ఈ కింది సామెతలను చూస్తే మన పెద్దలు ఎంత అనుభవంతో దేశ కాలమాన పరిస్థితులు ఏవైనా, అన్వయ పరచుకొనే విధంగా ఉంటాయో మన తెలంగాణా కాంగ్రెస్ నాయకుల ప్రవర్తనని చూసీ ఈ సామెతల అర్థం ఈ విధంగా చెప్పుకోవచ్చు.
1 .చెప్పుడు మాటలు వింటే చెడిపోతావు. 2.తెగే వరకూ లాగకూడదు.3. దుష్టులతో/శత్రువులతో స్నేహం పాము పడగ నీడ వంటిది. 4. పెద్దల మాట వినాలి. 5. పిలవని పేరంటానికి పోరాదు. 6. ముద్దొచ్చినప్పుడే చంక ఎక్కాలి. ఈ ఆరు సామెతలూ మన తెలంగాణా కాంగ్రెస్ నాయకులకు సరిగ్గా సరిపోతాయి.
అది ఎలాగంటే:
1. చెప్పుడు మాటలు వింటే చెడిపోతావు: మన తెలంగాణా నాయకులు ఏదో ఒక ప్రలోభానికి లేదా ఒక నాయకుడి చెప్పుడు మాటలు విని ఎవరు ఎన్ని చెప్పినా వినకుండా రాజీనామాలు చేసి పారేసారు. ఇప్పుడు వీరి పని ఏమి చేయాలో ఏమిటో తెలియని అయోమయ స్థితి లో పడ్డారు. ఈ విధంగా ఒక స్వార్థ నాయకుడి మాటలు విని చెడిపోయారు.
2. తెగేవరకూ లాగ కూడదు: ఈ నాయకులు గత ఐదు, ఆరు నెలల నుండి మేము రాజీనామాలు చేయడానికి సిద్ధం, రాజీనామాలు చేసేస్తాం, చేయబోతున్నాం, ఇంక ఈ ఆలస్యాన్ని భరించలేము, తొందరగా తెలంగాణా ప్రకటిస్తారా లేదా రాజీనామా చేసి మా దారి చూసుకోమంటారా, ఇత్యాది ప్రశ్నలతో బెదిరింపులతో వారి పార్టీ హై కమాండ్ ని రోజుకో బెదిరింపుతో, ప్రకటనతో ఊదరగోడితే ఆఖరికి అన్యాపదేశంగా కాంగ్రెస్ హై కమాండ్ మీరు మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అనే విధంగా ప్రవర్తించాల్సిన అగత్యాన్ని పట్టించారు. దీనినే అంటారు తెగే దాకా దేనినీ లాగ కూడదు. ఈ విషయం మన తెలంగాణా కాంగ్రెస్ నాయకులకు చాలా ఆలస్యంగా ప్రబోధం అయింది.
3. దుష్టులతో/శతృవులతో స్నేహం పాము పడగ నీడ వంటిది: మన తెలంగాణా కాంగ్రెస్ నాయకులకు అన్ని పార్టీలు తెలంగాణా తెలుగుదేశం తో సహా తమ శతృవు అయిన టీ ఆర్ ఎస్ పార్టీ యొక్క విషపుటాలోచనలు అంటే తన పార్టీని పటిష్టం చేసుకోవాలని ఎత్తులు వేస్తున్నదని కాంగ్రెస్ హై కమాండ్ మరియూ ఇతర పార్టీల నాయకులు నెత్తీ, నోరూ కొట్టుకొని చెప్పినా వినిపించుకోకుండా రాజీనామాలు చేసి పారేసారు. ఆ తర్వాతా తామేదో గొప్ప ఘనకార్యాన్ని సాధించామని ఢిల్లీ వెడితే అక్కడి నాయకులు వీళ్ళని హీనంగా చూసీ మీ నాయకుడు కేసీఆర్ కదా అనే అర్థం లో అవహేళన చేసారు. తీరా హైదరాబాద్ చేరుకోన్నాక చూస్తే అప్పటికే ఆయన గారు తన ఇంటి పనిమనిషి లాంటి ప్రొ. కోదండ రామ రెడ్డి గారితో కలిసి తన విషాన్ని వేరే విధంగా అంటే కొత్త ఆందోళనల షెడ్యూల్ తయారుచేసి, కనీసం వీళ్లు చేసిన త్యాగాలను కూడా తలవకుండా, తన ఇష్టం వచ్చినట్లు ప్రకటించడం జరిగింది. అంటే వీళ్లు శతృవు తో స్నేహం చేసి నష్ట పోయారన్నమాట. ఇంకా చెప్పాలంటే వీరి 48 గంటల దీక్షని 36 గంటలకు కుదించి దాని విరమణ మహోత్సవానికి టీఆరెస్ నాయకులు శ్రీ కేసీఆర్ గారు విచ్చేసి వీరు ఏర్పాటు చేసిన వేదిక మీదనే వీళ్ళెంత మూర్ఖ శిఖామణులో ఋజువు చేసి తన విషాన్ని కక్కి పోయాడు. అంటే వీరి డబ్బుతో వీళ్ళని పోగిడినట్లుగా మాట్లాడి తాను శతృవునే కానీ మితృడుని కాదు అని నిరూపించి మరీ పోయాడు.
4. పెద్దల మాట వినాలి: ఢిల్లీ లోని కాంగ్రెస్ పెద్దలు మీరు రాజీనాలు చేయాలని తొందర పడొద్దు అని ఎన్నో సార్లు ఈ తెలంగాణా కాంగ్రెస్ నాయకులకి చిన్న పిల్లలకు చెప్పినట్లుగా అంటే తల్లిదండ్రులు, ఇంటిలోని పెద్దవారు చిన్న పిల్లలకు ఫలానా పని చేయొద్దని చెప్పిన విధంగా నచ్చ చెప్పారు. కానీ అనవసర ప్రలోభానికి లోనై, ఒక రకమయిన బ్లాక్ మెయిల్ కి లొంగి రాజీనామాలని సమర్పించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పెద్దల కోపాన్ని చవిగోన్నారు. అంటే పెద్దల మాట వినని దానికి ఫలితం అనుభవిస్తున్నారు.
5. పిలవని పేరంటానికి పోరాదు: ఈ తెలంగాణా కాంగ్రెస్ నాయకులు ఒకటికి పది సార్లు వారి హై కమాండ్ పిలిచినా పిలవక పోయినా ఢిల్లీ కి పోయి వారి మీద ప్రత్యెక తెలంగాణా కి సానుకూల ప్రకటన కోసం వత్తిడి చేయడం ప్రారంభించారు. వీరికి శ్రీ జైపాల్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడు ఆ విధంగా చేయవద్దని చెప్పినా వినకుండా పోయి ఎక్కే గుమ్మం, దిగే గుమ్మం మాదిరి చేసారు. దానితో పై వారి దృష్టిలో చులకన అయిపోయారు. వీళ్లు ఆఖరుసారి రాజీనామాలు చేసి కాంగ్రెస్ హై కమాండ్ పిలవకపోయినా వారి గుమ్మాల లోకి వెళ్ళిన వెంటనే దక్ష ప్రజాపతి పుత్రిక శచీదేవికి జరిగిన విధంగా అవమానం పొంది తిరిగివచ్చారు. అనగా పిలవని పేరంటానికి పోయిన విధంగా వీళ్లు వెళ్లారనే కదా అర్థం.
6. ముద్దొచ్చినప్పుడే చంక ఎక్కాలి: ఈ బ్లాగు రాయడానికి రెండు రోజుల క్రితం కాంగ్రెస్ హై కమాండ్ సీమాంధ్ర నేతలతో బాటు మన తెలంగాణా నాయకులను కూడా ఢిల్లీ రమ్మనమని శ్రీ ఆజాద్ ద్వారా కబురుపెడితే, సీమాంధ్రులు తాము తప్పకుండా వస్తామని సమాధానము చెప్పి, ఆ తర్వాత మిగిలిన హై కమాండ్ నేతలను మరియూ ప్రధాన మంత్రి ని కలవడానికి వారి అనుమతులు సంపాదించుకొంటే, మన తెలంగాణా కాంగ్రెస్ నాయకులు మాత్రం శ్రీ ఆజాద్ తమని అవమానము చేసారని మేము ఢిల్లీ కి పోమని తమ లింగు, లిటుకుమంటూ ఉన్న స్టీరింగ్ కమిటీలో ఒక తీర్మానం చేసి దానికి తగిన విధంగా ఢిల్లీ కబురు పంపారు. దానితో హై కమాండ్ ఈ నాయకులను తమదైన శైలిలో ఫోన్లో ఆజాద్ తో చెప్పిస్తే ఇప్పుడు మేము మీటింగుకు వెడతామని చెబుతున్నారు. అంటే వీళ్లు ముద్దోచ్చినప్పుడు చంకను ఎక్కరు. అవతలివాడు వీరిని రెండు తిడితేగాని లేదా బెదిరిస్తే కానీ వీళ్లు దారిలోకి రారు.
అందుచేత పైన చెప్పిన సామెతలకు అనుగుణంగానే మన తెలంగాణా నాయకుల ప్రవర్తన ఉంది అనేది కాదనలేని కఠోర సత్యం.
రాళ్ళబండిగారూ,
రిప్లయితొలగించండిదక్షప్రజాపతి కూతురి పేరు 'శచీదేవి' కాదండీ. శచీదేవి ఇంద్రుని భార్య. దక్షిణామూర్తి భార్య పేరు 'సతీదేవి'.
ఆచంగా గారూ, మీరు చెప్పినట్లుగానే నేను రాసిన పేరు తప్పు. దక్ష ప్రజాపతి కుమార్తె పేరు సతి దేవి. నా ఈ అలసత్వానికి, తప్పుకు నన్ను క్షమించగలరు.
రిప్లయితొలగించండిరాళ్ళబండి గారూ,
రిప్లయితొలగించండిపెద్దవారు చిన్నవారిని క్షమాపణ అడుగరాదు.