రాజకీయ నాయకులు కొరివితో తలగోక్కున్నట్టుగా ఇలా ఎందుకు కొనితెచ్చుకున్నట్టు? మన రాష్ట్రానికి ‘తెలుగునాడు’ అనో, ‘తెలంగాణం’ అనో పేరును నికరం చేసు కుని ముందుకు సాగాల్సిందిపోయి ‘ఆంధ్రప్రదేశ్’ అనే ఒక వైరి సమాసాన్ని ఎం దుకు ఆశ్రయించారు? కేంద్ర ప్రభుత్వాన్ని అధిష్టించిన వారిలో హెచ్చు మంది హిందీ రాష్ట్రాల వారు కాబట్టి, వారికి అనువైన ‘ప్రదేశ్’ అనే ఒక తోక పదాన్ని రాష్ర్ట నామానికి తోడు చేసుకున్నారు. 

ఎందుకంటే, హిందీ ప్రాంతాల వారికి ‘రాష్ట్రం’ అంటే భారతదేశమనేగాని ‘ప్రదేశ్’ అనే ప్రాంతం కాదు! కాగా, మనకు లేదా దక్షిణాది వారికి ‘రాష్ట్రం’ అంటే తమ భౌగోళిక పరిధుల్లో ఉంటున్న ప్రాం తం మాత్రమే. అందుకనే ఉత్తరాది హిందీ ప్రాంతాల వారు తమ నివాస ప్రదేశాలకు ‘ప్రదేశ్’ పదాన్ని తగిలించుకున్నారు. దాని ఫలితమే హిందీ రాష్ట్రా లను మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్‌గా పిలుచు కోవటం! వాళ్ల ఉద్దేశంలో ‘రాష్ట్ర భాష’ అంటే దేశభాష, కానీ అదే మన దక్షిణాది రాష్ట్రాలలో ‘రాష్ట్ర భాష’ అంటే ప్రాంతీయ మాతృభాష. భాష వాడకంలో ఉన్న ఈ వ్యత్యాసం జాతీయస్థాయిలో ఉన్న తెలుగు (ఆంధ్ర) నాయకులకు తెలియక పోదు. కాని జాతీయ సమైక్యతా దృక్కోణం నుంచి హిందీ రాష్ట్రాల ‘ప్రదేశ్’ పదం వాడకాన్ని ఆంధ్రకు చేర్చి ‘ఆంధ్రప్రదేశ్’గా దుష్ట సమాసంతో నామ కరణం చేయడానికి వారు ఆనాడు ఆమోదం తెలిపి ఉంటారు.

అలాగే బహుశా ‘ఆంధ్ర’లోని తొలి అక్షరంగా ‘ఆ’ ఉన్నందున, అకారాదిక్రమంలో ‘ఆంధ్ర ప్రదేశ్’ తొలి వరుసలో నిలుస్తుందన్న భావనతో కూడా రాష్ట్రానికి ఆ పేరును ఖాయపరచీ ఉండవచ్చు. నిజానికి మన పిచ్చిగాని అకారాదిక్రమంలో ఒక రాష్ట్రం పేరు ముందున్నంత మాత్రాన అభివృద్ధిక్రమంలో, మానవ వికాసంలో ఆ రాష్ట్రం ప్రథమస్థాయిలో ఉంటుందని ఎక్కడా రాసిపెట్టి ఉండదు! ఆ మాట కొస్తే, ‘వడ్డించే వాడు మన వాడైతే కడపంక్తిని కూర్చున్నా అన్నీ సమకూర తాయ’న్నట్టుగా అకారాదిక్రమంలో ఆఖరి స్థానంలో ఉన్నంత మాత్రాన రాష్ట్రాల ఉనికీ, ఉసురూ, సగటు బతుకూ చెడిపోదు గదా! ఈ వాస్తవిక దృష్టితో ఆలోచ నలు సాగనందునే రాష్ట్రానికి నామకరణంలో రాజకీయ నాయకులు దూర దృష్టికి దూరమై హిందీ రాష్ట్రాల పేర్ల బాటపట్టారు. అంతేగాదు, పరాయి పాల కుల కింద (నైజాం, బ్రిటిష్) శతాబ్దాలపాటు అణగారిపోయి పుట్టకొకరు చెట్టు కొకరుగా చెల్లాచెదురైపోయిన తెలుగు ప్రజలు తిరిగి ఒక్క గొడుగు కింద విశా లాంధ్ర ఉద్యమం ద్వారా ఐక్యం కావలసివచ్చింది. ఈ ఐక్యత అంత తేలిగ్గా రాలేదు.

ఇటు నిజాం నిరంకుశ పాలనకు, అటు కోస్తాంధ్రలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దశాబ్దాల తరబడి నడిచిన ప్రజా పోరాటాలు కాలక్రమంలో పరాయి పాలనల నుంచి జనాలను రాజకీయంగా విముక్తి చేయగలిగాయి. ఈ పోరాటాల వెనక ప్రజల మహోన్నత త్యాగాలున్నాయి. మరీ ముఖ్యంగా ఉభయ ప్రాంతాలలోని రైతాంగ - వ్యవసాయ కార్మికోద్యమాలు సమరశీలంగా ముందుకు సాగాయి. ఈ పూర్వ రంగంలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో ఆరేళ్లపాటు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సాగి చరిత్ర సృష్టించింది. ఈ సాయుధ పోరాటంలో మూడు తెలుగు ప్రాంతాలకు చెందిన బిడ్డలూ పాల్గొన్నారు. మొత్తం నాలుగు వేల మంది నేలకొరిగారు. అది దొరల, దేశ్‌ముఖ్‌ల, పటేల్, పట్వారీల దోపిడీ విధానానికి వ్యతిరేకంగా, వారి అండతో రాజ్యమేలుతూ వచ్చిన నిజాం నిరంకుశపాలనపై సాగిన భీకర సమరం. అందు వల్ల ‘ఆంధ్రప్రదేశ్’ అనే దుష్ట సమాస భూయిష్టమైన పేరుకు బదులు యావత్తు తెలుగుదేశానికీ (మూడు ప్రాంతాలు ముప్పేటగా) ‘తెలంగాణం’’ (లేదా ‘తెలంగాణ’) అనే పేరును స్థిరపరుస్తూ రాజ్యాంగ సవరణకు ఉద్యమించడం తెలుగుజాతి సమైక్యతకు అత్యవసరం.

‘తెలంగాణ’ శబ్దోత్పత్తి

మన తెలుగు పాలకులకన్నా మొగలాయి పాలకులే ఎక్కువ తెలివి గలవాళ్లని పిస్తుంది. ఎందుకంటే, విజయనగర సామ్రాజ్యం పతనమయిన తరువాత 15-16 శతాబ్దాల కాలంలో అటు తెలుగుల (ఆంధ్ర) కోస్తా ప్రాంతం నుంచి ఇటు దక్కన్ భూభాగం వరకూ, నేడు తెలంగాణ వరకూ మొగలాయిల (ముస్లిముల) పాలనలోనే ఉంది. ఆ కాలంలో ఏ తెలుగు పండితుడు, లేదా ఏ తెలుగు విజ్ఞాని సూచించాడో గాని తెలుగు వారున్న ప్రాంతాలకు ‘తెలంగాణం’ అన్న పేరును ముస్లిం పాలకులు సహృదయంతో స్వీకరించి, ఆ నాటి భారతదేశ పటంలోకి ఆ పదాన్ని ఎక్కించారు. ఈ చారిత్రక నేపథ్యంలో అటు కోస్తా నుంచి ఈ కొసదాకా ఉన్న యావదాంధ్ర దేశమూ తెలంగాణమే అవుతుం దని మరచిపోరాదు. తెలుగు వారికి ఆణెము ‘తెలంగాణము’. ఆణియము / ఆణెము అంటే ‘దేశము’, ‘ఆణియ’ రూపాంతరం ‘ఆణెము’. ‘ఆణము’ అంటే దేశమనేగాక, చోటు, నివాసం, స్థిరనివాసం అని కూడా అర్థాలు ఉన్నాయి. అంటే తెలుగు వారుండే యావదాంధ్ర దేశమూ లేదా తెలుగు దేశమే తెలంగాణమని అక్షరసత్యంగా నిరూపణ.

ఈ పదానికి ఇప్పటికి 90 సంవత్స రాల క్రితమే అంటే కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాలన్నీ పరాయి పాలనలో మగ్గుతున్న రోజులలోనే 1921లోనే, అక్కిరాజు ఉమాకాంత విద్యాశేఖరులు మద్రాసు నుంచి తెలుగుదేశ ‘వాఙ్మయ’ పత్రికను నడుపుతూండేవాడు. ఆ సమయంలో ఆయన అప్పట్లో ఉనికిలో ఉన్న ‘తెలుగుదేశపు వాఙ్మయ సమితి’ని ‘తెలంగాణ లిటరేచర్ అసోసియేషన్’ అని ఇంగ్లిష్‌లో సమానార్థకంగా ప్రతిపా దించడం చూస్తే ‘మొత్తం తెలుగునాడునే ఆయన తెలంగాణగా భావించడం స్పష్టమవుతుంద’ని పండిత - పాత్రికేయ తరానికి చెందిన తిరుమల రామ చంద్ర ఏనాడో పేర్కొన్నారు! తెలుగుజాతిని రెండుగా చీల్చే ప్రయత్నంలో ఉన్న ప్రబుద్ధులు (మూడు ప్రాంతాలలోని మూఢమతులు) ‘తెలంగాణ’ పదానికున్న విస్తృతార్థాన్ని విశాలమైన దృక్పథంతో గుర్తించి, రాష్ట్రాల పేర్లను మార్చుకోడా నికి భారత రాజ్యాంగం 3వ అధికరణం ద్వారా (3(ఇ)క్లాజు) కల్పించిన హక్కును సద్వినియోగం చేసుకుని యావత్తు తెలుగుదేశాన్ని ‘ఆంధ్రప్రదేశ్’ స్థానే ‘తెలంగాణ’ రాష్ట్రంగా ప్రకటింపచేయడం సముచితంగా ఉంటుంది.

3వ అధికరణంలోని మొదటి నాలుగు క్లాజుల (ఎ/బి/సి/డి) వల్ల రాష్ట్రాల పునర్వి భజన ద్వారా వివిధ భాగాలతో కొత్త రాష్ట్రాలను ఏర్పరచడంలో గతంలో ఎదు రైన సమస్యలలో రాష్ట్రం పేరు నిర్ణయం కూడా ఒకటి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన కమ్యూనిస్టు పార్టీ ‘విశాలాంధ్ర’ నినాదానికి తెలంగాణలోని సాంస్కృతికోద్యమ పితామహులయిన మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి లాంటి ఉద్దండులతో కలిసి నిర్మించిన ‘ఆంధ్ర మహాసభ’లే స్ఫూర్తినిచ్చాయి. అయితే నాటి కాంగ్రెస్ ‘పెద్దల’కు వచ్చిన పెద్ద చిక్కల్లా కమ్యూనిస్టులు ‘విశాలాంధ్ర’ పదాన్ని నినాదంగా మార్చి విశాలాంధ్రోద్యమాన్ని అఖండంగా నిర్మించడమే! ‘విశాలాంధ్ర’ పదం కమ్యూ నిస్టుల హక్కు భుక్తమని భావించిన ‘పెద్ద మనుషులు’ కమ్యూనిస్టు వ్యతిరేక తతో రాష్ట్రాన్ని అటు ‘విశాలాంధ్ర’గానో, ‘తెలుగునాడు’గానో, ‘తెలంగాణ’ గానో నామకరణం చేయకుండా ‘ఆంధ్రప్రదేశ్’ అనే మనది కాని మాటను తగిలించేశారు.

తెలుగువారు నివసించే అన్ని ప్రాంతాలతో కలిసి దీపించేదే తెలంగాణ అయినప్పుడు యావదాంధ్రులకు అది శిరోధార్యం కావాలి. ఈ విషయంలో ముక్కు చిట్లింపులకు, మూతి తిప్పుళ్లకూ, ముఖాలు మాడ్చుకోడానికి ఎవరికీ ఎలాంటి అవకాశం ఉండదు! పైగా మూడు ప్రాంతాల్లో ఏ ప్రాంతంలోని వారికీ ఇది వ్యతిరేకమూ కాదు.

మొత్తం ‘ఆంధ్రప్రదేశ్’ రాష్ట్రాన్ని ‘తెలంగాణ’గా ప్రకటించాలని కోరుతూ నిజంగా తాము ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామ నుకునే లెజిస్లేటర్లు (అన్ని పార్టీల వారూ) అందరూ ఏకవాక్య తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టవచ్చు. ఆ మేరకు రాజ్యాంగ సవరణ చేయాలని తీర్మానించవచ్చు. లెజిస్లేటర్లు ఈ వైపుగా బుర్రలు ఉపయోగించగలిగితే తెలుగు ప్రజల విశాల ప్రయోజనాలకు, ఐక్యతకూ ఎనలేని సేవ చేసిన వారవుతారు. ఈ ప్రత్యామ్నాయ ప్రయత్నం ద్వారా ఇంటాబయటా బజారు పాలైన తెలుగు జాతి పరువును కాపాడిన వారవుతారు. ‘చూస్తూ ఉంటే మేస్తూ పోయింద’న్న సామెతను తిరగేసి సామాన్య ప్రజల మూలుగల్ని పీల్చుతున్న వారిని మాత్రం ప్రజలు చూస్తూ ఊరుకోరు. రాష్ట్రం పేరును ‘తెలంగాణ’గా మారుస్తూ రాష్ట్ర శాసనసభతో పాటు పార్లమెంటులో కూడా ఆమోదింపజేసుకోవడం తేలిక. అందుకు తగిన రాజ్యాంగ సవరణా సుగమమవుతుంది. ఈ ప్రతిపాదనకు విముఖులైన వారు చరిత్ర హీనులవుతారు!  


- ఏ బీ కే ప్రసాద్, సీనియర్ పాత్రికేయులు 
సాక్షి దినపత్రికలో ప్రచురింపబడింది


2 కామెంట్‌లు:

  1. bane undi. telugunadu aite inka better. manalO unity vastundi tamilians laga.

    రిప్లయితొలగించండి
  2. ఈ విసృహయం నేను ఎప్పుడో నా రచనల్లో వ్రాశాను.కాని మూడు ప్రాంతాల్లోకూడా మేధావులమనుకొనే వాళ్ళు కూడా అర్థం చేసుకోరు.ఏం చేస్తాం ?

    రిప్లయితొలగించండి