24, జులై 2011, ఆదివారం

ఉద్యమాల సెగ.. ఉద్యోగాలకు పొగ

(సూర్య దినపత్రిక,జనరల్‌ బ్యూరో): రాజకీయ పార్టీలు రెచ్చగొట్టాయి.విద్యార్థులు రెచ్చిపోయారు. నేతలు ఉసిగొల్పారు. విద్యార్థులు తెలియని ఉత్సాహంలో విధ్వంసాలకు దిగారు.మీడియాలో వారి హీరోయిజం పతాకశీర్షికలకెక్కింది. ఉద్యమస్ఫూర్తితో పోలీసుస్టేషన్లకు వెళ్లారు.నేతలు వచ్చి పరామర్శించారు. వారికి మద్దతుగా బైఠాయించారు. కానీ.. ఆ ఫలితాన్ని ఆ అమాయక విద్యార్థులు ఇప్పుడు మరొక రూపంలో అనుభవిస్తున్నారు. అది వారి భవిష్యత్తును, జీవనభృతికి పెనుశాపంలా పరిణమించింది. జాతీయ- అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగాలపై గంపెడాశలు పెట్టుకున్న విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లేలా.. ఉద్యమాల్లో ఉస్మానియా విద్యార్థులు పాల్గొంటున్నం దున వారిని ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు కార్పొరేట్‌ కంపెనీలు నిరాకరిస్తు న్నాయి.

పోలీసు కేసులుంటే మాకొద్దంటున్నాయి. దీనితో.. ఆరుగాలం కష్టపడి తమ వారసులను చదివిస్తున్న తలిదండ్రుల గుండెల్లో గునపాలు గుచ్చుకు న్నట్టయింది. ఇది ఒక్క ఉస్మానియాకే పరిమితం కావడం లేదు. సీమాంధ్రలోని యూనివర్శిటీ విద్యార్థులకూ విస్తరించనుంది. ఉద్యమాల్లో పాల్గొంటున్న వారిని, కేసులు ఉన్న విద్యార్ధులను ఉద్యోగాల్లోకి తీసుకోకూడదని కార్పొరేట్‌ కంపెనీలన్నీ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు ఆయా కంపెనీల హెచ్‌ఆర్‌లు బాహాటంగానే చెబుతున్నారు. రాజకీయ పార్టీల చదరంగంలో పావులుగా మారుతున్న అన్ని ప్రాంతాల విద్యార్థులకు ఇదో కనువిప్పు. గుణపాఠం. ఉద్యమాల వల్ల తెలంగాణలో స్థాపించాలని గతంలో భావించిన కంపెనీలు ఇప్పుడు మనసు మార్చుకున్నాయి. సీమాంధ్ర, పరాయి రాష్ట్రాల వైపు దృష్టి సారిస్తున్నాయి.

ఇది మొత్తంగా బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు శరా ఘాతం. అటు తమను రెక్కలుముక్కలు చేసి చదివించిన తలిదండ్రులకు న్యాయం చేయలేక, ఇటు తాము చదివిన ఉన్నత చదువుల వల్ల తగిన ఉద్యోగా లు రాక మానసికంగా నలిగిపోతున్న దయనీయ స్థితి. వరుస ఉద్యమాలతో ఉస్మానియా యూనివర్సిటీ(ఓయు) రావణకాష్టంగా మారడంతో, ఓయు పరిధిలో ఉత్తీర్ణులైన ఇంజనీరింగ్‌, ఇతర కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులను ఉద్యోగాల్లోకి తీసుకోవడంలో కార్పొరేట్‌ ఐటీ కంపెనీలు నిరాసక్తత వ్యక్తం చేస్తున్నాయి. పోరాటాల్లో పాల్గొంటున్న తెలంగాణ, సీమాం ధ్ర విద్యార్థులను ఉద్యోగాల్లోకి తీసుకుంటే వారి తిరుగుబాటు ధోరణి ప్రభావం తమ కంపెనీలపై ఎక్కడ పడుతుందోనన్న భయాందోళనే దానికి కారణం.

గడిచిన మూడేళ్లుగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం పేరుతో విద్యార్థుల పోరాటాలు రోజురోజుకీ తీవ్రతరం కావడంతో.. ఓయూ, జెఎన్‌టియు పరిధిలో డిగ్రీ, పీజీలు చేసిన విద్యార్థులకు ఉన్నత స్థాయి ఐటీ ఉపాధి అవకాశాలు అందని ద్రాక్షగా మారాయి. అదే సందర్భంలో గతంతో పోల్చుకుంటే గడిచిన మూడేళ్లలో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ అవకాశాలు కూడా గణనీయంగా తగ్గినట్లు యూనివర్సీటీ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి

దీంతో ఇంజనీరింగ్‌, ఎమ్‌బిఏ, ఎమ్‌సిఏ, బయోటెక్నాలజీ తదితర కోర్సుల్లో డిగ్రీ, పీజులు పూర్తి చేసిన విద్యార్థులు సరైన ఉపాధి అవకాశాలు లభించక గత మూడేళ్లుగా అదనపు కంప్యూటర్‌ కోర్సులు చేస్తూ కాలం క్షేపం చేస్తున్నట్లు అమీర్‌పేటకు చెందిన ప్రముఖ మానవ వనరుల శిక్షణ సంస్థ పేర్కొన్నది. తాజాగా ఓయూ, జెఎన్‌టియు విద్యార్థుల ప్రయోజనాలకు విరుద్ధంగా కార్పొరేట్‌ కంపెనీలు వ్యవహారిస్తున్న తీరు, వారికి ఉద్యోగాలు నిరాకరిస్తున్న వైనంపై బెంగుళూరుకి చెందిన ప్రముఖ అంతర్జాతీయ ఐటీ కంపెనీకి చెందిన హెచ్‌ఆర్‌ నిపుణుడిని ప్రశ్నించగా.. ఆందోళనలు, పోరాటాల్లో పాల్గొన్న విద్యార్థుల్లో ప్రతిభ ఉన్నప్పటికీ వారి మానసిక స్థితి కంపెనీలపై ప్రభావం చూపే ప్రమాదం ఉన్నందున ఉద్యోగాలపై కొన్ని నియంత్రణలు రూపొందించినమాట నిజమేన ని అంగీకరించారు.

గత మూడేళ్లలో ఎంతమందిని రిక్రూట్‌ చేశారని ప్రశ్నించగా.. స్పష్టమైన సమాచారం చెప్పకుండా ఆయన జారుకోవడం గమనార్హం. గత మూడేళ్లలో ఓయూ, జెఎన్‌టియు పరిధిలో అరకొర క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ ఇంటర్వ్యూలు, క్యాంపస్‌ జాబ్‌ ఫెయిర్స్‌ ఉద్యోగ మేళాలు నిర్వహించడమే తాజా పరిస్థితులను స్పష్టం చేస్తున్నాయని మరో హెచ్‌ ఆర్‌ నిపుణుడు వాపోయారు.

తరలుతున్న బీపీఓ కంపెనీలు...!
రాష్ట్రంలో గత మూడేళ్లలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బీపీఓ, ఐటీ కంపెనీలు తమ ఆపరేషన్స్‌ను బెంగుళూరు, నోయిడా వంటి ప్రత్యామ్నాయ ప్రాంతాలకు తరలించాయి. కొత్తగా కొన్ని వైజాగ్‌లో స్థాపించాయి. ఈ కంపెనీలు శాశ్వత పద్ధతిలో తమ సొంత కార్పొరేట్‌ కార్యాలయాలను ఇక్కడ నెలకొల్పడానికి గతంలో ఏపీఐఐసీ నుంచి భూములు పొందినప్పటికీ.. తాజాగా హైదరాబాద్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా సదరు కంపెనీలు ప్రస్తుతం తమ ప్రణాళికలు మార్చుకున్నట్లు విశ్వసనీయ అధికార వర్గాల తెలిపాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో జాతీయ, అంతర్జాతీయ ఐటీ, బీపీఓ కంపెనీలు తమ తదుపరి విస్తరణ ప్రణాళికలను కూడా బెంగుళూరు, నోయిడా, ముంబాయి, పూణే వంటి ప్రధాన భారతీయ నగరాలకు ఇప్పటికే తరలించాయి.

ఎంబసీల్లోనూ అదే పరిస్థితి...!
అమెరికా, ఇతర విదేశీ ఎంబసీలు కూడా స్థానిక ఓయూ, జెఎన్‌టియు పరిధిలోని విద్యార్థులకు వీసాలు జారీ చేసే విషయంలోనూ తర్జనభర్జన పడుతున్నట్లు తెలిసింది. ప్రధానంగా ప్రత్యేక రాష్ట్రం కోరూతూ ఉన్నత విద్య అభ్యసిస్తున్న ఇంజనీరింగ్‌, ఎమ్‌సిఏ, ఎమ్‌బిఏ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆత్మబలిదానాలకు పాల్పడడంతో... తాజా పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. తమ దేశాల్లో విద్యా, ఉపాధి అవకాశాల నిమిత్తం విద్యార్థులు, యువత అక్కడికి వెళ్లిన తర్వాత ప్రత్యేక రాష్ర్టం కోసం ఆత్మ బలిదానాలకు పాల్పడితే .. తమకు కూడా అంతర్జాతీయంగా చిక్కులు తప్పవని విదేశీ ఎంబసీలు కలవరం వ్యక్తం చేస్తున్నట్లు నిఘా వర్గాల ద్వారా తెలిసింది. ఈ క్రమంలో విద్యార్థులను మరింత లోతుగా స్క్రీనింగ్‌ చేయడానికి మానసిక నిపుణులనుసైతం నియమించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.

సర్కార్‌ ఉద్యోగానికి చుక్కెదురే..!
చివరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ ఉద్యమాల్లో పాల్గొన్న విద్యార్థులకు చుక్కెదురవుతోంది. ఇప్పటికే విద్యార్థులపై బనాయించిన కేసులతో వారు కోర్టులు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. మరోవైపు రాష్ర్ట ప్రభుత్వం వారిపై గతంలో ఇచ్చిన హామీ మేరకు అన్ని కేసులను ఎత్తివేయలేదు. దీనితో విచారణకు వచ్చిన పోలీసులు వారిపై కేసులు ఉండటంతో అదే నివేదిక అందిస్తున్నారు. చివరకు పోలీసు ఉద్యోగాల్లో సైతం ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఈ పరిస్థితుల్లో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర మనోవేదన పడుతున్నారు.

సీమాంధ్ర విద్యార్థులకూ అదే పరిస్థితి
ఇదిలాఉండగా, ఉద్యమాల్లో పాల్గొంటున్న సీమాంధ్ర విద్యార్థులకూ ఇలాంటి పరిస్థితి ఎదురుకానుంది. ప్రస్తుతం అక్కడ తెలంగాణ స్థాయిలో ఉద్యమాలు లేకపోయినా, విశాఖ, విజయవాడ, గుంటూరు, అనంతపురం వంటి నగరాల్లో విద్యార్థులు ఉధృతంగా ఉద్యమిస్తున్నారు. ఫలితంగా చాలామందిపై కేసులు నమోదయ్యాయి. అక్కడ నిర్వహించే క్యాంపస్‌ ఇంటర్వ్యూలలో సైతం కార్పొరేట్‌ కంపెనీలు ఇలాంటి విధానాన్నే అమలు చేయాలని భావిస్తున్నట్లు ఆయా కంపెనీల మానవ వనరుల విభాగం అధికారుల మాటలు స్పష్టం చేస్తున్నాయి.

1 కామెంట్‌:

  1. Krishna Mohan
    ఒక విషయం చెప్పండి, గుండు చేయించుకుంటే అసలు నక జుట్టు రాదు అనుకుంటే ఎంత మంది గుండు చేయించుకుంటారు ?

    Vijay Bhaskar Chaganti ఒక్కడు కూడా చేయిన్చుకోడు

    Krishna Mohan ఇది కూడా అంతే రాజీనామాలు రిజెక్ట్ అవుతాయి అని తెలుసు కాబట్టే అందరూ చేసారు..

    rakthacharithra..

    రిప్లయితొలగించండి