26, జులై 2011, మంగళవారం

ఎవరిని తప్పుదారి పట్టించవచ్చారు?

తెలంగాణా ప్రాంత కాంగ్రెస్ నాయకులు గులాం నబీ ఆజాద్ను కలిసి కాంగ్రెస్ పార్టీ ఏయే సందర్భాలలో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిందో వివరించినట్లు వార్తలొచ్చాయి. ప్రత్యక్ష ఎన్నికలకు ఆమడ దూరంలో ఉండే వి.హన్మంతరావు మరికొందరు నాయకులు ఈ మధ్య మాటి మాటికీ 'కాంగ్రెస్ 2004 లో తెరాసతో పొత్తు పెట్టుకున్నప్పుడు సీమాంధ్ర నాయకులు ఎందుకు నిశబ్దం పాటించారు' అని మీడియా ద్వారా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వీరు సూటిగా ఒక్క ప్రశ్నకు నిజాయితీ గా జవాబు చెప్పగలరా?  2004 వరకూ పోనవసరం లేదు, 2009 డిసెంబర్ లో   కేసీఆర్ తన దీక్షను విరమించి దొంగచాటుగా నిమ్మకాయ రసం పుచ్చుకునప్పుడు గాని, ఆ తర్వాత నిమ్స్ లో  ఐవీ ఫ్లూయిడ్స్ పుచ్చుకుంటూ వెరైటీ దీక్ష చేసినప్పుడు కాని, కేంద్ర హోం మంత్రి చిదంబరం 'తెలంగాణా రాష్ట్ర ప్రక్రియ' అంటూ డిసెంబర్ 9 న అర్థరాత్రి ఒక ప్రకటన జారి చేసేవరకూ మీలో ఏ ఒక్కడైనా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయబడుతుంది అని నమ్మారా? అసలు ఏకపక్షంగా తెలంగాణా ఏర్పాటు చేసేస్తాం అని ఎవరు ఎప్పుడు హామీ ఇచ్చారు? ఆఖరికి చిదంబరం అత్యుత్సాహంతో రాత్రికి రాత్రి హడావుడిగా చేసిన ప్రకటనలో కూడా ఏకపక్ష నిర్ణయాలు ఉంటాయని కాని, రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం లేకుండా రాష్ట్ర ఏర్పాటు జరుగుతుందని గాని చెప్పలేదు. 2004 లో కాంగ్రెస్ స్వరాజకీయ ప్రయోజనాలకు తెరాసతో చేతులు కలిపింది. అప్పుడు కాంగ్రెస్ కేవలం రెండవ ఎస్సార్సీ కి కట్టుబడి ఉంటామని చెప్పింది. ఎన్నికల్ల తర్వాత కామన్ మినిమం ప్రోగ్రాం లో కూడా అదే మాట చెప్పింది.ఎల్లప్పుడూ 'CONSENSUS'  అన్న మాటకు ప్రాధాన్యం ఇస్తూ తెలంగాణా ఏర్పాటు గురించి అందరితో కలిసి ఆలోచిస్తామని చెప్పింది కాని ఏకపక్షంగా, ఇతరుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోకుండా, ఒక ప్రాతిపదిక అంటూ లేకుండా రాష్ట్రవిభజన గావిస్తామని చెప్పలేదు. వైఎస్సార్ సమైక్యవాదని తెలిసికూడా  అతని నాయకత్వాన్ని మీరందరూ ఆమోదించలేదా ? ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ లో 'CONSENSUS' లేదా 'ఏకాభిప్రాయం' అని గొంతెత్తి చాటినపుడు మీరెందుకు మిన్నకుండిపోయారు?

కాంగ్రెస్ సంగతి ఇలా వుంటే అసలు తెరాస నాయకుల మాటేమిటి? వారు దేనిని నమ్మి కాంగ్రెస్, ఆ తర్వాత మహాకూటమి చెంత చేరారు? ఎంతసేపూ తమ ఉనికిని కాపాడుకోవాలని చూశారు తప్ప ప్రత్యేక రాష్ట్రం వచ్చేస్తుందని వారు మాత్రం నమ్మారా? 2004 లో తెరాస తరపున కేసీఆర్ ఆమోదించి పంపిన ఏ.నరేంద్ర రెండవ ఎస్సార్సీ కి ఒప్పుకుంటూ సంతకాలు చేయలేదా? 





ఆ తర్వాత కామన్ మినిమం ప్రోగ్రాం లో ఉన్నట్లుగా రెండవ ఎస్సార్సీకి, CONSENSUS అన్న పదానికి తమ ఆమోదం తెలిపి యూపీఏ ప్రభుత్వంలో  చేరలేదా?

Extract from Common Minimum Programme: "The UPA government will consider the demand for the formation of a Telangana state at an appropriate time after due consultations and consensus"


ఇప్పుడు ఎవరిని తప్పుదారి పట్టించాలని?

1 కామెంట్‌: